అమెరికాలోని నార్త్ కరోలినా రాష్ట్రంలో జరిగిన ఘోర విమాన ప్రమాదం క్రీడా ప్రపంచాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. అమెరికాకు చెందిన ప్రముఖ కార్ రేసర్ గ్రెగ్ బిఫిల్ ప్రయాణిస్తున్న ప్రైవేట్ జెట్ విమానం స్టెట్స్వెల్లే రీజనల్ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అవుతున్న సమయంలో సాంకేతిక లోపంతో ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో గ్రెగ్ బిఫిల్ (56) తో పాటు ఆయన భార్య, ఇద్దరు పిల్లలు సహా మొత్తం ఏడుగురు మరణించినట్లు ప్రాథమిక సమాచారం అందుతోంది. విమానం భూమిని ఢీకొన్న వెంటనే భారీగా మంటలు వ్యాపించడంతో లోపల ఉన్నవారు ప్రాణాలు కోల్పోయారు.
Latest news: Mumbai Rent Crisis: ముంబైలో వైరల్ అవుతున్న మల్టీ స్పెషాలిటీ చిన్న క్లినిక్
ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో ఎంతమంది ఉన్నారనే దానిపై స్పష్టత రానప్పటికీ, ప్రస్తుతం ఏడుగురు మృతి చెందినట్లు అధికారులు ధృవీకరించారు. మిగిలిన ముగ్గురి ఆచూకీ కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. విమానం కుప్పకూలిన తర్వాత మంటలు విమానాశ్రయం రన్‌వే సమీపంలో భారీగా ఎగిసిపడటంతో అధికారులు భద్రతా కారణాల దృష్ట్యా ఎయిర్‌పోర్ట్‌ను తాత్కాలికంగా మూసివేశారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. విమాన శకలాలు చెల్లాచెదురుగా పడి ఉండటంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది.

గ్రెగ్ బిఫిల్ మృతి వార్త తెలియగానే మోటార్ రేసింగ్ కమ్యూనిటీలో విషాద ఛాయలు అలముకున్నాయి. నాస్కార్ (NASCAR) ఛాంపియన్‌గా ఎన్నో రికార్డులు సృష్టించిన బిఫిల్, రేసింగ్ అభిమానులకు చిరపరిచితుడు. ఆయన మృతి పట్ల ప్రముఖ క్రీడాకారులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఒక అద్భుతమైన రేసర్‌ను, తన కుటుంబాన్ని ఇలాంటి ప్రమాదంలో కోల్పోవడం అత్యంత బాధాకరమని మోటార్ స్పోర్ట్స్ అసోసియేషన్ పేర్కొంది. ఈ ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలను తెలుసుకోవడానికి ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA) విచారణకు ఆదేశించింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com