హైదరాబాద్: భోగి వేడుకల్లో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు. ఎల్‌బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి సోమవారం తన నివాసంలో అట్టహాసంగా భోగి పండుగ నిర్వహించారు. కేటీఆర్, హరీశ్ రావుతో కలిసి ఆయన భోగి మంటను వెలగించారు. హరిదాసులకు నిత్యావసరాలు వితరణ చేశారు. ఈ సందర్భంగా గంగిరెద్దుల విన్యాసాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ముఠా గోపాల్, కాలేరు వెంకటేశ్, పాడి కౌశిక్ రెడ్డి, బాండారి లక్ష్మారెడ్డి, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, పటోళ్ల కార్తీక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
![image](https://vaartha.com/wp-content/uploads/2025/01/image-69-1024x682.png.webp)
మరోవైపు తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో సోమవారం తెల్లవారుజామున కేబీఆర్ పార్క్ వద్ద భోగి వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలకు మహిళలు, చిన్నారులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత భోగి మంటలను వెలగించారు. మంటల చుట్టూ యువతులు, మహిళలు ఆడిపాడారు. చిన్నారులకు భోగిపళ్లు పోశారు. హరిదాసులకు బియ్యం, ఇతర నిత్యావసరాలు వితరణ చేశారు. గంగిరెద్దుల విన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి. సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. పతంగులు ఎగరవేసి సంబరాలు చేసుకున్నారు.
![image](https://vaartha.com/wp-content/uploads/2025/01/image-70-1024x683.png)
కాగా, తెలుగు రాష్ట్రాల్లో భోగి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. సంక్రాంతి వేడుకలో మొదటిరోజైన భోగి రోజున తెల్లవారుజామునే నిద్ర లేచి భోగి మంటలు వేసి ఆనందంతో పండుగ జరుపుకుంటున్నారు. . భోగి మంటలు వెలిగించి పండుగ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నారు. తమ ఇళ్ల ముందు రంగురంగుల ముగ్గులు వేస్తూ సందడి చేస్తు్న్నారు. మరోవైపు నగరవాసులంతా పల్లెలకు వెళ్లడంతో గ్రామాల్లో వేడుకలు మరింత ఘనంగా జరుగుతున్నాయి.