తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, కెసిఆర్ సికింద్రాబాద్ పాస్‌పోర్టు కార్యాలయానికి వెళ్లారు. బుధవారం ఉదయం ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రం నుంచి తన సతీమణితో కలిసి కేసీఆర్ పాస్‌పోర్టు ఆఫీసుకు వచ్చారు. తన పాస్‌పోర్టును రెన్యూవల్ చేసుకోనున్నట్లు తెలుస్తోంది. డిప్లమాటిక్ పాస్‌పోర్టును సబ్‌మిట్ చేసి సాధారణ పాస్‌పోర్టును తీసుకునేందుకు కెసిఆర్ పాస్‌పోర్టు కార్యాలయానికి వచ్చారని అధికార వర్గాలు చెబుతున్నాయి. కేసీఆర్‌తో పాటు సతీమణి, జోగినపల్లి సంతోష్ ఆఫీస్‌లోకి వెళ్లారు. దాదాపు అరగంట పాటు రెన్యూవల్ ప్రాసెస్ జరిగింది. పాస్‌పోర్టు రెన్యూవల్ అనంతరం కెసిఆర్ పాస్‌పోర్టు ఆఫీసు నుంచి నందినగర్‌లోని నివాసానికి బయలుదేరి వెళ్లారు.త్వరలో అమెరికాకు వెళ్తారనే ప్రచారం జోరుగా జరుగుతున్న వేళ కెసిఆర్ పాస్‌పోర్టు రెన్యూవల్ చేసుకోవడం ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. పాస్ట్‌పోర్టు తీసుకున్న తర్వాత నెలా, రెండు నెలల్లో అమెరికా ప్రయాణం ఉంటుందని బీఆర్‌ఎస్ వర్గాలు చెబుతున్నాయి. అయితే పది సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా చేసినప్పుడు కానీ, సీఎం అవకముందు కూడా కెసిఆర్అమెరికా గడప దొక్కిన దాఖలాలు లేవు. మనవడు హిమాన్షు అమెరికాలో ఉన్నతవిద్యాభ్యాసం అభ్యసిస్తున్న నేపథ్యంలో అక్కడకు వెళ్తారని, రెండు నెలల పాటు అక్కడే కెసిఆర్ ఉంటారనే ప్రచారం జరుగుతోంది. పాస్ట్‌పోర్టు కార్యాలయం నుంచి నందినగర్‌కు వెళ్లిన కెసిఆర్అక్కడ లంచ్ బ్రేక్ అనంతరం తెలంగాణ భవన్‌లో జరుగనున్న బీఆర్‌ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి చేరుకోనున్నారు.

పార్టీపై కేసీఆర్ ఫోకస్
ఇదిలా ఉండగా, బీఆర్‌ఎస్ పార్టీ కార్యకలాపాల పట్ల కూడా కేసీఆర్ ఫోకస్ పెట్టారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పరాజయం ఎదురైన తర్వాత పార్టీ క్యాడర్‌లో స్తబ్దత నెలకొంది. ముఖ్యంగా గులాబీ పార్టీకి చెందిన పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరిపోవడం, మరికొందరు కూడా వెళ్లిపోతారనే ప్రచారం పార్టీని మరింత ఉలికిపాటుకు గురిచేసింది. సుమారు 14నెలలుగా ఫాంహౌస్ కే పరిమితమయ్యారు. దాదాపు ఏడు నెలల తర్వాత తెలంగాణ భవన్‌కు మాజీ సీఎం కేసీఆర్ రానున్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నేతలు, క్యాడర్‌కు బీఆర్‌ఎస్ అధినేత దిశానిర్దేశం చేయనున్నారు.ఈ నేపథ్యంలో, కేసీఆర్ బుధవారం తెలంగాణ భవన్‌లో విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమయ్యే ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు, కీలక నేతలతో కేసీఆర్ భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు.
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ,లోకల్ బాడీస్‌లో సత్తా చాటాలని గులాబీ పార్టీ భావిస్తోంది. దీంతో పార్టీ అధినేత అలెర్ట్ అయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనను గంభీరంగా గమనిస్తున్నానని కేసీఆర్ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల పక్షాన పోరాటం చేయాల్సిన సమయం వచ్చిందన్నారు. తాను కొడితే మామూలుగా ఉండదు.గట్టిగా కొడతానంటూ రేవంత్ సర్కార్‌కు కేసీఆర్ వార్నింగ్ కూడా ఇచ్చారు. ఏప్రిల్ 27న బీఆర్ఎస్(టీఆర్ఎస్) ఆవిర్భావ దినోత్సవం జరుగనుంది. దీంతో సిల్వర్ జూబ్లీ పేరుతో భారీ కార్యక్రమానికి కేసీఆర్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.