శ్రీవర్ణ కాశ్మీరం
ఆకు పచ్చని ప్రకృతి అందాల నడుమ పర్వతశ్రేణులతో, గలగలమని పారే సెలయేర్లతో కనులకింపైన కమనీయ కాశ్మీరం.
తెలతెల్లని చలచల్లని మంచు అందాల గుప్పిట్లో పర్యాటకులను బంధించే హిమగిరి సొగసుల సోయగాల నెలవు కాశ్మీరం.
ఆమె..అతడు.. ఓ చీకటి
అతడు ఆ చీకట్లోకి, రెప్పెయ్యకుండా చూస్తున్నాడు గోడకు జారబడి చూరు నుంచి జొరబడే పిల్లగాలులతో తడిసి ముడుచుకుపోతూ చీకట్లోకి రాళ్లు విసురుతున్నాడు. వాడి పెదాల మధ్యన వెలుగుతూ ఆరిపోతున్న పల్చటి నవ్వు పచ్చి పురుగులు కొన్ని వాడి చుట్టూ గింగిరాలు కొడుతున్నాయి. పురుగు నలిగిపోయిన వాసన అక్కడి పరిసరాల్లోకి సుతారంగా పాకుతుంది. అతడి ఎదురుగా మోకాళ్లపై చుబుకం ఆన్చి అతన్నే చూస్తున్న ఆమె వెలుగులు ఒలికించి చేసిన రబ్బరు బొమ్మలా ఉందామె మైకాన్ని తాగినట్టు మెరుస్తున్న పెదాలు స్నానమాడి వచ్చిన లేత చివురులాంటి
వొళ్ళు ఆమె మదిలోపల నిర్విరామంగా తచ్చాడుతున్న జ్ఞాపకాలు..
“బయటెక్కడో చిటుక్కున రాలిన చినుకు చప్పుడు..
ఉలికిపడి చూసిందామె అతడెళ్లిపోతున్నాడు..
వేళ్ళతో పిచ్చి లెక్కలు వేసుకుంటూ
చీకటిని తడుముకుంటూ అతడెళ్లిపోయాడు.
ఓ దుఃఖపు నవ్వును పెదాల కింద
అదిమిపెడుతూ ఆమె చూపు తిప్పుకుంది
బరువైన నిట్టూర్పు వదులుతూ ఒంటరితనం
తోడుగా ఊహల్ని కనుపాపలకు అంటించి
ఆమె మళ్లీ నిద్రకు ఉపక్రమించింది.
Modern Telugu Poets: మనసు పరిమళించెనే..
మనసు పరిమళించెనే..
గూటిలో డేగలా గగన
విహారం చేయాలని ఉంది.
బావిలో కప్పలా నాలోని ప్రపంచానికి
ఎల్లలు కట్టలేను. అంతులేని సంద్రాల
అంచులు తాకాలని ఉంది.
అప్పుడే విరిసిన మందారంలా
కొత్తదనాన్ని ప్రభవించే ప్రతి
ప్రభాతంలోని సరికొత్తదనాలను
సంతరించుకోవాలని ఉంది.
మనిషికి అస్తిత్వం ఎలాగో మనసుకు
వ్యక్తిత్వం అలానే కదా!
మనసు వికసిస్తే మాట పరిమళిస్తుంది.
ఇప్పుడు ఎదిగిన నా మనసులో
ఒదిగిన ఆకాశాన్ని చూస్తున్నాను.
పరిమళం అద్దడానికి ఒదిగిన
నా ఒడిలో భూగోళానికి
కాస్తంత చోటు ఇవ్వాలని ఉంది.
కృష్ణ బిలం
నీ చూపు వికిరణాలు
ఎన్నో వేల సార్లు
నా హృదయ మిర్రర్
పై పడి పరావర్తనం చెందినా
పట్టుకోలేకపోయాను నేను.
కాలం ధృక్ భ్రమ వల్ల
నా నుండి నేను ఏనాడో
వక్రీభవనం చెంది నువ్వయిపోయాను.
నా జ్ఞాపకాలు ప్రిజంగుండా
ప్రయాణించిన నీ ధ్వని
తరంగాలు విక్షేపణం చెంది
నా జీవిత గగనానికి
అనుభూతుల సప్త
స్వరాల ఇంద్రధనుస్సును
ఏర్పర్చాయి. అద్భుతాల
సప్త వర్ణాల సంగీతాన్ని సృష్టించాయి.
నువ్వు నా మది తెరపై మిథ్యా
ప్రతిబింబమై కనిపిస్తుంటే నేను
నిజ ప్రతిబింబమై ఎదుట నిలిచాను.
నీ గురుత్వాకర్షణ ప్రభావం వల్ల
నా కవిత్వం కరెంట్ అయ్యింది.
నీ చిరునవ్వుల అయస్కాంత
క్షేత్రం వల్ల నా గుండె
అనునాదం చెందింది.
ఇప్పుడర్థమైంది నాకు నీ చుట్టూ
కొన్ని లక్షల భ్రమణాల తర్వాత నీ ప్రేమే
ఓ కృష్ణ బిలం. నువ్వే నా భౌతిక శాస్త్రం