అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తడాఖా చూపిస్తోన్నారా?, రెండోసారి అగ్రరాజ్యం పీఠాన్ని అధిష్ఠించిన తరువాత కక్షసాధింపు చర్యలకు దిగారా? అనే ప్రశ్నలకు అవుననే సమాధానమే వినిపిస్తోంది. న్యాయ మంత్రిత్వ శాఖ ఆధీనంలో పని చేస్తోన్న డజన్ల కొద్దీ న్యాయవాదులు, ఉద్యోగులపై వేటువేశారు. వాళ్లందరి ఉద్యోగాలను ఊడగొట్టారు. ఒక్క సంతకంతో స్పెషల్ కౌన్సెల్ టీమ్ మొత్తాన్ని అబాలిష్ చేసిపడేశారు. అన్ని డివిజన్లల్లో ఉన్న సీనియర్ అడ్వొకేట్లను తొలగించారు. అక్రమ వలసలను ఉక్కుపాదంతో అణచివేస్తోన్న ట్రంప్..ఇప్పుడు ఉద్యోగులపైనా అదే తరహా వైఖరిని ప్రదర్శిస్తోండటమే దీనికి కారణం.
దీనికి కారణాలు లేకపోలేదు. గతంలో వాళ్లంతా కూడా డొనాల్డ్ ట్రంప్‌కు వ్యతిరేకంగా పని చేయడమే. మాజీ అధ్యక్షుడు జో బైడెన్ హయాంలో డొనాల్డ్ ట్రంప్ పలు క్రిమినల్ కేసులను ఎదుర్కొన్న విషయం తెలిసిందే. హుష్ మనీ సహా పలు కేసుల విచారణ కోసం న్యాయస్థానాల చుట్టూ తిరగాల్సొచ్చింది. అమెరికన్ టాప్ పోర్న్‌స్టార్‌కు అక్రమ చెల్లింపుల వ్యవహారంలో అరెస్ట్‌ను సైతం ఎదుర్కొన్నారు. పోర్న్ స్టార్ స్టార్మీ డేనియల్స్‌కు 2016 హుష్ మనీ చెల్లింపుల కేసుల్లో మన్‌హట్టన్ న్యాయస్థానం ఆయనను దోషిగా నిర్ధారించింది.
నేరారోపణలతో అరెస్టయిన తొలి అమెరికా మాజీ అధ్యక్షుడు ఆయనే. 2016 అధ్యక్ష ఎన్నికల సమయంలో అమెరికన్ పోర్న్ స్టార్ స్టార్మీ డేనియల్స్‌తో తనకు ఉన్న సంబంధాలు బయటికి రాకుండా జాగ్రత్త పడ్డారని, దీనికోసం తన తరఫు అడ్వొకేట్‌ను మధ్యవర్తిగా పెట్టి- ఆమెకు పెద్ద మొత్తంలో డబ్బులను చెల్లించారనేది డొనాల్డ్ ట్రంప్‌పై ఉన్న ఆరోపణలు. ఈ విషయాన్ని బయటపెట్టకుండా ఉండటానికి బెదిరించారని, తాను నోరెత్తకుండా ఉండటానికి 1.30 లక్షల డాలర్లు ఇచ్చారని స్పష్టం చేశారు. ఈ కేసును విచారించిన మన్‌హట్టన్ క్రిమినల్ కోర్టు ట్రంప్‌ను దోషిగా తేల్చింది. అరెస్ట్ సైతం అయ్యారాయన. ఆయా కేసుల్లో తనకు వ్యతిరేకంగా వాదించిన అడ్వొకేట్లు, ఇతర ఉద్యోగులపై తాజాగా వేటు వేశారు డొనాల్డ్ ట్రంప్. స్పెషల్ కౌన్సెల్ జాక్ స్మిత్, ఆయనతో పాటు పని చేసిన కేరీర్ ప్రాసిక్యూటర్లను విధుల నుంచి తొలగించాలంటూ అటార్నీ జనరల్ జేమ్స్ మెక్‌హెన్రీకి ఆదేశాలను జారీ చేశారు. ఇదివరకే జాక్ స్మిత్ తన పదవికి రాజీనామా చేశారని అటార్నీ జనరల్ కార్యాలయం తెలిపింది.