అమెరికాలో పని చేయాలనుకునే విదేశీ నిపుణులకు పెద్ద షాక్ ఎదురైంది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తాజాగా తీసుకున్న నిర్ణయం వలస ఉద్యోగులపై భారీ భారం మోపనుంది. హెచ్-1బీ వీసా (H1B Visa Fee) దరఖాస్తులపై వార్షిక రుసుము లక్ష డాలర్లకు పెంచుతూ కార్యనిర్వాహక ఉత్తర్వుపై ఆయన సంతకం చేశారు.ఇకపై అమెరికా కంపెనీలు ఒక్కో వర్క్ వీసాకు ఏడాదికి లక్ష డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. ఈ మొత్తాన్ని భరించలేని కంపెనీలు విదేశీ నిపుణులను నియమించుకోవడం కష్టమే. దీంతో అమెరికాకు వెళ్లాలని కలలు కంటున్న వేలాది మంది వృత్తి నిపుణులపై ప్రతికూల ప్రభావం పడనుంది. ముఖ్యంగా భారతీయ ఐటీ నిపుణులు, నైపుణ్యంతో కూడిన చైనా కార్మికులు ఎక్కువగా దెబ్బతింటారని అంచనా.
మాస్టర్స్ విద్యార్థుల ఆశలు దెబ్బతినే ప్రమాదం
ఈ నిర్ణయం కారణంగా అమెరికాలో మాస్టర్స్ ప్రోగ్రామ్ చేయాలని కలలుకంటున్న భారతీయ విద్యార్థుల ఆశలు కూడా ఆవిరయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే వీసా రుసుము భారీగా పెరగడం వల్ల కంపెనీలు విదేశీ విద్యార్థులను స్పాన్సర్ చేయడానికి వెనుకడుగు వేస్తాయి.అమెరికా కామర్స్ సెక్రటరీ హోవార్డ్ లుట్నిక్ ప్రకారం, ప్రతి హెచ్-1బీ వీసాపై ఏడాదికి లక్ష డాలర్లు తప్పనిసరిగా చెల్లించాల్సి ఉంటుంది. కంపెనీలు ఉద్యోగావకాశాలు ఇవ్వాలనుకుంటే, ముందుగా అమెరికన్ పట్టభద్రులకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన స్పష్టం చేశారు. విదేశీయులను ఆధారపడి స్థానిక ఉద్యోగాలను తగ్గించరాదని హెచ్చరించారు.
టెక్ రంగం ప్రతిస్పందనపై ప్రశ్నలు
ఈ నిర్ణయం టెక్నాలజీ రంగానికి మద్దతుగా ఉంటుందని ట్రంప్ చెప్పారు. కానీ ఇప్పటి వరకు పెద్ద టెక్ కంపెనీలు దీనిపై స్పందించలేదు. వాస్తవానికి హెచ్-1బీ వీసాలపై ఆధారపడే కంపెనీలు చాలా ఉన్నాయి. అందువల్ల భవిష్యత్‌లో వీరి ప్రతిస్పందన కీలకం కానుంది.ప్రతి సంవత్సరం 65 వేల హెచ్-1బీ వీసాలు కంపెనీలకు ఇస్తారు. అడ్వాన్స్‌డ్ డిగ్రీలు ఉన్న వారికి మరో 20 వేల వీసాలు ఉంటాయి. ఇప్పటివరకు వీసా కోసం చిన్న మొత్తంలో ఫీజు చెల్లిస్తే సరిపోయేది. కానీ ఇప్పుడు కొత్త నిబంధనలతో కంపెనీల ఖర్చు విపరీతంగా పెరిగింది. ఈ వీసాలను మూడేండ్ల నుండి ఆరేండ్ల వరకు మంజూరు చేస్తారు.
హెచ్-1బీతో అమెరికాకు వెళ్లిన ప్రముఖులు
ట్రంప్ భార్య మెలానియా ట్రంప్ కూడా గతంలో హెచ్-1బీ వీసాపై అమెరికాకు వెళ్లారు. 1996లో వర్క్ వీసాతో అక్కడికి చేరుకుని, తరువాతే స్థిరపడ్డారు. అలాగే టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ కూడా ఇదే వీసాతో అమెరికాలో స్థిరపడ్డారు. దక్షిణాఫ్రికాలో జన్మించిన ఆయన అమెరికాకు వెళ్లి సక్సెస్‌ఫుల్ వ్యాపారవేత్తగా ఎదిగారు.హెచ్-1బీ రుసుము పెంపుతో పాటు ట్రంప్ గోల్డ్ కార్డు ప్రణాళికను కూడా ప్రకటించారు. దీని రుసుము 10 లక్షల డాలర్లుగా నిర్ణయించారు. దీని ద్వారా అమెరికాకు 100 బిలియన్ డాలర్లు వచ్చే అవకాశం ఉందని ఆయన తెలిపారు. ఈ నిధులను పన్నుల తగ్గింపు, అభివృద్ధి ప్రాజెక్టులు, రుణాల చెల్లింపుల కోసం వినియోగిస్తామని పేర్కొన్నారు.ట్రంప్ తాజా నిర్ణయం అమెరికాలో ఉద్యోగం చేయాలని ఆశపడుతున్న విదేశీ నిపుణులపై తీవ్ర ప్రభావం చూపనుంది. ముఖ్యంగా భారతీయ ఐటీ రంగం, విద్యార్థులపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. రాబోయే రోజుల్లో కంపెనీల ప్రతిస్పందన ఏవిధంగా ఉంటుందో చూడాలి.
Read Also :