Animal Stories For Kids: ఒక అడవిలో ఒక చెట్టుపై ఉడత నివసించేది. ఉడత ఆహారం సేకరించి, కొంత తినేది, మిగిలింది చెట్టు దిగువ దాచేది. ఉడత ఆహారం దాయటం ఒక కుందేలు గమనించి ఉడత దాచుకున్న ఆహారం తినేసేది. ఉడత తాను దాచిన ఆహారం కోసం వెతికితే అక్కడ ఉండేది కాదు. చెట్టుపై నివాసం ఉండే కాకితో.. ఉడత తాను దాచిన ఆహారం ఎవరో దొంగతనం చేస్తున్నారని చెప్పింది.
ఉడత దాచిన ఆహారం కుందేలు తినడం కాకి చూసింది. ఉడతతో ఆ విషయం చెప్పింది. అలాగే ఉడతతో “కుందేలును మనమేం చేయలేం.
నీవు ఇక నుండి ఆహారం దాచుకునే చోటు మార్చు” అని చెప్పింది. ఉడత ఆహారం దాచుకునే చోటు మార్చినా కుందేలు వెతికి వెతికి కనుక్కొని ఆహారాన్ని తినేసేది.
ఉడత ఆ సంగతి మళ్లీ కాకితో చెబితే కాకి “నువ్వు సేకరించి దాచే ఆహారానికి అలవాటు పడిపోయింది. సొంతంగా ఆహార సేకరణ చేయడానికి వెళ్లడం మానేసింది.
ఇతరుల ఆహారంపై ఆధారపడి సోమరిగా జీవిస్తున్నది. అందుకే దాని బుద్ధి మారేటట్లు చేయాలి. నీవు కుందేలులో మార్పు రావడానికి ఇకపై ఆహారాన్ని దాయటం మానేయ్.
కేవలం నీకు ఆ రోజుకి సరిపోయినంత ఆహారమే సేకరించు. నువ్వు దాచే ఆహారం కోసం కుందేలు వెతికి వెతికి ఆహారం దొరక్కపోతే, తన ఆకలి తీర్చుకోవడానికి తానే బయటకు వెళుతుంది.
ఇక్కడ నువ్వు ఆహారం దాయటం లేదని అర్థం చేసుకొని ఇటు వైపు రావటం మానేస్తుంది.
బద్ధకం వీడి తన ఆహారం తానే సొంతంగా సేకరించుకుంటుంది. అటు తర్వాత నువ్వు కొంత ఆహారాన్ని దాచినా దొంగతనం సమస్య ఉండదు” అని సలహా ఇచ్చింది.
కాకి సలహా ఉడత పాటించింది. ఉడత ఆహారం దాయడం మానేసింది. కుందేలుకు ఉడత దాచిన ఆహారం కోసం రోజు వెతికేది.
ఆహారం లభించక పోవడంతో, తన ఆకలి తీర్చుకోవడానికి ఆహార సేకరణ స్వయంగా చేసుకోవడం మొదలు పెట్టింది.
కొన్ని రోజులకు కుందేలు ఆ చెట్టు దగ్గరకు రావటం మానేసింది. కాకి సలహా విజయవంతం అవడంతో కాకికి ఉడత కృతజ్ఞతలు చెప్పుకుంది.