అమరావతి: జనసేన ఆవిర్భావ సభ నిర్వహణ కమిటీలతో మంత్రి నాదెండ్ల మనోహర్ సమావేశం నిర్వహించారు. మార్చి 14న పిఠాపురం వేదికగా జనసేన 12వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు సంబంధించిన పోస్టర్ ను తాజాగా ఆయన రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జనసేన పార్టీ రాష్ట్రానికి భవిష్యత్ అని ప్రజలు అనుకునే విధంగా సభ నిర్వహించాలన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విలువలతో కూడిన రాజకీయాలు చేస్తున్నారు. పవన్ వస్తున్నారంటే జనాలను తరలించాల్సిన అవసరం లేదు. జనసేనలో చాలా మంది పదవులను ఆశిస్తున్నారు. పదవుల కోసం జనసేనలో ప్రయాణం చేయకూడదని మంత్రి మనోహర్ సూచించారు.

పండుగ వాతావరణంలో గర్వంగా సభ
జనసేన తరపున ఇంత మంది ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలుగా ఉంటారు అని అనుకోలేదని నాందెండ్ల మనోహర్ తెలిపారు. పండుగ వాతావరణంలో గర్వంగా సభ జరుపుకోవాలి. పవన్ డిప్యూటీ సీఎం హోదాలో నిర్వహిస్తున్న సభను సక్సెస్ చేయాలని సూచించారు. అధికారం దుర్వినియోగం చేసి వ్యవస్థలను వారి స్వార్థం కోసం వాడుకున్న వాళ్లను చట్టం శిక్షిస్తుందన్నారు. మంత్రి క్షేత్ర స్థాయిలో ఇబ్బంది పడ్డవారు ఇచ్చిన కంప్లైట్ పై ప్రభుత్వం తప్పకుండా స్పందిస్తుందని నాందెండ్ల తెలిపారు.
మార్చి 12, 13, 14 తేదీల్లో పిఠాపురంలో ప్లీనరీ
ఈ చారిత్రాత్మక ఎన్నికల విజయం తర్వాత జరుగుతున్న మొదటి ఆవిర్భావ దినోత్సవ వేడుక ఇది కాబట్టి, ఈ కార్యక్రమానికి భారీ ఏర్పాట్లు చేయడానికి ప్రణాళికలు వేస్తున్నారు. జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రతిపాదన మేరకు పిఠాపురంలో ఈ వేడుకలు నిర్వహించాలనే నిర్ణయం తీసుకున్నారు. 3 రోజులపాటు ఈ వేడుకలు నిర్వహించబోతున్నారని తెలుస్తోంది. మార్చి 12, 13, 14 తేదీల్లో పిఠాపురంలో ప్లీనరీ నిర్వహించాలని తీర్మానించారు జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో జనసేన సిద్ధాంతాలు, పవన్ కల్యాణ్ ఆశయాలు, ప్రజలకు జనసేన చేస్తున్న సేవ గురించి వివరించనున్నారు.