కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్ర బడ్జెట్‌ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్‌లో రాష్ట్రాల అభివృద్ధి కోసం పెద్ద కేటాయింపులు చేస్తున్నారని మంత్రి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం కూడా ప్రత్యేక కేటాయింపులు చేసారు. ఈ బడ్జెట్‌లో పోలవరం ప్రాజెక్టు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వంటి కీలక అంశాలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఆంధ్రప్రదేశ్‌కు ఈ బడ్జెట్‌లో ఆవశ్యకమైన కేటాయింపులు ఇలా ఉన్నాయి:
- పోలవరం ప్రాజెక్టు – ₹5,936 కోట్లు
- పోలవరం ప్రాజెక్టు బ్యాలెన్స్ గ్రాంట్ – ₹12,157 కోట్లు
- విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ – ₹3,295 కోట్లు
- విశాఖపట్నం పోర్ట్ – ₹730 కోట్లు
- రాష్ట్రంలో రోడ్లు మరియు వంతెనలు – ₹240 కోట్లు
- జీరో బడ్జెట్ సహజ వ్యవసాయం – ₹186 కోట్లు
- లెర్నింగ్ ట్రాన్స్‌ఫర్మేషన్ ఆపరేషన్స్ – ₹375 కోట్లు
- ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలను బలోపేతం చేయడం – ₹162 కోట్లు
- ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల మరియు జీవనోపాధి మెరుగుదల ప్రాజెక్ట్ (దశ 2) – ₹242.50 కోట్లు
ఈ కేటాయింపులు రాష్ట్ర అభివృద్ధికి కీలక పాత్ర పోషిస్తాయని అంచనా వేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2025-26 కేంద్ర బడ్జెట్‌పై స్పందించారు. ఆయన ఈ బడ్జెట్‌ను ప్రయోజనకరమైన మరియు ప్రగతిశీల బడ్జెట్‌గా అభివర్ణించారు. కేంద్ర ప్రభుత్వానికి మరియు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలోని “విక్షిత్ భారత్” దార్శనికతను ఈ బడ్జెట్ ప్రతిబింబిస్తోందని ఆయన పేర్కొన్నారు. ఈ బడ్జెట్‌లో మహిళా సంక్షేమం, పేదలు, యువత, రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నట్లు చంద్రబాబు నాయుడు ఉద్ఘాటించారు.
వచ్చే ఐదేళ్లలో ఆరు కీలక రంగాల్లో అభివృద్ధిపై దీర్ఘకాలిక దృష్టితో కేటాయింపులు జరిగాయని ఆయన పేర్కొన్నారు. “ఈ బడ్జెట్ దేశ సంక్షేమం వైపు కీలకమైన అడుగు. ఇది మన దేశానికి సంపన్నమైన భవిష్యత్తు కోసం సమగ్రమైన మరియు ఖచ్చితమైన బ్లూప్రింట్‌గా పనిచేస్తుంది. అదనంగా, ఇది మన ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా ఉన్న మధ్యతరగతికి పన్ను మినహాయింపును అందిస్తుంది. ఈ బడ్జెట్‌ను హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నాను” అని చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు.