Jeremy Story : అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం : ముగ్గురు మృతి అమెరికాలో మరోసారి కాల్పుల భయం నెలకొంది.న్యూమెక్సికో రాష్ట్రంలోని లాస్ క్రూసెస్ నగరంలో జరిగిన ఈ ఘటన ప్రజలను తీవ్ర ఉత్కంఠకు గురిచేసింది. రెండు గుంపుల మధ్య చోటుచేసుకున్న ఈ కాల్పుల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.

మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు.లాస్ క్రూసెస్ పోలీస్ అధికారి జెరేమీ స్టోరీ తెలిపిన వివరాల ప్రకారం, అనుమతి లేకుండా నిర్వహించిన కారు ప్రదర్శన సమయంలో ఈ ఘర్షణ చోటుచేసుకుంది.తలెత్తిన వివాదం హింసాత్మకంగా మారడంతో కాల్పులు జరిగాయని ఆయన వివరించారు.మృతుల్లో ఇద్దరు యువకులు ఉన్నారని, గాయపడిన వారంతా 16 నుంచి 36 సంవత్సరాల మధ్య వయస్సు కలవారని పోలీసులు తెలిపారు.కారణాలు తెలియకుండానే కాల్పులు జరిపిన వ్యక్తులు అక్కడి ప్రజల్లో భయాందోళనలు రేపారు. కాల్పుల శబ్దంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు.సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడినవారిని అత్యవసరంగా సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.ప్రస్తుతం ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. కాల్పులకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.కాల్పులకు పాల్పడినవారి వివరాలను త్వరలో వెల్లడించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ ఘటన లాస్ క్రూసెస్ ప్రజల్లో తీవ్ర భయాందోళన రేపింది. స్థానికంగా ఈ సంఘటన హాట్ టాపిక్‌గా మారింది.