📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

The Little Magazine : చిరు సంచిక

Author Icon By Abhinav
Updated: December 10, 2025 • 12:42 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తలుపును తడుతున్నప్పుడే అలాంటి ఒక గొంతు వినిపిస్తుందని మేమూహించలేదు. సందేహిస్తూనే వాకిట్లో నిలబడ్డాం. మధ్యాహ్నం మూడున్నర గంటలుండొచ్చు. వీధిలో మనుషుల రాకపోకలు లేవు. పోస్టాఫీసు పక్కనున్న చిన్న వీధి  “వాకిట్లో ఏ కుక్కో వొచ్చి తలుపు తడ్తాంది. తలుపు తీస్తావమ్మా” అని లోపలి నుండి ఒక మగగొంతు వినిపించింది. తర్వాత కొన్ని నిమిషాలలో పచ్చగళ్లున్న చీరె కట్టుకున్న ఒక వయసైన వృద్ధురాలు మెల్లగా నడిచొచ్చి తలుపు తెరిచింది. తలుపు కిర్రుమంటూ శబ్దం చేసింది. వాకిట్లో నిలబడున్న మమ్మల్ని తీక్షణంగా చూస్తూ “ఎవురు కావాలి?” అని అడిగింది. “నరసింహన్ సార్!” అని చెప్పగానే ఆ వృద్ధురాలు ముఖం చిట్లించింది. “లోపలికెళ్లండి” అని వెనక గదిని చూపించింది. సందేహిస్తూనే మేం ముగ్గురమూ లోపలికి నడిచాం. హాల్లో ఒక చెక్కకుర్చీలో మురికి బట్టలు కనిపించాయి. చీలకు నల్లరంగు ప్యాంటు వేలాడుతోంది. ఒక వ్యక్తి నేల మీద చాపను పరుచుకొని పడుకొని వున్నాడు. చొక్కా వేసుకోలేదు. నీలి రంగు లుంగీ కట్టుకున్నాడు. ముందుకొచ్చిన అతని పొట్టంతా వెంట్రుకలే. మెడ చర్మం సాగి వేలాడుతోంది. ఎర్రబడ్డ కళ్లు. అతను తల తిప్పి మమ్మల్ని తీక్షణంగా చూశాడు. లోపలి గదిలో టీవీలో ఏదో కార్యక్రమం ప్రసారమవుతోంది. ఒక స్త్రీ మంచం మీద కూర్చొని వుతికిన బట్టలను మడుస్తూ టివిని చూస్తోంది. ఇంటిగోడలు పాతబడి కనిపించాయి. కిటికీలను కూడా తెరిచిపెట్టినట్టు లేరు. గోడకు ఒక సాయిబాబా క్యాలెండర్ మాత్రమే వేలాడుతోంది. పాతకాలం నాటి ఇల్లు. లోపల ఉత్తరం వైపున ఒక చిన్న గది. దానికి అడ్డుగా ఒక చిరిగిన చీరను వేలాడదీశారు. ఆ చీరను తొలగించి లోపలికి చూసేసరికి నరసింహన్ ఒక ఇనుప మంచంపై నిద్ర పోతూ కనిపించారు. 

వీపున చెమటలు పట్టి వున్నాయి. ఒక కాలు మంచం బయటికి చాపి వుంది. మనిషి బాగా పొడవు. మంచం కొలత చాలినట్టు లేదు. సన్నని చేతులు. ఖద్దరు బనియనూ రంగు వెలసిన పంచె కట్టుకున్నారు. ఆ గదిలో ఒక చిన్న కిటికీ కు వుంది. ఒక టేబుల్ ఫ్యాన్ స్టూలు పైన కనిపించింది. అదీ తిరగటం లేదు. ఆయ నను లేపుదామా.. వద్దా అన్న ఆలోచనలతో చూడసాగాను. ఇలాగే వెనక్కు తిరిగి వెళ్లిపోదామా అని మోహన్ సైగ చేశాడు. అయితే ‘తిరుజ్ఞానం’ ఆయన భుజాన్ని తాకి సన్నని గొంతుతో ‘అయ్యా! అయ్యా..!’ అని నిద్ర లేపాడు. ఆయన గాఢ నిద్రలో వున్నట్టున్నారు. ఆ గొంతు ఆయనను లేపలేదు. గదిలో ఒక చిన్న మట్టికుండ కనిపిం చింది. మంచం కింద ఒక రేకుల పెట్టె. పక్కన చెక్క మేజా. దాని మీద సగం తిని వుంచిన ఆపిల్ పండును ఈగలు ముసురు కొని వున్నాయి. చాలా మాత్రలు, చూర్ణండబ్బా వుంది. దండెం మీద రెండు ఖద్దరు తువ్వాళ్లు కనిపించాయి. గోడకు ఏదో పుస్తకం నుండి చించి అతికించబడిన ఫ్రెంచి కవి రిల్గే ఛాయాచిత్రం కనిపించింది. యవ్వనంలో వున్న రొయ్నర్ మరియా రిల్గే. ఆ గది వినోద పరిస్థితిని రిల్గే విచిత్రంగా చూస్తున్నట్టుగా వుంది. యాభై ఏళ్లల్లో నరసింహన్ మూడు కవితా సంపుటాలను వెలువరించారు. ఒక అనువాదం సంపుటం, కవిత్వానికి సంబం ధించిన రెండు వ్యాస సంపుటాలు వెలు వడ్డాయి. ఆయన కవిత్వం ఇంగ్లీషు లోనూ ఫ్రెంచిలోనూ తర్జుమా చెయ్యబడ్డాయి. ఇప్పటివరకూ ఏ పురస్కారమూ ఆయనకు ఇవ్వలేదు. ఆయన ఏ పుస్తకానికీ ఆవిష్కరణ సభ జరగలేదు. ఏ పుస్తకంలోనూ ఆయన ఫొటో వుండదు. వ్యక్తిగత వివరా లేమీ తెలుసుకోలేం. ఏ సాహిత్య కార్యక్రమా లకూ ఆయనను ఆహ్వానించి నట్టుగా గుర్తు లేదు. అయితే సీరియస్గా సాహిత్యాన్ని చదివేవాళ్లు ఆయనను ఓ ఉన్నతమైన కవిగా అభిమానించారు. 

అప్పుడప్పుడూ ఆయన కవిత్వాన్ని ఉదహరిస్తూ వుండేవాళ్లు. గత పదిహేనేళ్లలో సాహిత్యపు ధోరణులు పూర్తిగా మారిపోవటంతో నరసింహన్ను గురించో, ఆయన కవిత్వం గురించో తెలియని ఒక యువతరం తయారు కాబడింది. ఆయన ప్రాణంతోనే వున్నారని కూడా ಎಸರಿಗೆ ಗುದ್ದು ಬಿಡು. “ముడివిలో అన్న కవిత్వ పత్రికలో పున్న ప్రచురణ గావించబడ్డ కవితలను చదివి, వాళ్లు నరసింహన్ ఆనవాలును కనిపెట్టారు. అయన తన ఊళ్లోనే వుంటున్నారని తెలిసి ‘తిరుత్థానం’ ఆశ్చర్యపోయాడు. అతనే “మనమే వెతుక్కుంటూ వెళ్లి ఆయన కవితలను విందాం” అన్న ఆలోచనను వాళ్ల ముందుంచాడు. అందుకనే వచ్చారు. “ఆయన నిద్రపోనీ, మనం వెళ్లిపోదాం” అని సన్నని గొంతుతో అన్నాను.” తిరుజ్ఞానం దాన్ని ఇష్టపడనట్టుగా గట్టిగా “అయ్యా” అని మళ్లీ పిలిచాడు. ఆయన మేల్కొన్నట్టుగా పక్కకు ఒత్తిగిలాడు. తన గదిలో అపరిచిత యువకులు నిలబడి వుండటం చూసి ఆశ్చర్యపోతున్నట్టుగా ఆయన ముఖం మారింది. కళ్లు నులుముకుంటూ చేతిని ఆనించి లేవటానికి ప్రయత్నించారు. చాతీ ఎముకలు బయటికి కనిపించాయి. మనిషి చాలా వంగిపోయారు. తల వెనక మాత్రం కాస్త వెంట్రుకలున్నాయి. తన కళ్లద్దాలను వెతికి తగిలించుకుంటూ తలగడను కాస్త వాల్చిపెడుతూ “వచ్చి చాలా సేపయిందా?” అని అడిగారు. “ఇప్పుడే వచ్చాం. మీరు నిద్ర పోతూ వున్నారు” అన్నాడు మోహన్. “ఎండ ఎక్కువగా ఉంది. సెగ తట్టుకో లేకపోతున్నా. కబీరును పట్టుకుని ఉన్నాను.. అలాగే నిద్రపోయాను” అని తన తలగడ పక్కనున్న చిన్న ఇంగ్లీషు పుస్తకాన్ని చేతిలోకి తీసుకొని చూపించారు. ఆ గదిలో పురుగుల మందు వాసన లాంటి ఏదో ఒక వాసన వస్తోంది. “కూర్చోవటానికి చైర్లు లేవు. అలాగే నేలమీద కూర్చోండి. 

ఆ ఫ్యాన్ను పక్కకు జరపండి” అన్నాడు నరసింహన్. ముగ్గురూ మంచం పక్కనే కూర్చున్నాం. ఆయన మా ముఖాలకేసే చూడసాగారు. తిరుజ్ఞానమే చెప్పాడు.. ” ‘అగవులగు’ అని ఒక సంచికను నడుపుతున్నాం. దానికి మీ కవితను అడుగుదామని వచ్చాం” “కాలేజీలో చదువుతున్నారా?” అని అడిగారు. “నేను పండ్ల అంగడి పెట్టుకోనున్నాను. ఇతను ఇంజినీరింగ్ చదివాడు. కానీ పూర్తి చెయ్యలేదు. మోహన్ ట్యూషన్ సెంటర్ నడువుతున్నాడు” అన్నాడు తిరుజ్ఞానం. “ముగ్గురూ రాస్తారా?” అని అడిగాడు నరసింహన్. “మేమిద్దరం కవితలు రాస్తాం. వీడు ట్రాన్స్లేషన్ మాత్రం చేస్తాడు. పోయిన ఇష్యూలో కూడా విలియమ్ కార్లోస్ విలియమ్స్ ట్రాన్స్లేషన్ దేశాడు” అని నన్ను చూపించాడు. “చక్కటి పొయెట్. నేను చదివాను” అంటూ నరసింహన్ ఏదో ఆలోచనలో మునిగిపోయారు. గదిలో ఉక్కపోత భరించనంతగా వుంది. చెమట మెడకింద కారటం మొదలైంది. “సంచిక పేరేమిటన్నారు?” అని అడిగారు నరసింహన్. “అగవులగు” అన్నాడు తిరుజ్ఞానం. “మంచి పేరు.. ఎన్ని ఇమ్యాలొచ్చాయి?” “మూడు. రాబోయేది నాలుగవది. దానికోసమే కవితలను అడుగుదామని వచ్చాం” అన్నాడు తిరుజ్ఞానం. “నేను కవితలు రాయటం మానేసి ఇరవై ఏళ్లు అయిపోయాయి. అదే మీలాంటి కొత్తగా చాలా మంది కవులు వచ్చేశారుగా. ఇక మేమేందుకు?” “అలా కాదయ్యా. మీ కవితలంటే మాకు చాలా ఇష్టం. ‘సోడియమ్’ అని తమిళ కవితల సంపుటికి శీర్షిక పెట్టటం సూపర్. అందులోనూ యాభై ఏళ్ల క్రితమే మీరు ఎక్స్ పెరిమెంటల్గా చాలా రాశారు. ఇవ్వాళున్న కవిత్వానికి అదే మార్గదర్శి” అన్నాడు మోహన్. “నేను కెమిస్ట్రీ చదివినవాణ్ణి. ఆ వాసన నా కవిత్వంలో వుండే కదా తీరుతుంది” అని సన్నగా నవ్వారు. “మీ పుస్తకాలేవీ ఇప్పుడు ప్రింట్లో లేవు. వాటిని రీప్రింట్ చెయ్యొచ్చేమో?” అని అడిగాడు మోహన్. 

“ఎవరు చదువుతారు? అవి వెలువడిన కాలంలో వంద పుస్తకాలే అమ్ముడు పోయాయి. రెండు వేల యేండ్ల కవిత్వ చరిత్ర కలిగిన తమిళ భాషలో ఒక కవి పుస్తకం రెండు వేలు అమ్ముడుపోవడం లేదు. ఇదే యథార్థం” అన్నారు నరసింహన్. “ఇప్పుడూ కవిత్వం తక్కువగానే అమ్ముడు పోతున్నాయి” అన్నాడు తిరుజ్ఞానం. వాళ్ల గదిలోకి గట్టిగా అడుగుల శబ్దాలతో ఎవరో వస్తున్నారన్న శబ్దం వినిపించింది. నరసింహన్ ముఖం మారింది. హాల్లో పడుకొని వున్న ఆ వ్యక్తి గట్టిగా అరిచాడు “ఎదురింటి వాకిలిముందు బండిని నిలబెట్టింది ఎవరు? ముందు దాన్ని తియ్యండి. వోళ్లు అరస్తొందారు” మోహన్ పైకి లేచాడు. ఆ వ్యక్తి నరసింహన్ను తీక్షణంగా చూస్తూ వెనుతిరిగాడు. అతని ఆకారం తెరమరుగు కాగానే నరసింహన్ సన్నని కంఠంతో అన్నారు. “లోపలికి వస్తున్నప్పుడు మిమ్మల్ని తిరుజ్ఞానం ప్రశాంతంగా వున్నాడు. “ఈ ఇంట్లో ఎవరికీ నేనంటే నచ్చదు. అసహ్యం. అసహ్యం. ఎవరైనా నన్ను కలవటానికి వస్తే చాలు. వాళ్ల పైనా ఇప్పుడు వెళ్లాడే వాడు నా పెద్ద కొడుకు. లోపలున్నది నా భార్య. ఒక్కరికీ నేనంటే ఇష్టంలేదు. ఎందుకో చెప్పు నేను చదవటం రావటం నచ్చలేదు. పుస్తకం చదివి చెడిపోయానట, సగం లూజునట. ఇప్పటికీ నాకు పెన్షన్ డబ్బు వస్తూనే వుంది. దాన్ని తీసుకొని ఖర్చు పెడుతూనే వున్నారు. ఏమి జన్మాలో. వీళ్లను మార్చలేమని వదిలేసాను, అసహ్యంలోనే బతకటం వుంది చూశావు.. అది నరకం. ‘తాంతే’ నరకాన్ని గురించి రాశాడే అదంతా ఏమీ లేదు. ఈ నరకం నాకు అలవాటైపోయింది. “మా నాన్నకూ పుస్తకాలు చదవటమంటే నచ్చదు” అన్నాడు తిరుజ్ఞానం. అది విని తలాడిస్తూ నరసింహన్ అన్నారు: “అందరి ఇండ్లల్లోనూ అంతే. పుస్తకాలు చదవటం మొదలుపెడితే సొంత ఆలోచనలు వచ్చేస్తాయి. తర్వాత మనం చెప్పేది వినరని భయం. తాగుబోతును కూడా ఇంట్లోవాళ్ళు అనుమతిస్తారు. 

కవిత్వం రాసేవాణ్ణి అనుమతించరు. దాని పేరు సంప్రదాయం”. ఆలా చెబుతున్నప్పుడు ఆయన గొంతులో కోపమూ, ఆవేశమూ ఉగ్రంగా బయటికొచ్చాయి. మోహన్ బైక్ను పక్కగా పెట్టి లోపలికొచ్చాడు. అతను నేల మీద కూర్చోబోతుండగా నరసింహన్ “కుండలో నుండి కొద్దిగా నీళ్లియ్యప్పా” అని అడిగారు. మోహన్ కుండలోకి టంబ్లర్ను పెట్టాడు. కుండలో నీళ్లు లేవు. “నీళ్లు అడగనా?” అన్నాడు తిరుజ్ఞానం. “ఎవరూ తీసుకొచ్చి నీళ్లివ్వరు. అలాగే లేచి వంటగదిలోకి వెళ్లి నీళ్లు పట్టుకురా” అన్నారు నరసింహన్. తిరుజ్ఞానం మట్టికుండను తీసుకొని వంటగదిలోకి వెళ్లాడు. తల వంచుకొని నరసింహన్ చెప్పారు: “మనిషి చాలా కాలం బతక్కూడదప్పా. బతికితే అన్ని అవమానాలనూ భరించే తీరాలి. రెండేళ్ల క్రితం ఒకరోజు బాత్రూమ్లో జారిపడ్డాను. నడుము ఎముక విరిగింది. మూడు నెలలు ఆసుపత్రిలో వున్నాను. నయమై ఇంటికొచ్చి చూస్తే ఒక్క పుస్తకమూ లేదు. అన్నింటినీ తీసి పాతపుస్తకాలు కొనేవాడికి వేసేశారు. నేను దాన్ని భరించలేకపోయాను. ఏడ్చాను. ఇకపై చదివి ఏం చెయ్యబోతావని -అడిగాడు కొడుకు, చదవటానికి వయసుందా ఏంటీ? ఇలాంటి ఒక మతిహీనుడికి తండ్రినయ్యాయని తల కొట్టుకున్నాను. పుస్తకాలే కాదు, కవితలు రాసి వుంచుకున్న నోటుపుస్తకం, పాత డైరీ అన్నింటినీ ఎత్తిపడేశారు. నేను చచ్చిపోయాక జరిగేదాన్ని మందుగానో చూసేసాను, మంచి కాలం, పాత పంచెలు పెట్టుకునే పెట్టులో నాలుగు పుస్తకాలు పెట్టుకున్నాను. అవే మిగులు. వాటినే మళ్లీ మళ్లీ చదువుతున్నాను. పుస్తకాలు ఎప్పుడు నన్ను వదిలి వెళ్లిపో యాయో అప్పుడే నేను శవమైపోయాను. ఒద్ది శవాన్ని భౌతిక కాయం పుస్తకాలు చదవవు” అని చెప్పి ముగుస్తుండగా ఆయన కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఎడమ చేత్తో దాన్ని తుడుచుకుంటూ చెప్పారు: “మీకు నా మనవడి వయస్సే ఉంటుంది. తాతయ్యలా చెబుతున్నాను. 

చదవటం రాయటం ఇక చాలు, మీరైనా తెలివిగా బతకండి”. ఈ సలహాలే ఇంట్లోనూ చెబుతున్నారన్న అసహనంతో మోహన్ అన్నాడు: “ఎవరికోసమూ నన్ను నేను మార్చుకోను వీలుకాదు”. నరసింహన్ మోహన న్ను ఆసక్తిగా చూస్తూ వుండిపోయారు. తర్వాత అంగీకరిస్తున్నట్టుగా చెప్పారు: “నేనూ అలాగే కదా ఉన్నాను. ఏదో నిరుత్సాహంతో చెప్పాను. నా కవి త్వాన్ని పక్కన పెట్టండి. మీ గురించి చెప్పండి. చిరు సంచికను నడపటం కోసం ఇప్పటివరకూ ఎంత ఖర్చు పెట్టారు?” “ఇరవే వేలకన్నా ఎక్కువే వుండొచ్చు” అన్నాడు తిరుజ్ఞానం. “మీలాగ నేను ఏ రచయితనూ వెతుక్కుంటూ వెళ్లి కలిసింది లేదు. సిగ్గు, భయం. కవిత్వం రాసేవాడికి సాన్నిహిత్యం ఎందుకన్న భావన. పాఠకులలో ఎవరైనా నా కవిత బాగుందని ప్రశంసిస్తే కూడా సిగ్గుగానే వుంటుంది. నేను నగ్నంగా స్నానించటాన్ని ఎవరో “చూస్తున్నట్టుగా అనిపించేది”. “కీర్తిని గ్రహించి సిగ్గుపడటమంతా “మీ కాలంతో ముగిసిపోయింది” అన్నాడు, మోహన్స్ “వచ్చినప్పటి నుండి ఆ తమ్ముడు ఏమీ మాట్లాడలేదు. ట్రాన్స్ లేటర్ అంటే మాట్లాడకూడదా?” అని నన్ను చూస్తూ అడిగారు నరసింహన్, “నాకు మాట్లాడటం చేతకాదు” అన్నాను.. “నేనూ అలాగే వున్నాను. ఇంట్లోవాళ్లు పెట్టిన పాటకు ఇప్పుడు గడగడమంటూ వాగుతూ వున్నాను”. “ఇష్టంలేని ఇంట్లో ఎందుకున్నారు?. వేరుగా వెళ్లి వుండొచ్చు కదా!” అని అడిగాడు. మోహన్. భయం.. ఒంటరిగా వుండాలంటే భయం. అందుకనే కదా పెళ్లి చేసుకున్నాను. భయం నుండి బయట పడటానికి బదులుగా భయాన్ని పెంచుకుంటూ వుండిపోయాను. ఇప్పటికీ భయం పోలేదు”. “చనిపోతామన్న భయమా?” “లేదప్పా. బతకటానికి చేతకాలేదన్న భయం. ‘సోడియమ్’ వున్నదే, అది నీటితో కలిస్తే మంటలొచ్చేస్తాయి. 

అది స్వాభావికం. నేను అలాంటి మనిషిని, నీళ్లతో కూడా కలవలేకపోయాను”. “ఒకవేళ గొప్ప కవిగా మీరు అంగీకరిం చబడి వుంటే ఇంట్లోవాళ్లు అంగీకరిం చేవాళ్లా?” అని అడిగాడు మోహన్. “డబ్బు, పేరు, కీర్తి ఇవి సమస్యలు కావు. నీకు మాత్రం ఒక ప్రపంచం. నీకు మాత్రం ఒక అభిరుచి ఎందుకుండాలని ఇంటివాళ్లు అనుకుంటున్నారు. దాన్ని వదిలిపెట్టి నేనూ టివి సీరియల్ చూస్తూ, వీధిగొడవలను మాట్లాడుతూ, ఇతరులను చూసి అసూయ పడుతూ వుంటే ఇంటివాళ్లు అంగీకరించి వుండేవారు. మనకు ఎదురయ్యే ఎన్నో అనుభవాలు బయటికి చెప్పుకోలేనివి. ఏ మాటా చొచ్చుకు వెళ్లలేని కాంతలోనే అవి సంభవిస్తాయని రిల్గే చెబుతాడు. దాన్ని పూర్తిగా గ్రహించాను. శారీరకంగా నేను నరసింహన్ను. వయసు 82. అయితే కవిగా నా వయసు రెండు వేలకన్నా పైగానే. నేనే అక్షరాలలో బతికే వాణ్ణి. నన్ను అక్షరాలలో దాచిపెట్టుకోగలిన వాణ్ణి. ఒక్కో అక్షరమూ ఒక గుహ. అందులోనే నేను దాక్కొని వున్నాను” తిరుజ్ఞానం ఆశ్చర్యం ఆయననే చూస్తు న్నాడు. ఉన్నట్టుండి ఆయన ఆకారం మారిపోయి నట్టుగా అనిపించింది. వంట గదిలోకి వెళ్లిన నరసింహన్ భార్య గట్టిగా అరిచింది. “పనికిమాలిన మాటలు మాట్లాడిందంతా సాలు, బయల్దేరండి”. ఉన్నట్టుండి దీపం వెలుగు ఆర్పివేసినట్టుగా నరసింహన్ మాటలు ఆగిపోయాయి, చీకటి ముసురుకున్నట్టుగా గ్రహించాం “బయలుదేరతామయ్యా” అన్నాడు మోహన్. ఆయన గోడను చూస్తున్నట్టుగానే మౌనంగా తలాడించాడు. అవమానాన్ని మరిచిపోవటానికి ప్రయత్నిస్తున్నవాడిలా తిరుజ్ఞానం కుండలో నుండి నీళ్లు ముంచుకొని తాగాడు. నరసింహన్ సన్నని కంఠంతో అన్నారు: “నాకొక సాయం చెయ్యగలరా?” “చెప్పండయ్యా..” “ఇల్లాదిలి పెట్టి బయటికెళ్లి ఎన్నో ఏళ్లవు తున్నాయి. 

వాకింగ్ స్టిక్ను వూతంగా పెట్టు కొని ఇంట్లోనే నడుస్తున్నాను. నన్ను వీధి చివరి వరకూ పిలుచుకొని వెళ్లి రాగలరా?” “వెళదామయ్యా!” “శ్రమేమి లేదుకదా!” “టీకొట్టుకెళ్లి టీ తాగుదామయ్యా” అన్నాడు మోహన్. ఆయన లేచి నిలబడ్డారు. ఆయన ఎత్తు ఇప్పుడు పూర్తిగా తెలిసింది. ఆరడుగుల కన్నా ఎక్కువే. ఊతకర్రను చేతబట్టుకొని తలెత్తి ముందుకు చూశారు. అరిగిపోయిన రబ్బరు చెప్పులు ఒక పక్కగా పడున్నాయి. వాటిని వేసుకుంటూ గదిలో నుండి బయటికొచ్చారు. ఏదో ఆలోచించాక తన ఊతకర్రను పెట్టేసి నా భుజమ్మీద చెయ్యేశారు. “నువ్వూ నాలాగే పొడవు. నన్ను పట్టుకుంటావు కదూ!” అని అడిగారు నరసింహన్. తలాడించాను. వయసు మళ్లిన తండ్రిని వెంటబెట్టుకెళ్లినట్టు ఆయనను నడిపించు కుంటూ వెళ్లటం మొదలుపెట్టాను. హాలును దాటుతుంటే ఆ స్త్రీ అరవటం వినిపించింది. “ఇదిగో యాడికి పోతాండావ్? రోడ్లో పడి సచ్చేటందుకా, సెప్తే ఇను.. లోపలికి పో’ ఆయన ఆ మాటల్ని పట్టించుకోలేదు. “ఇల్లొదిలిపెట్టి ఎల్తే అట్నే ఎల్లిపో అని ఆ స్త్రీ మళ్లీ అరుస్తూ వుండటం వినిపించింది. వాకిలి దగ్గరకు రాగానే వీధిని తేరిపార చూశారు. ఆయన కళ్లు చిట్లించారు. నా భుజాన్ని గట్టిగా పట్టుకుని వీధిని చూడసాగాడు. “వేరే వూరులాగా వుంది. వీధి చాలా చిన్నదైపోయినట్టుగా అనిపిస్తోంది” అన్నారు. మేం వీధిలోకి దిగి నడవడం మొదలుపెట్టాం. నరసింహన్ మెల్లగా నడిచారు. పదడుగులు నడిచాక వెనక్కు తిరిగి ఇంటికేసి చూశారు. దీర్ఘంగా నిట్టూరుస్తూ అన్నారు: “నేను కట్టిన ఇల్లు., దాన్ని చూస్తుంటే నాకే భయంగా వుంది” తిరుజ్ఞానం అది విని నవ్వాడు. నేను నవ్వలేకపోయాను. మేం వీధి చివరికి రాగానే ఎండ మాడ్చేస్తోంది. బడి వదిలిపెట్టి చిన్నపిల్లలు ఇండ్లకేసి వెళుతున్నారు. టీకొట్లో గట్టిగా పాట వినిపిస్తోంది. నరసింహన్ బడిపిల్లల్ని ఆనందంగా చూస్తున్నారు. తర్వాత నిస్సహాయతతో అన్నారు: “నాతో పాటు రాయటం మొదలు పెట్టిన వాళ్లందరూ వెళ్లి చేరిపోయారు. నేనొక్కడినే బాకీ. ఈ తరానికి మేమెవరమూ తెలియదు. 

మీలాగానే మేమూ ఇరవై ఏళ్లప్పుడు ట్రిప్లికేన్లో గదిని తీసుకుని పగలూ, రాత్రీ కవిత్వం గురించే మాట్లాడు కుంటూ వుండేవాళ్లం. ఒక చిరు సంచికను నడిపాం. పెద్ద పత్రికలేవీ నన్ను కవితలు అడగలేదు. చిరు సంచిక.. అన్నమాటే ఎంతందంగా వుంది.. అడివిపువ్వులాగా. చిరు సంచిక అన్నది చిన్న కాలవ లాంటిది. అందులో మాత్రమే పెరిగే చేపలుంటాయి. వాటిని సముద్రంలో పడేస్తే చచ్చిపోతాయి. నేనూ అలాగే” అంటూ వీధిని చూడసాగారు. సిలిండర్లను ఎక్కించుకొని ఒక మూడు చక్రాల బండి మమ్మల్ని దాటు కొని వెళ్లింది. ఆ బండి చేస్తున్న శబ్దాన్ని చిన్నపిల్లవాడిలాగా ఆస్వాదించి వినసాగారు నరసింహన్. తర్వాత తిరుజ్ఞానాన్ని చూస్తూ అన్నారు: “ఎవరైనా తనను చూస్తారని భావించా నక్షత్రం వెలుగుతోంది? తనను బహిర్గత పరచుకోవటమే దాని ఆనందం. కవీ అంతే! మీరందరూ నన్ను కలవటానికి రావటం సంతోషం. నాకు టీ వద్దు. టీ తాగితే గుండెల్లో మంట పుడుతుంది. చాలా రోజులుగా ఒక కవిత రాయాలని అనిపిస్తూ వుంది. మనసులో నాలుగైదు లైన్లు ఫామ్ అయ్యాయి. అది చెప్పనా?” ఇరవై యేండ్లు ఏమీ రాయని మనిషి తన మనసు మూలలో నుండి పొంగుకొచ్చే నీటిని కుమ్మరిస్తున్నట్టుగా వణికే గొంతుతో తన కవిత మూడు వరుసలను చెబుతున్నారు. టీ కొట్టు పాట శబ్దంలో అది స్పష్టంగా వినిపిం చలేదు. దాన్ని ఆయనే గ్రహించినట్టుంది. చటుక్కున కవిత చెప్పటాన్ని ఆపి, “నన్ను ఇంటికి చేర్చేయండి” అన్నారు. నేను ఆయనను ఇంటి దగ్గర విడిచిపెట్టి వస్తానని చెప్పాను. మోహన్ తలాడించాడు. ఇంటిదాకా వచ్చిన వ్యక్తి మెట్లెక్కుతున్న ప్పుడు అన్నారు: “ఇకపై ఇలా నన్ను కలవ టానికి రాకండి. ఎవరైనా కలవటానికి వచ్చినప్పుడే మనసెంతో నేరభావనతో నిండి పోతుంది. నేను చనిపోయానని అనుకోండి. అదే మీరు నాకే చేసే ఉపకారం”. నరసింహన్ మెట్లెక్కగానే ఆ స్త్రీ కోవంతో అరుస్తున్న గొంతు వినిపించింది. ఆయన వణుకుతున్న కాళ్లతో వూగుతూ లోపలికి వెళుతూ వున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

#Poetry Artistic Struggle emotional Family Neglect Forgotten Poet Generational Bond inspiration Life Lessons Literary Passion Little Magazine Melancholy Old Age Reality of Art Sad Story Short Story Telugu Literature Writer's Life Writing

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.