జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్ వద్ద ఇటీవల జరిగిన ఉగ్రదాడి మరో మలుపు తిరిగింది. ఈ దాడికి సంబంధించి అనుమానితులు శ్రీలంక చేరుకున్నారన్న సమాచారంతో కొలంబో విమానాశ్రయంలో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది.భారత నిఘా వర్గాల నుంచి వచ్చిన అత్యవసర సమాచారం మేరకు, శ్రీలంక అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. చెన్నై నుంచి వచ్చిన యూఎల్122 అనే శ్రీలంకన్ ఎయిర్‌లైన్స్ విమానంలో ఆరుగురు అనుమానితులు ప్రయాణిస్తున్నారన్న వార్త విన్న వెంటనే వారు పెద్దఎత్తున తనిఖీలు చేపట్టారు.విమానం బండారనాయకే అంతర్జాతీయ విమానాశ్రయానికి, స్థానిక సమయం ప్రకారం మధ్యాహ్నం 11:59కి ల్యాండ్ అయ్యింది. ఈ సమయంలో పోలీసులు, వైమానిక దళం, మరియు ఇతర భద్రతా విభాగాలు కలిసి విమానాన్ని పూర్తిగా తనిఖీ చేశాయి.
ప్రయాణికుల లగేజీతో పాటు విమానంలోని ప్రతి చిన్న మూలను జాగ్రత్తగా పరిశీలించారు.శ్రీలంకన్ ఎయిర్‌లైన్స్ ప్రతినిధి ఒకరు మీడియాతో మాట్లాడుతూ, చెన్నై నియంత్రణ కేంద్రం నుంచి హెచ్చరిక వచ్చిన వెంటనే స్పందించామని తెలిపారు.ప్రయాణికుల వివరాలు, వారి లగేజీ, మరియు విమానం మొత్తం ఎంతో పటిష్టంగా తనిఖీ చేశామని చెప్పారు. కొన్ని గంటల పాటు జరిపిన తనిఖీలో ఎలాంటి అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువులు కనిపించలేదని స్పష్టం చేశారు.ఈ తనిఖీల అనంతరం, విమానాన్ని మళ్లీ రెగ్యులర్ కార్యకలాపాలకు అనుమతి ఇచ్చినట్లు వెల్లడించారు.
ప్రయాణికులను సురక్షితంగా బయలుదేరిన గమ్యస్థానాలకు పంపించారు.ఇక పహల్గామ్‌లో జరిగిన దాడిపై వస్తే, ఏప్రిల్ 22న బైసరన్ లోయ వద్ద పర్యాటకులపై ఉగ్రదాడి జరిగింది. ఈ దాడిలో 26 మంది పౌరులు దుర్మరణం చెందారు. ఈ ఘోర ఘటనపై విచారణ కొనసాగుతోంది. భద్రతా బలగాలు ఇప్పటివరకు కొందరిని అరెస్ట్ చేశాయి. ఇంకా కొన్ని లైడ్లు బయటకు రావాల్సి ఉంది.ఉగ్రదాడికి పాల్పడిన వారు దేశం విడిచి పారిపోయే అవకాశం ఉందన్నదే భారత అధికారుల ప్రధాన ఆందోళన. అందుకే సమీప దేశాలకు ముందుగానే సమాచారం ఇచ్చారు. శ్రీలంకలో చేపట్టిన ఈ తనిఖీలు కూడా ఆ ప్రయాసలో భాగమే.ఇలాంటి వేళ భద్రతాపరమైన సమాచారాన్ని సమయానికి పంచుకోవడం ఎంత కీలకమో ఈ ఘటన తేటతెల్లం చేస్తోంది. దేశ భద్రత కోసం అన్ని దేశాల మధ్య సమన్వయం మరింత బలపడాలి.
Read Also : Pak Minister: భారత్ లో పాక్ సమాచార మంత్రి ఎక్స్ ఖాతా నిలిపివేత