అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఇటీవల కీలక నిర్ణయం తీసుకున్నారు. భారత్ సహా సుమారు 70 దేశాలపై అధిక టారిఫ్ (High tariffs on about 70 countries, including India)లు విధించాలని ఆయన ప్రకటించారు. ఈ నిర్ణయంతో ఆయా దేశాలపై భారీ సుంకాలు, జరిమానాలు అమలు కానున్నాయి. ట్రంప్ ప్రకటన అమెరికా ఆర్థిక వ్యవస్థపై ఎలా ప్రభావం చూపుతుందో అనే అంశంపై తాజాగా ఓ నివేదిక వెలువడింది.ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక ప్రకారం, ట్రంప్ విధిస్తున్న అధిక సుంకాల ప్రభావం అమెరికా ప్రజలపైనే ఎక్కువగా ఉంటుంది. ఈ సుంకాల కారణంగా అమెరికాలో ద్రవ్యోల్భణం పెరిగే అవకాశం ఉందని, దాంతో అక్కడి కుటుంబాలపై భారీ భారం పడుతుందని నివేదిక వెల్లడించింది. ఒక్కో కుటుంబం పై సగటున 2,400 డాలర్ల అదనపు ఖర్చు వచ్చే అవకాశం ఉందని అంచనా వేసింది. భారతీయ కరెన్సీ ప్రకారం ఇది దాదాపు రూ. 2 లక్షలకు సమానం.

వర్గాల వారీగా భిన్న ప్రభావం
సుంకాల ప్రభావం అన్ని వర్గాలపై ఒకేలా ఉండదని నివేదిక తెలిపింది. తక్కువ ఆదాయ వర్గాల కుటుంబాలపై సుమారు 130 డాలర్ల వరకు భారం పడవచ్చు. అధిక ఆదాయ వర్గాలపై ఈ భారం 5,000 డాలర్ల వరకు పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. మొత్తానికి సగటున ఒక్కో కుటుంబంపై 2,400 డాలర్ల అదనపు ఖర్చు ఉంటుందని అంచనా వేసింది.ట్రంప్ ఈ నిర్ణయం వల్ల భారత్ సహా ఇతర దేశాలకు కంటే అమెరికాకే ఎక్కువ నష్టం కలిగే అవకాశం ఉందని నివేదిక చెబుతోంది. అధిక సుంకాల కారణంగా అమెరికాలో ఖర్చులు పెరిగి, డిమాండ్ తగ్గవచ్చని స్పష్టం చేసింది. ఈ పరిణామాలు అమెరికా జీడీపీ వృద్ధి రేటును 40 నుంచి 50 బేసిస్ పాయింట్ల వరకు తగ్గించవచ్చని అంచనా వేసింది.
భారత్‌పై ప్రభావం ఎలా?
సుంకాల పెరుగుదల భారత్‌పై కూడా ప్రభావం చూపవచ్చని నివేదిక పేర్కొంది. అయితే, డాలర్ బలహీనపడే అవకాశంతో పాటు ద్రవ్యోల్భణం పెరుగుతుందని తెలిపింది. ఈ పరిస్థితుల్లో భారత్ కంటే అమెరికానే బలహీన స్థితిలోకి వెళ్లే అవకాశం ఉందని అంచనా వేసింది.అంతర్జాతీయ ఆర్థిక ఒడిదుడుకులను ఎదుర్కొనేందుకు భారత్ ఇప్పటికే తగిన చర్యలు తీసుకుంటుందని నివేదిక పేర్కొంది. గ్లోబల్ మార్పుల మధ్య భారత్ ఆర్థిక వ్యవస్థ స్థిరంగా కొనసాగుతుందనే నమ్మకాన్ని ఈ నివేదిక వ్యక్తం చేసింది.
Read Also : BCCI: బుమ్రాపై బీసీసీఐ ఆగ్రహం..ఎందుకంటే