Pahalgam Terror Attack : పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఎట్టకేలకు పహల్గాం ఉగ్ర దాడి పై స్పందించారు. పహల్గాం దాడి పై తటస్థ దర్యాప్తునకు తాము సిద్ధమేనని ప్రకటించారు. ఎలాంటి ముప్పునైనా ఎదుర్కొంటామంటూ వ్యాఖ్యానించారు. పహల్గాంలో ఇటీవల జరిగిన విషాదకర ఘటనతో మరోసారి మన దేశం నిందలు ఎదుర్కొంటోంది. ఆ ఘటనపై తటస్థ, పారదర్శక, విశ్వసనీయ దర్యాప్తులో పాల్గొనేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. శాంతికే మా ప్రాధాన్యం అని షరీఫ్ తెలిపారు. ఉగ్రవాదాన్ని తాము కూడా ఖండిస్తామంటూ శాంతి వచనాలు వల్లె వేశారు.
ఎలాంటి ముప్పును ఎదుర్కోడానికైనా సంసిద్ధం
ఇక, ఇటీవల భారత ప్రధాని మోడీ ఉగ్రవాదాన్ని సమూలంగా నాశనం చేస్తామంటూ చేసిన వ్యాఖ్యలపై షరీఫ్ పరోక్షంగా స్పందించారు. మా దేశ భద్రత, సార్వభౌమత్వంపై ఎన్నటికీ రాజీపడబోం. ఎలాంటి ముప్పును ఎదుర్కోడానికైనా సంసిద్ధంగా ఉన్నాం అని తెలిపారు. అనంతరం సింధూ జలాల ఒప్పందం నిలిపివేత అంశాన్ని ప్రస్తావిస్తూ.. భారత్ ఇలా ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం తగదు. ఈ చర్యతో యుద్ధ వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని మేం కోరుకుంటున్నాం అంటూ భారత్‌ను నిందించే ప్రయత్నం చేశారు.
అటు పాక్ కూడా ప్రతిచర్యలు
ఏప్రిల్ 22న పహల్గాంలో జరిగిన దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. దీని వెనక పాక్ కేంద్రంగా పనిచేస్తోన్న లష్కరే తోయిబా అనుబంధ సంస్థ ‘ది రెసిస్టెన్స్ ఫోర్స్’ హస్తం ఉన్నట్లు భద్రతా బలగాలు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోన్న పాకిస్థాన్‌కు భారత్ గట్టి షాకిచ్చింది. సింధూ జలాల ఒప్పందం నిలిపివేతతో పాటు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. పాక్ పౌరులు తక్షణమే దేశం విడిచి వెళ్లిపోవాలని ఆదేశించింది. అటు పాక్ కూడా ప్రతిచర్యలు చేపట్టింది. భారత విమానాలకు తమ గగనతలాన్ని మూసివేస్తున్నట్లు ప్రకటించింది.
Read Also: పాక్ గగనతలం మూసివేత.. విమానయాన సంస్థలకు డీజీసీఏ అడ్వైజరీ జారీ