జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాద కార్యకలాపాలను మళ్లీ ప్రేరేపించేందుకు పాకిస్థాన్ పెద్ద కుట్ర (Pakistan’s big conspiracy) పన్నుతోందని భారత ఇంటెలిజెన్స్ బ్యూరో నివేదిక తెలిపింది. పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)లో కొత్త ఉగ్ర శిబిరాలను నిర్మించడం ప్రారంభించిందని నివేదికలో స్పష్టం చేసింది.దాదాపు 15 కొత్త ఉగ్ర శిబిరాలు, చొరబాట్ల కోసం ల్యాంచ్ ప్యాడ్‌లను పీవోకేలో నిర్మిస్తున్నట్టు వెల్లడించింది. ఈ శిబిరాలు భారత బలగాలు సులభంగా దాడి చేయలేని ప్రదేశాల్లో ఏర్పాటు అవుతున్నాయి.గత ఏప్రిల్‌లో పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ (Operation Sindoor) పాక్ ఉగ్ర నెట్‌వర్క్‌ను తీవ్రంగా దెబ్బతీసింది. ఈ ఆపరేషన్‌లో జైషే మహ్మద్, లష్కరే తోయిబా కీలక స్థావరాలు ధ్వంసమయ్యాయి.
కొత్త వ్యూహాలతో ముందుకు పాక్
పాక్ ఆర్మీ, ఐఎస్ఐ ఇప్పుడు కొత్త పద్ధతులు అవలంబిస్తున్నాయి. శిబిరాలను సైనిక స్థావరాల దగ్గర ఏర్పాటు చేస్తున్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో భారత నిఘా ఏజెన్సీల కంట పడకుండా జాగ్రత్త పడుతున్నారు.ప్రతి శిబిరంలో గరిష్టంగా 20 నుంచి 25 మంది ఉగ్రవాదులను మాత్రమే ఉంచుతున్నారు. దీంతో ఒకే దాడిలో ఎక్కువ నష్టం జరగకుండా చూడటం లక్ష్యం.లష్కరే తోయిబా, జైషే మహ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్ వంటి సంస్థలు కలిసి ఈ కుట్రలో పాల్గొంటున్నాయి. వీటికి పాక్ అధికారులు పూర్తి సహకారం అందిస్తున్నట్టు నివేదిక పేర్కొంది.
స్థానిక నియామకాల్లో సమస్యలు
పాక్‌లో కొత్తగా ఉగ్రవాదులను భారీగా రిక్రూట్ చేస్తున్నప్పటికీ, జమ్మూకశ్మీర్‌లో స్థానికులను నియమించడం కష్టంగా మారింది. భారత ఏజెన్సీల అప్రమత్తత కారణంగా ఈ నియామకాలు పూర్తిగా ఆగిపోయాయి.ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటికే హెచ్చరించారు. “పాక్ ఎలాంటి దుస్సాహసం చేసినా మూల్యం చెల్లించుకోవాలి” అని ఆయన అన్నారు. ప్రస్తుతం భారత భద్రతా బలగాలు పీవోకేలో పెరుగుతున్న ఉగ్ర కదలికలపై పూర్తిగా అప్రమత్తంగా ఉన్నాయి.
Read Also : Anil Ambani : అనిల్ అంబానీపై లుకౌట్ నోటీసులు