“ఏమండీ మీకు కొరియర్లో ఎవరో ఓ పార్సిల్ పంపించారండి” అంది వనజ… అప్పుడే ఆఫీసు నుండి ఇంటికి వచ్చిన భర్త గౌతమ్. “పార్సిల్ పైన పేరు ఉంటుంది. చూడక పోయావా…” అన్నాడు. “దాని పైన ‘గెస్ మీ’ అని మాత్రమే ఉందండి” అంది. “?” అంటూ పార్సిల్ ఓపెన్ చేసి చూసాడు. అందులో ఓ పాత మోడల్ గొడుగు, దానితో పాటు ఓ లేటెస్ట్ మోడల్ * సెల్ ఫోన్ కూడా ఉంది. ఆ గొడుగుని చూడగానే హృదయపు లోతుల్లో నుండి ఓ ప్రాణ స్నేహితుని పేరు పెదాలు పైకి వచ్చింది “శ్రీరామ్, ఎలా ఉన్నావురా. ఎక్కడున్నావ్రా.. నీ కోసం ఎంతని వెతకాలి. రోజులు… నెలలు… సంవత్సరాలు.. గడిచిపోతున్నాయి. నీ వైపు నుంచి ఏ కబురు లేదు. కానీ నా మనసు చెబుతోంది నువ్వు ఏదో ఒకరోజు నన్ను వెతుక్కుంటూ వస్తావని. నన్ను విడిచిపెట్టి వెళ్ళాక నేను ఒక్కసారి కూడా నీకు గుర్తు రాలేదా? ఎంత కాలం అయిందిరా నిన్ను చూసి! నిన్ను చూడాలని ఉందిరా.. నీతో కబుర్లు చెప్పాలని ఉందిరా..” అంటూ ఆ గొడుగుని ఆప్యాయంగా గుండెలకి హత్తుకున్నాడు.
కళ్ళ వెంబడి నీళ్లు అచేతనంగా జలజలా రాలి తన గుండెల మీద పడి చిన్ననాటి స్మృతులను తట్టి లేపుతున్నాయి. మనసు వేగంగా పాతిక సంవత్సరాలు వెనక్కి పరిగెట్టి అప్పటి జ్ఞాపకాలను కళ్ళముందుకు. శ్రీరామ్, గౌతమ్ ఇద్దరు చిన్నప్పట్నుంచి
ఒకే స్కూల్లో ఐదో తరగతి వరకు చదువుకున్నారు. శ్రీరామ్ తండ్రి జమ్మూ కాశ్మీర్లో ఆర్మీ ఆఫీసర్గా పనిచేసేవారు. దాంతో చిన్నవాడైన శ్రీరామ్ ని అంత దూరం తీసుకెళ్లడం ఇష్టం లేక తన తల్లితో పాటే వాళ్ల సొంతూరులోనే ఉంచారు. అప్పుడప్పుడు సెలవులకి వాళ్ళ డాడీ వచ్చినప్పుడల్లా బంధువుల ఇంటికి వెళ్లి స్కూల్ తెరిచే సమయానికి వచ్చేసేవాడు. ఐదో తరగతి ఎగ్జామ్స్ అయ్యాక ఒకరోజు ఇంటికి వచ్చి వాళ్ళ నాన్నగారికి ఢిల్లీ “ట్రాన్స్ఫర్ అయ్యిందని తనని అక్కడ ఆరో తరగతిలో జాయిన్ చేస్తున్నారని ఆ రోజు సాయంత్రమే బయలు దేరుతున్నట్టు చెప్పాడు.
ఆ రోజు సాయంత్రం అకస్మాత్తుగా హోరున వర్షం మొదలైంది. ఎందుకో వాడ్ని వదల్లేక మనసు విలవిల్లాడింది. కనీసం స్టేషన్ దాకా వెళ్లి ట్రైన్ ఎక్కేవరకైనా వాడితోనే ఉండాలనిపించి నాన్నని అడగ్గానే “సరే..” నన్నారు. అంత వర్షంలోనూ ఇద్దరం
చెరో గొడుగు వేసుకుని మరీ వెళ్ళాం. వాడు కూడా నన్ను వదల్లేక గట్టిగా కౌగిలించుకుని వలవలా ఏడ్చాడు. “బాయ్.. వచ్చే వేసవి సెలవుల్లో కలుద్దాం” అంటూ బాధగా ట్రైన్ ఎక్కుతున్న వాడికి ఏదైనా ఇవ్వాలనిపించి నా చేతిలో ఉన్న గొడుగుని వాడి చేతికిచ్చి నా గుర్తుగా ఉంచుకోమని చెప్పాను. అది నా మేనత్త గల్ఫ్ నుంచి నాకు పంపిన గిఫ్ట్. వర్షం వచ్చినప్పుడల్లా మేమిద్దరం ఆ గొడుగులోనే కలిసి వెళ్ళేవాళ్ళం. వాడు అప్పుడప్పుడు కాస్త చిలిపి పనులు కూడా చేసేవాడు. ఆ గొడుగులో వర్షం నీళ్లు నింపి స్నేహితులందరిపై వేస్తూ “వర్షం వస్తుంది పరిగెత్తండి” అంటూ వాడూ వరిగెత్తేవాడు.
అలా వాడు దానితో ఆటలాడేవాడు. అందుకే దాన్ని వాడికి ఇవ్వాలనిపించి ఇచ్చేసాను. కొన్నాళ్ల తర్వాత కార్గిల్ యుద్ధంలో వాళ్ళ నాన్నగారు చనిపోయారని, తను వాళ్ళ అమ్మతో కలిసి అమెరికా వెళ్లిపోయాడని తెలిసింది. అప్పట్నుంచి వాడ్ని
మరలా కలిసే అవకాశం రాలేదు. ఇదిగో ఇప్పుడు ఈ పార్సిల్ వచ్చింది. బహుశా. వాడు ఇండియా వచ్చుండాలి.. అనుకోగానే ఆ తలంపే ఎంతో సంతోషాన్నిచ్చింది. ఇంతలో వాడు పంపిన కొత్త సెల్ ఫోన్కి కాల్ వచ్చింది. లిఫ్ట్ చేయగానే “అరే గుర్తుపట్టావా?” అంటూ పక పకా నవ్వుతున్నాడు. నాకు మాటలు పెగలట్లేదు. ఆనందం, దుఃఖం రెండు ఒకేసారి పెల్లుబికి వరదలాగా పైకి తన్నినట్టు గొంతు పూడుకుపోయింది. కాసేపటికి తమాయించుకుని “ఎలా ఉన్నావా? ఎక్కడున్నావ్?” అని ప్రశ్న మీద ప్రశ్న సంధిస్తూనే ఉన్నాను. వాడు “నీ ప్రశ్నలన్నిటికీ సమాధానం రేపు నేను వచ్చేక చెప్తానురా. నా ఫ్యామిలీతో కలిసి రేపు మీ ఇంటికి వస్తున్నాను.
ఇద్దరం కలిసి మీ ఇంట్లోనే తీరిగ్గా కబుర్లు చెప్పుకుంటూ టిఫిన్ చేద్దాం” అన్నాడు. “సరే….” నంటూ సంభాషణ ముగించి వనజ వైపు చూశాను. తను చిరునవ్వుతో “రేపటికి కావల్సిన ఏర్పాట్లు అన్నీ నేను చూసుకుంటాను..” అన్నట్టు కళ్ళతోనే సైగ చేసింది.
ఈరోజు త్వరగా గడిచిపోయి త్వరగా తెల్లారిపోతే బాగుండుననిపించింది మనసుకు. క్షణం ఒక యుగం లాగ గడిచింది. వాడి ఆలోచనల్లో పడి ఎప్పుడు నిద్ర. పట్టిందో తెలీదు. “ఏవండీ! వాళ్ళకి కావాల్సిన టిఫిన్లు అన్నీ సిద్ధం చేశాను, లేవండి స్టేషన్కెళ్లి వాళ్ళని రిసీవ్ చేసుకుని తీసకురండి” అన్న నా భార్యామణి పిలుపుతో మెలకువ వచ్చింది. అప్పటికే టైం ఎనిమిది కావడంతో రివ్వున వెళ్లి సర్రున స్టేషన్లో వాలిపోయాను నా పదేళ్ల కూతురు లాస్యతో సహా. వాడు రాగానే నన్ను గుర్తుపట్టడం, కారులో మేమంతా ఇంటికి కలిసి రావడం, మా ఇరువురి కుటుంబాల పరిచయ కార్యక్రమం, వాడు మా కోసం తెచ్చిన ఖరీదైన వస్తువుల్ని ఇవ్వడం, అమ్మా, నాన్నలకి శ్రీరామ్ దంపతులిద్దరూ కాళ్ళకు నమస్కరించి వాళ్ళు తెచ్చిన కొత్త బట్టలు ఇచ్చి ఆశీర్వచనం తీసుకోవడం… ఇలా అన్నీ చక చకా జరిగిపోయాయి.
మేమందరం చిన్ననాటి ముచ్చట్లు గుర్తు చేసుకుంటూ టిఫిన్ చేశాం. మాటల మధ్యలో నేను డిగ్రీ చదివి ఉద్యోగం కోసం ప్రయత్నించి.. ప్రయత్నించి చేసేదిలేక బతుకు తెరువుకోసం ఊర్లోనే ఓ చిన్న జిరాక్స్ షాప్ పెట్టుకున్నట్టు తర్వాత వనజ నా జీవితంలోకి రావడం, పాప పుట్టడం అన్నీ వివరంగా చెప్పాను.
జీవితంలోకి రావడం, పాప పుట్టడం అన్నీ వివరంగా చెప్పాను. వాడు తన తండ్రి చనిపోయాక వాళ్ళమ్మ తనను అమెరికా తీసుకెళ్లి చదివించిందని. ఇప్పుడు తన అక్కడ ఓ వెల్ సెటిల్డ్ డాక్టర్ అని, డబ్బు, పలుకుబడి ఎంతో సంపాదించి స్థిరపడినట్టు చెప్పాడు. తన భార్య సుమతో పరిచయం, పెళ్లి, బాబు పుట్టడం అన్ని పూసగుచ్చినట్టు చెప్పూ… రెండు సంవత్సరాల క్రితం వాళ్ళ అమ్మ హార్ట్ స్ట్రోక్తో చనిపోయిందని కూడా బాధపడుతూ చెప్పాడు.. నాన్న పోయాక అమ్మ ఎప్పుడూ -నువ్వు బాగా చదువుకుని పెద్ద డాక్టర్ అవ్వాలిరా మీ నాన్నగారి ఆశయం నెరవేర్చాలని” చెప్తూ ఉండేదని తన తల్లిని, ఆమె మాటలను గుర్తు చేసుకుని చిన్నపిల్లాడిలా ఏడ్చాడు.
నెల రోజుల తరువాత ఓ రోజు ఇల్లు సర్దుతున్నప్పుడు వాళ్ళ నాన్న రాసిన లెటర్లు వాళ్ళమ్మ షెల్స్లో దొరికాయని వాటిని చూశాక తన తండ్రి ఆశయం పూర్తిగా అర్థమైందని చెప్పాడు. ఆయన ఆశయం నెరవేర్చాలని తన కుటుంబంతో సహా ఇండియాకి వచ్చినట్టు చెప్పాడు. వాడు మాటలు విన్న తర్వాత మా అందరి కళ్ళు చెమర్చాయి. మా నాన్న అయితే మా ఊరిలో ఆయనకున్న ఎకరం పొలం తాలూకు దస్తావేజులు శ్రీరామ్ చేతిలో పెట్టి “బాబూ, ఎంత గొప్ప తల్లితండ్రుల కడుపున పుట్టావయ్యా… దేశం కోసం ఆయన ప్రాణాలు అర్పించడమే కాదు ఎంత గొప్ప ఆశయంతో నిన్ను పెంచమని చెప్పారో వింటుంటేనే మా హృదయం పులకించిపోయింది. ఆయన ఆశయం నెరవేరాలి. నీ తల్లి పడిన కష్టం వృథా కాకూడదు. నువ్వు అనుకున్నట్టు మన ఊర్లోనే ఓ పెద్ద మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టి ఉచితంగా పేదలకు వైద్యం చెయ్యాలి. నీ సత్ససంకల్పానికి ఈ చిన్న కానుక ఇస్తున్నాను.
కాదనొద్దు. హాస్పిటల్ కట్టడానికి ఈ పొలం అన్ని రకాల సౌకర్యంగా ఉంటుంది’ అనగానే.. మా అమ్మ వెంటనే తన చేతికున్న బంగారు గాజులు శ్రీరామ్ చేతిలో పెట్టింది. వద్దని వాడు వారిస్తుంటే “నేను ఇప్పటివరకు నా కన్నతల్లి వంటి ఈ మాతృభూమికి ఎటువంటి
సేవ చేయలేదు. ఇప్పుడు మీ ద్వారా నాకు ఆ సేవా భాగ్యం దక్కింది కాదనొద్దు” అంటూ అనందంతో ఆమె కళ్ళ వెంబడి వస్తున్న ఆనంద బాష్పాలను తన పైట చెంగుతో తుడుచుకుంది. ఇంతలో నా కూతురు లాస్య పరిగెత్తుకుంటూ. లోపలికి వెళ్లి తను డిబ్బీలో దాచుకున్న చిల్లర డబ్బులు తీసుకొచ్చి “అంకుల్! ఇవి కూడా తీసుకోండి ప్లీజ్” అంటూ డిబ్బీని శ్రీరామ్ చేతిలో పెట్టింది. మళ్లీ “అంకుల్, నేను పెద్దయ్యాక పెద్ద డాక్టర్ అయ్యి మీరు కట్టే హాస్పిటల్ లో ఉచితంగా వైద్యం చేస్తాను” అంది. ఇంతలో శ్రీరామ్ కొడుకు రిషి కల్పించుకుని “నేను కూడా డాక్టర్ అయ్యి పేద వాళ్ళందరికీ సాయం చేస్తాను డాడీ” అన్నాడు.
అది చూసి అందరి కళ్ళు ఆనందంతో చెమర్చాయి. “ఆశయం ఎంతో గొప్పదైతేనేగానీ అందరి హృదయాలను గెల్చుకోలేదు. ఆ వసి హృదయాల్ని సైతం కదిలించిందా ఆశయం. జీవించినంత కాలం దేశం కోసం ఓ సైనికుడిగా సేవలందించడమే కాదు తన తర్వాత కూడా
ప్రజలకు సేవ చెయ్యాలనే ఆ మహానుభావుడి సత్సంకల్పం అద్భుతం. ఆయన మహోన్నతమైన ఆశయం తప్పక నెరవేరుతుంది” అంటూ గౌతమ్ తల్లిదండ్రులిద్దరూ ఆశీర్వదించారు. స్నేహితులిద్దరూ ఆ ప్రాజెక్టు కోసం ఏమేం చేయాలో ఆలోచించుకుని ఆ రోజే తమ చిన్ననాటి మిత్రులందరి సమావేశపరిచి గ్రామ పెద్దలతో మాట్లాడి కార్యాచరణకి వారి దగ్గరున్న 10 కోట్లకి సరిపడా లెక్కలు వేసుకొని కావాల్సిన అమౌంట్ ఎలాగ మీట్ అవ్వాలి, బ్యాంకులో లోన్ ఎలా తీసుకోవాలి? అన్ని విషయాలు మాట్లాడుకుని పట్టుదలతో ముందడుగు వేశారు.
ఈ విషయం ఊరంతా పొక్కింది. “మేము సైతం” అంటూ గౌతమ్ స్నేహితులు కూడా వీళ్ళతో కలిసి చేయూత నందించడానికి ముందుకొచ్చారు. అందరి ఆశీస్సులు మధ్య హాస్పిటల్ శర వేగంగా మొదలై కార్యరూపం దాల్చింది.
“గొప్పవాళ్ళంటూ ఎవరూ ఆకాశం నుంచి ఊడిపడరు. సామాన్య మనుషుల నుంచే వాళ్ళూ పుడతారు. కానీ వాళ్ళ ఉన్నతమైన ఆలోచనలు, సత్సంకల్ప బలంతో ఒకానొక ఉజ్వలమైన ఆశయంగా పరిణమించి అందరి హృదయాలను గెలుచుకొని కార్యరూపం దాలుస్తాయి. ఆ గొప్ప వ్యక్తులు మరణించినా కూడా ప్రజల హృదయాల్లో, చరిత్ర పుటల్లో అమరులుగానే ఉంటారు” అంటూ కాలం తోక తెగిన గాలిపటంలా రయ్ మంటూ ముందుకు దూసుకుపోయింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: