భారతదేశం ఇటీవల చేపట్టిన “ఆపరేషన్ సిందూర్” (Operation Sindoor) ద్వారా పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో ఉన్న ఉగ్రవాద కేంద్రాలను లక్ష్యంగా తీసుకుని సమర్థవంతంగా నాశనం చేయడంపై పాకిస్థాన్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ చర్యల పట్ల ఓవైపు ఉగ్రవాదానికి ఎదురుదెబ్బతగలడమనే భయంతో, మరోవైపు అంతర్జాతీయంగా ఎదురవుతున్న ఒత్తిడిని దృష్టిలో పెట్టుకుని పాకిస్థాన్ వరుసగా తప్పుడు ప్రచారాలకే మళ్లింది.
ఆదంపూర్ విమాన స్థావరం పై పాక్ ఆరోపణలు
అత్యాధునిక ఎస్-400 క్షిపణి (S-400 missile) వ్యవస్థతో కూడిన పంజాబ్ రాష్ట్రంలోని ఆదంపూర్ (Adampur) వాయుసేన స్థావరంపై తాము దాడి చేశామని పాకిస్థాన్ తాజాగా చెబుతోంది. గతంలో కూడా ఇదే తరహాలో పలు ఆరోపణలు చేసింది. ఆదంపూర్ లోని ఎస్-400 వ్యవస్థను ధ్వంసం చేశామని పాక్ ఆరోపించింది. మార్ఫింగ్ చేసిన ఫొటోలతో ప్రచారం చేసుకుంది. అయితే, ఆదంపూర్ లో పర్యటించిన భారత ప్రధాని నరేంద్ర మోదీ ఎస్-400 క్షిపణి విధ్వంసక వ్యవస్థ ముందు నిలబడి ప్రసంగించడం ద్వారా పాక్ ప్రచారాన్ని తిప్పికొట్టారు.
ప్రధాని మోదీ ప్రత్యక్షంగా బలమైన ఖండన
అయితే, ఈ ప్రచారాన్ని భారత ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా తిప్పికొట్టారు. ఆయన ఇటీవల ఆదంపూర్ విమాన స్థావరాన్ని సందర్శించి, అక్కడి సైనికులతో మాట్లాడారు. ముఖ్యంగా ఎస్-400 వ్యవస్థ ముందు నిలబడి ప్రసంగించడం ద్వారా పాకిస్థాన్ తప్పుడు ఆరోపణలను కొట్టి పారేశారు. ఈ దుష్ప్రచారంతో పాకిస్థాన్ అంతర్జాతీయంగా నవ్వులపాలైంది. అయినప్పటికీ బుద్ధి మార్చుకోని పాకిస్థాన్ తాజాగా మరో ఫేక్ ఫొటోతో ఆదంపూర్ వైమానిక స్థావరంలోని సుఖోయ్ యుద్ధ విమానాన్ని నాశనం చేశామని చెబుతోంది.
డిజిటల్ దౌర్జన్యానికి భిన్నంగా
అయితే, ప్రముఖ జియో-ఇంటెలిజెన్స్ విశ్లేషకుడు డేమియన్ సైమన్ పాక్ చేస్తున్న తప్పుడు ఆరోపణలను శాస్త్రీయంగా విచ్ఛిన్నం చేశారు. గత నెలలో జరిగిన నాలుగు రోజుల సైనిక ఘర్షణకు రెండు నెలల ముందు, అంటే మార్చి 2025లో తీసిన శాటిలైట్ చిత్రాన్ని సైమన్ విడుదల చేశారు. ఈ చిత్రంలో ఒక మిగ్-29 విమానం మరమ్మతులో ఉండటం, ఇంజిన్ టెస్ట్ ప్యాడ్ వద్ద కనిపించే నల్లటి మసి సాధారణమైనదేనని ఆయన స్పష్టం చేశారు.