దిల్లీలో ఉన్న పాకిస్థాన్ హైకమిషన్ (Pakistan high commission)కార్యాలయానికి చెందిన ఓ అధికారి తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన భారత ప్రభుత్వం, ఆయనను దేశం నుంచి బహిష్కరించేందుకు నిర్ణయం తీసుకుంది. ఆయన తన హోదాకు అనుగుణంగా ప్రవర్తించకపోవడంతో ఈ చర్య తీసుకున్నట్లు భారత విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. 24 గంటల్లోగా భారత్‌ను విడిచి వెళ్లాలని డెడ్‌లైన్ (deadline)విధించింది. తన హోదాకు తగ్గట్లు నడుచుకోకపోవడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర విదేశాంగ శాఖ తెలిపింది.
అయితే ఇటీవల గూఢచర్యానికి పాల్పడుతున్నారనే అభియోగంపై ఓ పాక్ అధికారిని కేంద్ర బహష్కరించిన విషయం తెలిసిందే. ఇప్పుడు వారం వ్యవధిలో మరో అధికారి బహిష్కరణకు గురికావడం గమనార్హం. ఇప్పుడు సదరు అధికారిపై ఎలాంటి అభియోగాలు తీసుకున్నారన్నది మాత్రం విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించలేదు.
భారత సైన్యం దాడులు
జమ్ముకశ్మీర్ పహల్గాంలో ఉన్న బైసనర్ లోయలో ఉగ్రదాడి అనంతరం ఆపరేషన్ సిందూర్ పేరిట పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం దాడులు జరిపింది. వైమానిక స్థావరాలను మట్టుబెట్టింది. ఆ తర్వాత ఇరు దేశాల మధ్య సైనికపరమైన ఉద్రిక్తతలు తలెత్తి, సద్దుమణిగిన నేపథ్యంలో తాజా పరిణామాలు చోటు చేసుకున్నాయి.
మరోవైపు, పహల్గాం ఉగ్రదాడితో వణికిపోయిన జమ్మూకశ్మీర్ ప్రజలను ఇప్పుడు మరో సమస్య వెంటాడుతున్నట్లు తెలుస్తోంది. ఉగ్రవాదులు సైనిక దుస్తులు ధరించి సంచరిస్తుండటంతో స్థానికులకు కొత్త సమస్య ఎదురవుతోంది. భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య తేడాను గుర్తించలేక అయోమయానికి గురవుతున్నారు. అటు భద్రతా సిబ్బందికి ఉన్న ముప్పును పసిగట్టడంలో కూడా ఇబ్బంది ఎదురవుతోంది. పహల్గాం దాడి నాటి నుంచి ఈ తరహా ఘటనలు పెరగడం ఆందోళనకరంగా మారింది.
సైనిక దుస్తుల్లో ఉగ్రవాదులు
ఏప్రిల్ 22న పహల్గాంలో పర్యటకులపై ఉగ్రవాదులు పాశవిక దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఆ రోజు కాల్పులు జరిపిన దుండగులు సైనిక దుస్తుల్లో వచ్చారని ప్రత్యక్ష సాక్షులు ఇప్పటికే పేర్కొన్నారు. దీంతో ఆ దిశగా భద్రతా బలగాలు దర్యాప్తు చేపట్టాయి. ఆ తర్వాత కూడా ఉగ్రవాదులు అదే పంథా కొనసాగిస్తున్నట్లు భద్రతా సిబ్బంది గుర్తించారు. ఇటీవల జమ్మూకశ్మీర్‌లోని పలు ప్రాంతాల్లో జరిగిన పలు ఎన్‌కౌంటర్లలో ఉగ్రవాదులు సైనిక దుస్తుల్లో కనిపించినట్లు సమాచారం.
Read Also : Pakistan: భారత్ కు పాకిస్థాన్ గగనతల మూసివేత మరో నెల రోజులు పొడిగింపు