భారత సంతతికి చెందిన నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్ (Sunita Williams) అంతరిక్ష ప్రయాణాలకు అధికారికంగా వీడ్కోలు పలికారు. ఆమె పదవీ విరమణ చేస్తున్నట్లు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా తాజాగా ప్రకటించింది. నిజానికి గత ఏడాది డిసెంబరు 27 నుంచే ఈ రిటైర్మెంట్ అమలులోకి వచ్చిందని నాసా స్పష్టం చేసింది.
Read Also: JD Vance : నాలుగోసారి తండ్రి కాబోతున్న JD వాన్స్
సునీతా విలియమ్స్ రికార్డులు
1998లో నాసాకు ఎంపికైన సునీతా విలియమ్స్ (Sunita Williams) .. తన కెరీర్‌లో మొత్తం మూడు అంతరిక్ష యాత్రల్లో పాల్గొన్నారు. నింగిలో ఆమె గడిపిన మొత్తం సమయం 608 రోజులు. నాసా చరిత్రలో అత్యధిక కాలం అంతరిక్షంలో గడిపిన వ్యోమగాముల్లో ఆమె రెండో స్థానంలో నిలిచారు. అంతేకాకుండా మహిళా వ్యోమగామిగా అత్యధికంగా 9 సార్లు స్పేస్ వాక్ (62 గంటల 6 నిమిషాలు) చేసిన రికార్డు కూడా ఆమె పేరిటే ఉంది. అంతరిక్షంలో మారథాన్ రన్ చేసిన మొదటి వ్యక్తిగా కూడా సునీతా విలియమ్స్ చరిత్ర సృష్టించారు.
2006లో స్పేస్ షటిల్ డిస్కవరీ ద్వారా అంతరిక్షంలోకి ప్రయాణించి.. అత్యధిక స్పేస్ వాక్‌లు చేసిన మహిళగా సునీతా విలియమ్స్ రికార్డు నెలకొల్పారు. ఇక 2012లో రెండోసారి కజకిస్థాన్ నుంచి ప్రయోగించిన మరో మిషన్ ద్వారా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లి.. ISSలో అమోనియా లీకేజీని సరిచేయడం వంటి కీలక పనులు చేపట్టారు.
2024 జూన్‌లో బోయింగ్ స్టార్‌లైనర్ ద్వారా కేవలం 10 రోజుల పర్యటన కోసం వెళ్లిన సునీత, అంతరిక్ష నౌకలో సాంకేతిక లోపాల వల్ల అక్కడే చిక్కుకుపోయారు. ఆ 10 రోజుల యాత్ర కాస్తా 286 రోజుల సుదీర్ఘ నిరీక్షణగా మారింది. ఎట్టకేలకు 2025 మార్చి 18న స్పేస్‌ఎక్స్ డ్రాగన్ క్యాప్సూల్ ద్వారా ఆమె క్షేమంగా భూమికి చేరుకున్నారు. ఈ సుదీర్ఘ నిరీక్షణ ఆమె మనోధైర్యానికి నిదర్శనంగా నిలిచింది.గుజరాత్‌లోని మెహసానా జిల్లా జూలాసన్‌కు చెందిన డాక్టర్ దీపక్ పాండ్యా కుమార్తె అయిన సునీత.. తన ప్రతి ప్రయాణంలో భారతీయతను చాటారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: