ఆపరేషన్ సిందూర్ విజయవంతం: పాకిస్తాన్‌పై మెరుపుదాడులతో ప్రతీకారం తీర్చుకున్న భారత్
ఏప్రిల్ 22న జమ్ము కశ్మీర్‌లోని పహల్గాం ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడి దేశవ్యాప్తంగా ఆగ్రహాన్ని రేకెత్తించింది. సైనిక దుస్తుల్లో వచ్చిన ఉగ్రవాదులు నిర్భందంగా 26 మంది అమాయక పర్యాటకులను కాల్చి చంపారు. ఈ ఘటన తర్వాత భారత్ తీవ్రంగా స్పందించడంతో పాటు, దాడికి పాల్పడిన వారిని, వారికి మద్దతు ఇచ్చిన వారిని కచ్చితంగా భారత్ శిక్షిస్తుందంటూ చాలా రోజులుగా కేంద్ర ప్రభుత్వం చెబుతూనే వస్తోంది. ఆ ప్రకటనను కార్యరూపంలో చూపిస్తూ మంగళవారం రోజు అర్ధరాత్రి భారత్ “ఆపరేషన్ సిందూర్” పేరుతో భారీ సైనిక దాడులు చేపట్టింది.
ఈ ఆపరేషన్‌లో సైన్యం, వాయుసేన, నౌకాదళం సమిష్టిగా పాల్గొని పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రాంతాల్లోని 9 కీలక ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుంది. ప్రత్యేకంగా లష్కరే తోయిబా, జైషే మహ్మద్, బిజ్బుల్ ముజాహిద్దీన్ వంటి ఉగ్రవాద సంస్థల శిబిరాలపై దాడులు నిర్వహించాయి. భారత ఆర్మీ ఈ దాడులను అర్ధరాత్రి 1.44 గంటలకు ప్రారంభించింది. సమాచారం ప్రకారం, ఈ మెరుపుదాడుల్లో దాదాపు 80 మంది ఉగ్రవాదులు హతమైనట్లు తెలుస్తోంది.
ముందు హెచ్చరికగా విడదల చేసిన వీడియో.. వైరల్ అవుతున్న సందేశం
దాడులు చేయడానికి సరిగ్గా 16 నిమిషాల ముందు.. సర్జికల్ స్ట్రైక్స్ జరుపుతున్న వీడియోను షేర్ చేశారు. అందులో ఐ ఫౌండ్ యూ త్రు ది డస్ట్ అండ్ స్టార్మ్ అంటూ వాయిస్ వినిపిస్తుండగా.. భారత ఆర్మీ మెరుపు దాడులు చేస్తున్న వీడియో ప్లే అవుతోంది. అలాగే ఈ వీడియోని షేర్ చేస్తూ.. రెడీ టు స్ట్రైక్, ట్రైయిన్డ్ టు విన్ అని రాసుకొచ్చారు. దాడికి ముందే ఇండియన్ ఆర్మీ ఈ వీడియో షేర్ చేయగా.. ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఈక్రమంలోనే భారత ఆర్మీ ముందుగానే దాడి చేయబోతున్నట్లు చెప్పి.. ఆపై చేసి చూపించిందంటూ నెటిజెన్లు కామెంట్లు చేస్తున్నారు.
ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ప్రజలు దీన్ని చూసి భారత ఆర్మీ ధైర్యాన్ని, సాంకేతిక సమర్థతను ప్రశంసిస్తున్నారు. “ఇది కేవలం ప్రతీకారం కాదు, ఒక హెచ్చరిక. ఇకపై భారత్‌ను వేధించిన వారికి తగిన గుణపాఠం తప్పదు” అనే వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
Read also: Operation Sindoor On Pakistan: ఉగ్రవాదంపై భారత్ హక్కుగా పోరాటం: విక్రమ్ మిస్రీ