హైదరాబాద్: మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు నోటీసులు వచ్చాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రధాన ప్రతిపక్ష నేతగా కేసీఆర్ ఎప్పుడు అసెంబ్లీ సమావేశాలకు హాజరైంది లేదు. దీంతో.. కేసీఆర్‌కు ఫెడరేషన్ ఆఫ్ ఫార్మర్స్ అసోసియేషన్ ఇన్ తెలంగాణ సోమవారం (ఫిబ్రవరి 03న) లీగల్ నోటీసులు పంపింది. ఈ మేరకు కేసీఆర్‌కు ఫెడరేషన్ ఆఫ్ ఫార్మర్స్ అసోసియేషన్ ఇన్ తెలంగాణ తరపు న్యాయవాది పాదూరి శ్రీనివాస్ రెడ్డి మెయిల్‌తో పాటు స్పీడ్ పోస్ట్ ద్వారా కూడా లీగల్ నోటీసులు పంపించారు.
అసెంబ్లీకి హాజరుకాని కేసీఆర్‌పై అనర్హత వేటు వేయాలని అసోసియేషన్ జనరల్ సెక్రటరీ విజయ్‌పాల్ కోరారు. అసెంబ్లీలో అపోజిషన్ లీడర్‌గా తన కర్తవ్యాన్ని నిర్వర్తించని మాజీ సీఎం కేసీఆర్‌కు సభలో సభ్యునిగా కొనసాగే అర్హత లేదని నోటీసులో వెల్లడించారు. ప్రజా సమస్యలపై అసెంబ్లీలో కేసీఆర్ పోరాటం చేయాలని.. లేదంటే అసెంబ్లీకి రాని కేసీఆర్‌ను వెంటనే అపోజిషన్ లీడర్‌గా తొలగించాలని డిమాండ్ చేశారు. కేసీఆర్‌కు స్పీకర్ సమన్లు జారీ చేసి వివరణ కోరాలని విజయ్ పాల్ కోరారు.

కాగా, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ఇప్పటి వరకు కేసీఆర్ అసెంబ్లీ వైపు చూడటమే మానేశారు. పూర్తిగా ఫాంహౌజ్‌కే పరిమితమయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి సహా అధికార పార్టీ నేతలు.. ఎన్ని విమర్శలు చేసినా, బహిరంగంగానే ఛాలెంజ్‌లు విసిరినా.. గులాబీ బాస్ మాత్రం మౌనంగానే ఉంటున్నారు తప్పా.. అలాంటి వాటికి ఏమాత్రం స్పందించకపోవటం గమనార్హం. ఇప్పుడు ఏకంగా లీగల్ నోటీసులే పంపించగా.. గులాబీ బాస్ ఎలా స్పందించనున్నారన్నది సర్వత్రా ఉత్కంఠను రేకెత్తిస్తోంది.