జెలెన్‌స్కీకి ఇలా జరగాల్సిందే..
మాస్కో: మీడియా ఎదుటే అమెరికా, ఉక్రెయిన్ అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్, జెలెన్‌స్కీ వాగ్వాదానికి దిగడం యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ పరిణామాలపై రష్యా స్పందిస్తూ ఉక్రెయిన్‌పై తీవ్ర పదజాలంతో విమర్శలు గుప్పించింది. జెలెన్‌స్కీకి ఇలా జరగాల్సిందేనని ఎద్దేవా చేసింది.
అన్నం పెట్టిన చేతినే గాయపరుస్తున్నారు..
ఈ వాడీవేడి చర్చపై రష్యా మాజీ అధ్యక్షుడు, రష్యా సెక్యూరిటీ కౌన్సిల్ డిప్యూటీ ఛైర్మన్ దిమిత్రి మెద్వెదేవ్ మాట్లాడుతూ.. అమెరికా పట్ల అమర్యాదగా ఉన్న ఉక్రెయిన్‌కు ఈ పరిణామం గట్టి చెంపదెబ్బ. జెలెన్‌స్కీకి ఇలా జరగాల్సిందే అని అన్నారు. రష్యా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మరియా జఖరోవా స్పందిస్తూ.. ఉక్రెయిన్ అధ్యక్షుడు తమకు అన్నం పెట్టిన చేతినే గాయపరుస్తున్నారు. తమకు సాయం చేసిన వారితోనే వాగ్వాదానికి దిగారు. ఆయనపై దాడి చేయకుండా ట్రంప్, జేడీవాన్స్ సంయమనం పాటించడం అద్భుతమే అని దుయ్యబట్టారు.
పేరుపేరున కృతజ్ఞతలు
మరోవైపు తాజా పరిణామాలపై ఐరోపా సహా ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల అధినేతలు సామాజిక మాధ్యమాల్లో స్పందించారు. కీవ్ ఒంటరి కాదంటూ జెలెన్‌స్కీకి అండగా నిలిచారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో సహా పలువురు దేశాధినేతలు అమెరికా తీరును తప్పుబడుతూ పోస్టులు చేశారు. వీరందరికీ ఉక్రెయిన్ అధ్యక్షుడు పేరుపేరున కృతజ్ఞతలు తెలియజేశారు.