📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

The Radiant Mind : కాంతులీనుతున్న మనసు

Author Icon By Abhinav
Updated: December 11, 2025 • 11:30 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఉదయం. లోటస్ టెంపుల్, న్యూ ఢిల్లీ. వాతావరణం చల్లగా, ఆహ్లాదంగా ఉంది. సూర్యబింబం కనిపించడం లేదు. వెలుగును బట్టి సూర్యుడి ఉనికి తెలుస్తోంది. కుల మతాలకతీతంగా ప్రార్థనలు చేసుకునే ప్రదేశం ఒకటుందని, అదీ మన దేశంలోనే గూగుల్లో సెర్చ్ చేస్తే తెలిసి ఇక్కడికి వచ్చాను. భిన్నత్వంలో ఏకత్వానికి అద్దం పడుతున్న వసుధైన కుటుంబాన్ని ప్రతిఫలింపచేస్తూ, అంత మంది కలిసిమెలిసి మౌన ప్రార్థనలు చేస్తుంటే చూడముచ్చటేసింది. ముఖ్యంగా చిన్నతనంలోనే పిల్లల్లో ఆ బీజం పడడం, ముదావహం. కళ్లు మూసుకుని ధ్యానంతో మనసును, శరీరాన్ని ఒక కేంద్ర బిందువులో లయం చేసి, తాదాత్మ్యంతో ప్రశాంతంగా లోపల కొంతసేపు గడిపి బయటకొస్తున్న నాకు ఒక వ్యక్తి కనిపించాడు. అతనికి సుమారు ముప్ఫై ఏళ్లుంటాయి. కళ్లల్లో, ముఖంలో నేనెవరిలోనూ, ఎన్నడూ చూడనంత ప్రశాంతత ద్యోతకమవుతోంది. అతన్నెందుకో పలకరించాలనిపించింది. బహుశా అతని ముఖం చూడగానే నా మనసులో “మన ప్రాంతం వాడే” అన్న భావం కూడా కదలాడినందుకేమో? అతను కొంత దూరం నడిచి, పచ్చికబయల్లో కూర్చున్నాడు. నేను అతనికి దగ్గరగా వెళ్లి కూర్చున్నాను. నన్ను చూసి నవ్వాడు. కాసేపు అక్కడున్న పచ్చదనాన్ని, పక్షుల కిలకిలలను ఆస్వాదించి, “మీరు తెలుగువారు కదూ..!” అన్నాను. అవునన్నట్టుగా చిరునవ్వు నవ్వాడు. “నా పేరు విశిష్ట్. 

మాది విజయవాడ. నేను ఇంజినీరింగ్ ఆఖరి సంవత్సరం చదువుతున్నాను. సమయం చిక్కినప్పుడల్లా మన దేశంలోని ప్రఖ్యాత గుళ్లు, గోపురాలు, చారిత్రక ప్రదేశాలు చూస్తాను. నెట్లో లోటస్ టెంపుల్ గురించి చదివి జాతి, కుల, మతాలకతీతంగా స్త్రీ, పురుష భేదం లేకుండా ఇందులోకి ప్రవేశించి మౌన ప్రార్థనలు చేసుకోవచ్చని చదివి మొట్టమొదటిసారి ఇక్కడికొచ్చాను. ఇదో మధురానుభూతి. మరి మీరు?” “నా దేహానికి ఉన్న పేరు కిరణ్, నా  అసలు పేరు కులాన్ని ప్రతిబింబిస్తూ ఉండేది, దాన్ని తొలగించుకుని అధికారికంగా కిరణ్ అని మార్చుకున్నాను. సూర్యకిరణం ప్రకృతి ప్రసాదితం, ఎటువంటి వివక్షలు చూపకుండా, జగతిని జాగృతం చేస్తుంది. అందుకే ఆలోచించి ఆ పేరు పెట్టుకున్నాను. నేను సంవత్సరానికి ఒకటి రెండు సార్లు ఇక్కడికి వస్తాను. ఇంకే పర్యటనలూ చేయను. ఉద్యోగం చేయడం బతకడానికి. ఇదిగో ఇక్కడికి వచ్చి ఇలా మానసిక ప్రశాంతత పొందడానికి.. అంతే!” అన్నాడు. “మిమ్మల్ని పలకరించాలని నాకెందుకు తీవ్రంగా అనిపించిందో ఇప్పుడు అర్థమవుతోంది. మీకు అభ్యంతరం. లేకపోతే మీతో కొంత సమయం గడుపుతాను” అన్నాను. అతనేమనుకున్నాడో కానీ కొంతసేపటి మౌనం తర్వాత ఒప్పుకున్నట్టుగా తలూపాడు. “మీరు కేవలం ఇక్కడికే వస్తానన్నారు. మన దేశంలో ఆధ్యాత్మిక ప్రత్యేకతలు, మహత్క్యాలతో అలరారే ఆలయాల సందర్శనం చేయరా?” అడిగాను. 

అతను ఆకాశంలో గిరికీలు కొడుతూ విహరిస్తున్న పక్షిని చూస్తూ-  “పుట్టింది మొదలు చనిపోయేవరకు మనిషి మనశ్శాంతిని అభిలషిస్తాడు. పుట్టింది ఏ జాతిలో, కులంలో, మతంలో అయితే ఆయా సంప్రదాయాల వృత్తంలో అలుపు లేకుండా తిరుగుతుం టాడు. విచిత్రమేమిటంటే తను మనిషినన్న విషయం మర్చిపోయి ఆయా జాతి, కుల, మతాలకు ప్రాతినిధ్యం వహించడంలో తలమునకలవుతాడు. అందులో మనశ్శాంతి లభిస్తుందని ఆరాటపడతాడు. నిజానికి మనశ్శాంతి అందులో ఉండదు. దేవుణ్ని నమ్మితే ఆస్తికుడు లేదంటే నాస్తికుడన్న ముద్ర. మరి కంటికి ఎదురుగా ఉండే మనిషిని నమ్మితే? ఏమనాలి? మనిషికి కష్టమొస్తే ఆదుకునేది మనిషా? దేవుడా? సమయానికి మనిషి సహాయం చేసినా దేవుడా రూపంలో వచ్చాడని మురిసిపోవడం నా దృష్టిలో పిచ్చితనానికి పరాకాష్ఠ!” “అంటే మీ దృష్టిలో ఆస్తికత్వానికి విలువ లేదా?” ప్రశ్న అడగొచ్చో లేదో అనుకుంటూనే అడిగేశాను. “మనిషితత్త్వాన్ని మరుగున పడేసే ఆస్తికత్వం ఎందుకు? మానవుడే మాధవుడంటారుగానీ చేతల్లో అది కనిపించదు. ఎవరికన్నా ఉపకారం చేయాలంటే మనసులో ఎన్ని లాభనష్టాలు బేరీజులేసుకుంటారో. లోకంలో పుణ్యం అన్న మాట లేకపోతే సహాయ సహకారాలన్నీ చాలావరకు సద్దుమణగిపోతాయి”. అతనన్న మాటల్లో వాస్తవం ఉంది. చిన్నప్పట్నుంచి పాపం పుణ్యం అందరి మనసు పొరల్లో నిక్షిప్తమయిపోయాయి. ఏది పాపమో, ఏది పుణ్యమో మన పెద్దవాళ్లు నిర్దేశించారు. 

పాపం చేయడానికి కొంతమంది మనసు జంకుతుంది. అందుకనే ప్రపంచం ఈ మాత్రం నిలకడగా ఉంది. లేకపోతే అంతా అరాచకం, అస్తవ్యస్తమే! “మన పురాణాలు, ఆధ్యాత్మిక గ్రంథాలు, దానం, ధర్మం, నీతి, మనవత్వాలకు పెద్ద పీట వేశాయి కదా?” అతనికి పురాణ పరిచయం ఉందో, లేదోనని అసంశయిస్తూ అడిగాను. “ఒక్క హిందూమతంలోనే కాదు.. ఏ మత సాహిత్యంలోనైనా, సమాజ వికాసానికి మనిషి గుణగణాలు ఎలా ఉండాలన్న సారాంశాన్ని పక్కనపెట్టి, వ్యక్తులకు పట్టం కట్టారు. రామాయణం విషయం తీసుకుంటే “మనిషి ఎలా. ఉండాలి?” అనే విషయాన్ని గ్రహించా ల్సింది పోయి రాముణ్ని దేవుణ్ని చేసి అడుగడుగునా గుడి కట్టి పూజిస్తున్నారు. భాగవతం కృష్ణుణ్ని భగవంతుణ్ని చేసింది. బైబిల్ క్రీస్తును చర్చిలో నిలిపింది. ఖురాన్ మహ్మద్ ప్రవక్తకు పట్టం కట్టింది. ఏ గ్రంథంలోనైనా ఆనాటి సామాజిక పరిస్థితులను పరిచయం చేస్తూ, మనుషుల విచిత్ర పోకడలను, రాక్షసత్వాన్ని, పైశాచిక త్వాన్ని చిత్రిస్తూ ఒక చరిత్రాంశంలా “మనిషన్నవాడు అలా ఉండకూడద” ని హెచ్చరించింది. మనిషితత్వాన్ని, మానవ త్వాన్ని అవతార రూపంగా విస్తృతపరి చింది. సద్గుణాలను, సత్ప్రవర్తనను అలవరచుకోకుండా కేవలం చదవడం, మనిషిని పరమాత్ముణ్ని చేయడం, పూజించడం పారమార్థికత అనుకుంటే ఎలా? దేవుడు గుణాతీతుడు, సర్వోన్నతుడు (మానసిక స్థితిలో) అనుకుంటే పూజలు, మొక్కులు, కానుకలు, సేవలకు లొంగే అల్పమనస్కుడిగా చూడడం మన అధమ మానసిక స్థాయికి సూచిక కాదా? పిండికొద్దీ రొట్టెలాగా, డబ్బుకొద్దీ దర్శనం ఎంత హాస్యాస్పదం. 

దేవుడు ఒక్కడే అంటారు. కానీ ఒక్కొక్కరికీ ఒక్కో దేవుడు. దేవుడు ఎక్కడో లేడు హృద యంలో కొలువుంటాడని చెబుతూ అవి శ్రాంతంగా కొండలు కోనలు తిరుగుతుం టారు. మనోస్థిరత్వం లేని మనిషికి అసలంటూ దేవుడనేవాడుంటే పట్టుపడతాడా?” “మిమ్మల్ని ప్రశ్నలతో విసిగిస్తున్నాను కోవద్దు. సూర్యబింబంలా బహిర్గతమవు తున్న మీ అంతరంగం ఇన్నాళ్లుగా నా మనసుకు చుట్టుకున్న చీకటిపొరలను తొలగిస్తోంది. కొత్త విషయాలు తెలుస్తు న్నాయి. ఆధ్యాత్మికత అనే మత్తు మానవ జాతిని పట్టి పీడిస్తోందన్న విషయం క్రమంగా అర్థమవుతోంది”. అంతలో చిన్నపిల్ల విసిరిన బంతి తన దగ్గరికి రావడంతో, దాన్ని తీసుకెళ్లి ఆ పిల్లకిచ్చి, వచ్చి కూర్చున్నాడు కిరణ్. తర్వాత మళ్లీ కొనసాగిస్తూ “ఇదిగో ఇప్పుడు నేను చేసిన ఈ చిన్న పని ఆ పసి మనసులో లోకం మొత్తం మంచి దన్న విత్తనం వేస్తుంది” అని చెప్పి-“ప్రపంచంలో రెండు రకాల మనుషులు ఉంటారు. ఒకరు తమ మేధతో దేన్నైనా కనిపెట్టేవారు. మరొకరు దాన్ని ఉపయోగించుకునేవారు. మన వెనకటి తరాల్లోని మేధావులు దేవుణ్ని వ కనిపెట్టారు. దాన్ని ఉపయోగించుకుని అప్పటి నుంచి ఇప్పటిదాకా కొంత మంది బతుకుతున్నారు. అంటే కోపం వస్తుంది గానీ ఇదీ తరతరాలుగా సాగుతున్న లాభసాటి వ్యాపారమే. అనుకున్నది జరిగితే దైవలీల అనుకుంటారు, జరక్కపోతే మనలోనో, మన పూజలోనో లోపం అనుకునే చిత్రమైన స్థితిలో ఉంటారు. 

అదో మానసిక బలహీనత అనుకోకుండా, చాలా మంది దాన్నే  గుడ్డిగా అనుసరిస్తున్నారు”. ఒక వ్యక్తి వయసు నలభై ఉండొచ్చు, ” ఐదడుగుల ఆరంగుళాలుంటాడు. తెల్లటి లాల్చీ, పైజామా ధరించి ఉన్నాడు. మా వైపుగా వచ్చి మాకు కొద్ది దూరంలో అటువైపుగా ముఖం చేసుకుని కూర్చున్నాడు. అతనివంకోసారి చూసి కిరణ్ చెప్పడం ప్రారంభించాడు. “పోయిన్నెల మా నాన్నగారు చనిపో యారు. కార్యక్రమ నిర్వహణకు, దానాలకు బ్రాహ్మణులు ఖరీదైన ప్యాకేజీ చెప్పాడు. నేను ఓ చిన్న ఉద్యోగిని. ప్రైవేటు ఉద్యోగి అయిన మా నాన్న సంపాదించిన అరకొర డబ్బు ఇలా దాన ధర్మాలకు, కర్మలకు ఖర్చుపెడితే రేపటి రోజున మా అమ్మ ఎలా బతుకుతుంది? మా నాన్న ఆత్మశాంతి అన్నది ఆయన పార్థివ శరీరానికి చేసే కర్మల్లో కాదు, మా అమ్మ ఏ చీకూ చింతా లేకుండా బతకడంలో ఉంటుందనిపించి, విద్యుత్ దహన వాటికలో దహనం చేయించాను. పన్నెండు రోజుల కార్యక్రమాలు సామాన్యంగా జరిపించాను. చుట్టాలనబడేవాళ్ల నోళ్లు రకరకాలుగా మాట్లాడాయి. పట్టించుకోలేదు. పది మంది కోసం కాకుండా మనకు తోచింది సవ్యంగా చేయడం సంస్కారం అనిపించింది. అదే చేశాను. ప్రకృతిలో పంచభూతాల ధర్మాలు అన్నిచోట్లా ఒకేలా ఉంటాయి. అది శాస్త్రం, అదే సత్యం. కానీ మరణించడం. తర్వాత చేసి తతంగం ఒక్కో జాతి, మత, కులం, తెగలో ఒక్కో రకంగా ఉంటుంది. ఎవరికి వారు తమవారికి సద్గతులు ప్రాప్తించాయని మానసికంగా సంతృప్తిని పొందుతారు. 

మరి ఏ పద్దతిలో మరణించిన వారి ఆత్మకు నిజమైన శాంతిని ప్రసాదిస్తుంది? సమాధానం దొరకని ప్రశ్న ఇది. పుట్టిన జీవికి మరణం అనివార్యం. ఏ ఇతర జీవికీ లేని కర్మకాండలు మనిషి తన తెలివితో మనిషి కోసం రూపొందించాడు. దాన్ని అలా గుడ్డిగా అమలు పరుస్తారు చాలామంది. మన దేశంలో చనిపోయినవారి ఆస్థికలను పవిత్ర నదుల్లో కలుపుతారు. ఒకవేళ ఒక దేశంలో అలాంటి నది ఒక్కటీ లేకపోతే అది ఆ చనిపోయిననాడు చేసుకున్న దౌర్భాగ్యమా? వాడి ఆత్మ పవిత్రత నొందడా? అసలు ఆత్మ అంటే జీవికి శరీర పంజరం నుంచి స్వేచ్ఛ లభించే గాలి అని, ఎటువంటి వికారాలు సోకని పవిత్రమైనదని అంటారు కదా, మరి దానికి శాంతి లభించడమేంటి? కాస్త నిదానంగా ఆలోచిస్తే ఇక్కడే మన పూర్వీకుల తెలివితేటలు స్పష్టమవుతాయి”. ఏవిటీ మనిషి? నా మనసు చీకట్లో దీపం వెలిగించి క్షణక్షణానికీ కాంతి పెంచుతున్నాడు. ఆలోచనలు కొత్త దారి వడుతున్నాయి. ఇతడు సన్యాసి, స్వామీజీ, ప్రవచనకారుడూ కాడు. మామూలు మనిషి. అయినా తరతరా లుగా పేరుకుపోయిన సంప్రదాయ మకిలీని మాటల్తో శుభ్రం చేసి, కంపు కొడుతున్న హృదయాన్ని ఉతికి ఆరేస్తున్నాడు. మాకు కొద్ది దూరంలో కూర్చున్న వ్యక్తి మా వైపు తిరిగాడు. “మన దేశంలో ఎన్నో ఆశ్రమాలు ఉన్నాయి. ధర్మ ప్రవచనాలు చెబుతూ నీతిని బోధించే స్వామీజీలు ఉన్నారు. అనుసరించే వందలు, వేలు, లక్షల శిష్యగణాలు ఉన్నారు. అయినా పేపరు తిరగేస్తే మానవ మృగాల సంచారం, వారి అకృత్యాలు, ఆగడాలు మితిమీరి కనిపిస్తాయి. సన్యాసులు ఎక్కడో ఆశ్రమాల్లో ఒక మూల కూర్చుని ధ్యానంలో, సత్సంగాల్లో కాలం వెళ్లదీసే బదులు సమాజంలో సంచరిస్తూ నేరాలను అడ్డుకోవచ్చు కదా, రక్షణ కవనంగా మారొచ్చు కదా. ఊహూ.. అలాంటివేం చేయరు.

ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన ప్పుడు సైనికులు, భద్రతా సిబ్బంది. సాధారణ మనుషులు సహాయక చర్యల్లో పాల్గొంటారు కానీ కాపాయంబర ధారులందరూ ఊగుమ్మడిగా పాల్గొని సహాయ సహకారాలు అందించవచ్చు కదా! అలా చేయరు. దీని అర్ధం ఏమిటి? మనిషిలోని దేవుణ్ణి వాళ్ళు చూడలేకపోతున్నారనే కదా! ఆధ్యాత్మికత మునుగు అర్ధం లేనిదనే కదా? మనసు గంగ కానప్పుడు, శరీరం గంగానదిలో మునకలేయడం అవివేకం. నేనందుకే దేవుళ్లు. పూజా తతంగాలు లేని, ఆధ్యాత్మికత ముసుగులో వ్యాపారం కనిపించని మానసిక ప్రశాంతతనిచ్చే ఈ ప్రదేశానికి వస్తాను. ఇక్కడ మనుషులు, మనసులు ఒక్కటిగా ఉంటాయి. దానిని మౌనంగా అనుభూతిస్తాను”. ఇతన్ని కలిసేవరకు దేవుణ్ని వెదికే పనిలో ఉండేవాణ్ని. ఇప్పుడు దేవుడు మన పక్కనే మరో మనిషి రూపంలో ఉన్నాడన్న ఉనికి లభించింది. అన్నట్టు దేవుడంటే పంచభూతాలు, వాటి కలయిక అయిన జీవ జంతుజాలం. ప్రకృతిలోకొచ్చి, సంచరించి, ప్రకృతిలో కలిసిపోడానికి మధ్య ఎన్ని నమ్మకాలు? మూఢనమ్మకాలు? విశ్వాసాలు? మనిషి ప్రశాంతత అతని ఆలోచనా విధానం లోనూ, నిత్య జీవిత కర్మాచరణలోనూ ఉంటుంది. అది వదులుకుని ఒంటిపూట తింటూ డబ్బులు కూడబెట్టుకున్నామని దూరాభారాలు భరించి ఆలయాలు తిరగడం, ఎవరో పెద్ద(?) మనిషి ఆసువుగా చెప్పే మాటలు నాగస్వర శబ్దంగా గ్రహించి తలలూపడం, మతమార్పిడులు, వేధింపులు ఇది మనకోసం మనం సృష్టించుకున్న మరో కలుషిత ప్రపంచం కాదా? నేను ఆలోచనలో ఉండగానే మాకు కొద్ది దూరంలో కూర్చున్న వ్యక్తిని, మరో మనిషి తీసుకెళ్లడానికి వచ్చాడు. వాళ్లూ తెలుగువాళ్లు అని వారి మాటలను బట్టి అర్థమైంది.

 కిరణ్ మాటలు నచ్చినట్టుగా అతడు బొటనవేలు, చూపుడువేలు కలిపి సంజ్ఞ చేశాడు. ఆ వ్యక్తి మూగవాడన్న విషయం అతని పక్కనున్న మనిషి చెప్పాడు. “మీ మాటలు అతణ్నీ ప్రభావితం చేశాయి” అన్నాను నవ్వుతూ. “ప్రభావం అన్న మాట నాకు నచ్చదు. ఎవరి ప్రభావం, దేని ప్రభావం ఎవరి మీదా ఉండకూడదు. స్వతం త్రంగా ఆలోచించకపోవడమే ఇప్పటి ఈ మనస్థితికి కారణం. ఎవరేం చెప్పినా వింటాం. కాస్తయినా ఆలోచించం. మానవుడు విచక్షణతో జన్మించింది.. ప్రకృతికి ఏదైనా ఉపకారం చేయడానికి, కానీ మనిషితో సహా ప్రకృతీ అపకారమే జరుగుతోంది. నేనెవరు? ఎక్కడి నుంచి వచ్చాను? అన్న సృష్టి రహస్యాన్ని తెలుసుకోడానికి కొంతమంది సంప్రదాయవాదులు, ఛాందసులు తెగ తాపత్రయపడుతుంటారు. అది అనవసరం అని నా అభిప్రాయం. ఎక్కడి నుంచి వచ్చాం, ఎక్కడికి వెళతామన్నది సృష్టికర్త చూసుకుంటాడు. భూమ్మీదకు మనం వచ్చినందుకు ఏదైనా సాధించడమే ముఖ్యం. అన్నట్టు.. మిమ్మల్ని నా దగ్గరకు రప్పించింది ప్రాంతీయాభిమానమైతే శోచనీయం. మానవత్వం అయితే హర్షణీయం” అని లేచి నుంచున్నాడు వెళ్లడానికి ఉద్యుక్తుడవుతూ. నావకు చుక్కానిలా నిలిచిన ఆ మహామనీషికి వీడ్కోలు చెబుతూ నమస్కరించాను. అతను ముందుకు కదిలాడు. సూర్యుడు పడమటి కొండల మాటకు వెళ్లిపోయాడు. చీకటి పడింది కానీ సూర్యకిరణాలు ప్రసరించిన సమయంలో చక్కబడిన నా మనసు ఇప్పుడు స్పష్టమై, సవ్యంగా కాంతులీనుతోంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

Enlightenment Human Connection Humanity Inner Peace Life Lessons Lotus Temple nature Philosophical Story Spirituality Telugu short story True Religion

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.