హైదరాబాద్ నగరం ఐటీ, వ్యాపార రంగాల్లో దూసుకుపోతోంది. భాగ్యనగరంలోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA) ప్రపంచ స్థాయి సౌకర్యాలతో ప్రయాణికులను ఆకట్టుకుంటోంది. అయితే ఇప్పుడు ఇదే విమానాశ్రయం ప్రయాణికుల జేబులకు చిల్లు పెడుతోంది. అవును మీరు విన్నది నిజమే! ఇతర మెట్రో నగరాలతో పోలిస్తే హైదరాబాద్ నుంచి విమానం ఎక్కడం ఇప్పుడు చాలా ఖరీదుగా మారింది. దీనికి ప్రధాన కారణం ‘యూజర్ డెవలప్‌మెంట్ ఫీజు’ (UDF) భారీగా పెరగడమే. యూజర్ డెవలప్‌మెంట్ ఫీజు అంటే ఏమిటి? సాధారణంగా మనం విమాన టికెట్ బుక్ చేసుకున్నప్పుడు అందులో కేవలం ప్రయాణ ఛార్జీలే కాకుండా కొన్ని అదనపు పన్నులు, ఫీజులు ఉంటాయి. అందులో ఒకటే ఈ యూజర్ డెవలప్‌మెంట్ ఫీజు. విమానాశ్రయంలో మౌలిక సదుపాయాల కల్పన, నిర్వహణ కోసం ప్రభుత్వం లేదా విమానాశ్రయ సంస్థలు ఈ మొత్తాన్ని ప్రయాణికుల నుంచి వసూలు చేస్తాయి. తాజాగా కేంద్ర పౌర విమానయాన శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం, దేశంలోని ఇతర ప్రధాన నగరాల కంటే హైదరాబాద్‌లో ఈ ఫీజు అత్యధికంగా ఉంది.
Read Also: Supreme Court Announcement : పెళ్లికి ముందు శృంగారం.. యువతకు సుప్రీంకోర్టు హెచ్చరిక

హైదరాబాద్‌లో దాదాపు ఐదు రెట్లు ఎక్కువ భారం
హైదరాబాద్ (Hyderabad) నుంచి దేశీయ ప్రయాణం (Domestic) చేసే వారు ప్రతి టికెట్‌పై రూ.750 యూజర్ డెవలప్‌మెంట్ ఫీజుగా చెల్లించాల్సి వస్తోంది. అదే అంతర్జాతీయ ప్రయాణికులకైతే (International) ఈ మొత్తం ఏకంగా రూ. 1,500గా ఉంది. ఇది దేశంలోని ఇతర మెట్రో నగరాలైన ఢిల్లీ, ముంబై కంటే చాలా ఎక్కువ. ఉదాహరణకు, ఢిల్లీలోని ఇందిరా గాంధీ విమానాశ్రయంలో దేశీయ ప్రయాణికులు కేవలం రూ. 129 మాత్రమే చెల్లిస్తున్నారు. ముంబైలో ఇది రూ. 175గా ఉంది. అంటే హైదరాబాద్‌లో దాదాపు ఐదు రెట్లు ఎక్కువ భారం పడుతోందన్నమాట. పొరుగున ఉన్న బెంగళూరులో కూడా దేశీయ ప్రయాణానికి రూ.550 మాత్రమే వసూలు చేస్తున్నారు. కరోనా తర్వాత పెరిగిన భారం గడిచిన నాలుగేళ్లలో హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి ప్రయాణించే వారిపై ఈ ఫీజుల భారం భారీగా పెరిగింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో దేశీయ ప్రయాణికులకు కేవలం రూ.281 గా ఉన్న ఈ ఫీజు, ఇప్పుడు రూ.750కి చేరింది.
ధరలు ఎందుకు పెరుగుతున్నాయి?
అలాగే అంతర్జాతీయ ప్రయాణికులకు రూ.393 నుంచి రూ.1,500కి పెంచారు. అంటే దాదాపు ఐదు రెట్లు పెరుగుదల కనిపించింది. గత నాలుగేళ్లలో హైదరాబాద్ ప్రయాణికుల నుంచి ఏకంగా రూ.2,500 కోట్ల మేర ఈ ఫీజులను వసూలు చేసినట్లు గణాంకాలు చెబుతున్నాయి. హైదరాబాద్, బెంగళూరు వంటి కొత్తగా నిర్మించిన ‘గ్రీన్ ఫీల్డ్’ విమానాశ్రయాల్లో పెట్టిన పెట్టుబడులను తిరిగి రాబట్టుకోవడానికి, అక్కడ మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి ఈ ఫీజులను ఎక్కువగా నిర్ణయిస్తుంటారు. ఎయిర్‌పోర్ట్స్ ఎకనామిక్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (AERA) ఈ ధరలను నిర్ణయిస్తుంది. నిర్వహణ ఖర్చులు, పెట్టిన పెట్టుబడిపై రాబడిని లెక్కలోకి తీసుకుని ప్రతి ఐదేళ్లకు ఒకసారి ఈ ఛార్జీలను సవరిస్తుంటారు. ప్రయాణికుల రద్దీ పెరగడం కూడా ఆదాయం పెరగడానికి ఒక కారణమని అధికారులు చెబుతున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: