బంగ్లాదేశ్ యువ రాజకీయ నేత షరీఫ్ ఉస్మాన్ బిన్(Osman Hadi) హాదీ మరణంతో ఆ దేశం తీవ్ర ఉద్రిక్తతల మధ్య అట్టుడుకుతోంది. భారత వ్యతిరేక భావజాలంతో పాటు, షేక్ హసీనా ప్రభుత్వ పతనంలో కీలక పాత్ర పోషించిన నేతగా గుర్తింపు పొందిన హాదీ తుపాకీ కాల్పుల్లో తీవ్రంగా గాయపడి, చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ ప్రధాన సలహాదారు ముహమ్మద్ యూనస్ హాదీకి ఘనంగా నివాళులు అర్పించారు.
Read also: Water dispute: సింధూ జలాల ఒప్పందంపై పాక్ ఆవేదన.. భారత్‌పై ఇషాక్ దార్ విమర్శలు
హాదీకి జాతీయ సంతాప దినం.. యూనస్ నివాళులు, దేశవ్యాప్తంగా ఆందోళనలు
హాదీ మరణం దేశానికి తీరని లోటని యూనస్ పేర్కొన్నారు.
“హాదీ నీవు ఎప్పటికీ మా హృదయాల్లోనే ఉంటావు. ఈ దేశం నిన్ను ఎన్నటికీ మర్చిపోదు. బంగ్లాదేశ్ ఉన్నంత కాలం నీ పోరాటం, నీ ఆలోచనలు సజీవంగానే ఉంటాయి” అంటూ భావోద్వేగంగా వ్యాఖ్యానించారు. హాదీ అనుసరించిన లక్ష్యాలు, ఆశయాలను తమ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుందని యూనస్ హామీ ఇచ్చారు. ఫాసిజం, ఆధిపత్య ధోరణులకు వ్యతిరేకంగా హాదీ సాగించిన పోరాటం భవిష్యత్ తరాలకు ప్రేరణగా నిలుస్తుందని కొనియాడారు.
హాదీ గౌరవార్థం డిసెంబర్ 20 (శనివారం)ను బంగ్లాదేశ్ ప్రభుత్వం జాతీయ సంతాప దినంగా ప్రకటించింది. ఈ సందర్భంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలపై జాతీయ జెండాను సగం వరకు ఎగురవేయాలని ఆదేశాలు జారీ చేసింది.
కాల్పుల ఘటన, ఆపై అల్లర్లు
‘ఇంక్విలాబ్ మంచ్’ సంస్థ కన్వీనర్‌గా ఉన్న 32 ఏళ్ల ఉస్మాన్ హాదీపై(Osman Hadi) డిసెంబర్ 12న ఢాకాలో గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. తలలోకి బుల్లెట్ దూసుకెళ్లడంతో ఆయన పరిస్థితి అత్యంత విషమంగా మారింది. మెరుగైన చికిత్స కోసం సింగపూర్‌కు తరలించినప్పటికీ, ఆయన ప్రాణాలను వైద్యులు కాపాడలేకపోయారు.
హాదీ మరణవార్త వెలువడగానే దేశవ్యాప్తంగా హింసాత్మక నిరసనలు చెలరేగాయి. భారత్‌కు అనుకూలంగా వ్యవహరిస్తున్నాయంటూ ఆరోపణలు చేస్తూ నిరసనకారులు ‘ప్రోథోమ్ అలో’, ‘డైలీ స్టార్’ వంటి ప్రముఖ మీడియా సంస్థల కార్యాలయాలపై దాడులు చేసి నిప్పు పెట్టారు. అలాగే చిట్టగాంగ్‌లోని భారత అసిస్టెంట్ హైకమిషన్ నివాసంపై రాళ్ల దాడి జరిగింది.
హాదీ హత్య వెనుక కుట్ర ఉందని, నిందితులు భారత్‌కు పారిపోయారని నిరసనకారులు ఆరోపిస్తున్నారు. 2026 ఫిబ్రవరిలో జరగనున్న సాధారణ ఎన్నికల్లో ఢాకా–8 నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడానికి హాదీ సిద్ధమవుతున్న సమయంలో ఈ హత్య జరగడం రాజకీయంగా మరింత ఉద్రిక్తతను పెంచింది.
హాదీ మరణం యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వానికి పెద్ద సవాలుగా మారడమే కాకుండా, భారత్–బంగ్లాదేశ్ ద్వైపాక్షిక సంబంధాల్లోనూ తీవ్ర ఉద్రిక్తతలకు దారితీస్తుందన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: