పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బ్రిటన్‌లో తన అధికారిక పర్యటనను కొనసాగిస్తున్నారు. ఈ పర్యటన ద్వారా రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు, పశ్చిమ బెంగాల్ మరియు బ్రిటన్ మధ్య బంధాన్ని మరింత గాఢతరం చేయాలనే ఉద్దేశంతో ఆమె లండన్ వెళ్లారు. ఆదివారం లండన్ చేరుకున్న ఆమె, సోమవారం ఉదయం స్థానిక హైడ్ పార్క్ లో జాగింగ్ చేస్తూ లండన్ వాతావరణాన్ని ఆస్వాదించారు.

హైడ్ పార్క్‌లో మమతా జాగింగ్
సాధారణంగా భారత రాజకీయ నేతలు విదేశీ పర్యటనలకు వెళ్లినప్పుడు అప్రమత్తంగా ఉండే భద్రతా నిబంధనలు, కట్టుదిట్టమైన షెడ్యూల్ లాంటి అంశాలు ఉంటాయి. అయితే మమతా బెనర్జీ మాత్రం తన సౌకర్యం కోసం హైడ్ పార్క్‌లో నడక, జాగింగ్ చేయడం విశేషం. తెల్ల చీర, వైట్ స్లిప్పర్స్ ధరించి, సాధారణంగా ఉంటూ తన స్వభావానికి తగ్గట్టుగా మమతా ప్రజల మధ్య మమేకమయ్యారు. ఈ దృశ్యాలను తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నేత కూనాల్ ఘోష్ తన అధికారిక ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో పంచుకున్నారు. మమతా బెనర్జీ లండన్ పర్యటన విశేషాలను స్వయంగా ఎక్స్ లో పంచుకున్నారు. ఆమె మాట్లాడుతూ-
లండన్ కూడా కోల్‌కతాలాంటి మహానగరమే. ఇది గత చరిత్ర మరియు నేటి డైనమిజం కలిగిన నగరం అనిపేర్కొన్నారు. బ్రిటన్‌తో పశ్చిమ బెంగాల్‌కు వందల సంవత్సరాల అనుబంధం ఉంది అని ఆమె గుర్తు చేశారు. సోమవారం అధికారిక కార్యక్రమాలు ప్రారంభించే ముందు, లండన్ వాతావరణానికి అలవాటు పడేందుకు హైడ్ పార్క్‌లో జాగింగ్ చేశాను అని తెలిపారు. ఈ పర్యటన అనంతరం మమతా బెనర్జీ బృందం పశ్చిమ బెంగాల్ కు విదేశీ పెట్టుబడులు రప్పించేందుకు తీసుకున్న నిర్ణయాలను ప్రకటించనుంది. అలాగే, వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ వ్యూహాన్ని మమత ఈ పర్యటన ద్వారా బలోపేతం చేసే అవకాశం ఉంది.