థాయిలాండ్ (Thailand)లో ఒకే ఫోన్ కాల్ దేశ రాజకీయాలను తారుమారు చేసింది. ఆ దేశపు అతి పిన్న వయస్కురాలైన ప్రధాని పటోంగ్టార్న్ షినవత్రా (Patongtarn Shinawatra) తన పదవిని కోల్పోయారు. నైతిక ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారన్న కారణంతో రాజ్యాంగ న్యాయస్థానం ఆమెను అనర్హురాలిగా ప్రకటించింది. ఏడాది క్రితం ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన ఆమె, అనూహ్యంగా పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.ఈ ఏడాది మేలో థాయిలాండ్, కంబోడియా మధ్య సరిహద్దు వివాదం తలెత్తింది. ఈ సమయంలో షినవత్రా కంబోడియా మాజీ ప్రధాని హున్ సేన్తో ఫోన్‌లో మాట్లాడారు. సంభాషణలో ఆమె థాయ్ సైన్యాధికారిని విమర్శించారు. ఆ రికార్డింగ్ బయటకు రావడంతో దేశవ్యాప్తంగా కలకలం చెలరేగింది.
జాతీయ ప్రయోజనాలపై న్యాయస్థానం అభిప్రాయం
సరిహద్దు ఉద్రిక్తతల సమయంలో సైన్యాన్ని విమర్శించడం దేశ ప్రయోజనాలకు విఘాతం అని న్యాయస్థానం పేర్కొంది. పొరుగు దేశ నేతకు అనుకూలంగా మాట్లాడటం ప్రధానిగా నైతిక బాధ్యతను దెబ్బతీసిందని తీర్పులో పేర్కొంది. అందుకే ఆమెను వెంటనే పదవి నుంచి తొలగించింది.షినవత్రా తొలగింపుతో థాయ్ పార్లమెంట్ కొత్త ప్రధానిని ఎన్నుకోవాల్సి వచ్చింది. అయితే ఆమె పార్టీ ఫ్యూథాయ్కు స్వల్ప మెజారిటీ మాత్రమే ఉండటంతో ఈ ప్రక్రియ కఠినంగా మారింది. కొత్త ప్రధాని ఎన్నికయ్యే వరకు ఉప ప్రధాని ఫుమ్తామ్ వెచైచాయ్ తాత్కాలిక బాధ్యతలు నిర్వర్తిస్తారు.ప్రధాని రేసులో 77 ఏళ్ల చైకాసెం నితిసిరి పేరు బలంగా వినిపిస్తోంది. ఆయన కూడా ఫ్యూథాయ్ పార్టీకే చెందినవారు. అదే సమయంలో మాజీ ప్రధాని, సైనిక నేత ప్రయుత్ చాన్-ఓచా కూడా పోటీలో ఉన్నారని సమాచారం.
ఏడాదిలో రెండోసారి అనూహ్య పరిణామం
గత ఏడాది రాజ్యాంగ న్యాయస్థానం అప్పటి ప్రధానిని తొలగించడంతో అనూహ్యంగా షినవత్రా ప్రధానిగా అయ్యారు. ఇప్పుడు అదే కోర్టు తీర్పుతో ఆమె పదవి కోల్పోవడం థాయిలాండ్ రాజకీయాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది.పదవి కోల్పోయిన షినవత్రా భవిష్యత్ రాజకీయ ప్రస్థానం ఏ దిశగా వెళుతుందో అనుమానాలు మొదలయ్యాయి. ఫ్యూథాయ్ పార్టీ బలహీనతలపై కూడా ప్రశ్నలు అవుతున్నాయి. మరోవైపు కొత్త ప్రధానిని ఎన్నుకునే ప్రక్రియలో ఏ మార్పులు వస్తాయన్నది ఆసక్తిగా మారింది.
Read Also :