వాషింగ్టన్: తమ దేశం నుంచి వందల బిలియన్ల డాలర్లు తీసుకొన్నా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీకి కృతజ్ఞత లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి విరుచుకుపడ్డారు. ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. చాక్లెట్ లాక్కొన్నంత తేలిగ్గా అమెరికా నుంచి సొమ్మును జెలెన్‌స్కీ తీసుకొన్నట్లు అభివర్ణించారు. ‘‘అతను (ఉక్రెయిన్ అధ్యక్షుడు) పసిబిడ్డ నుంచి చాక్లెట్ లాక్కొన్నంత తేలిగ్గా బైడెన్ సర్కారు నుంచి సొమ్ములు తీసుకొన్నారు. ఇక రష్యా విషయంలో అత్యంత కఠినంగా ఉన్న అధ్యక్షుడిని నేను. దాని పైప్‌లైన్ ఆపి ఆంక్షలు విధించాను. జావెలిన్ క్షిపణులు అందజేశాను. కానీ, పుతిన్‌తో కూడా మంచి సంబంధాలున్నాయి. రష్యా విషయంలో నన్ను మించి కఠినంగా ఎవరూ లేరు’’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు.
కీవ్ సేనలు కుప్పకూలుతాయి
మరోవైపు ఉక్రెయిన్ వీలైనంత తొందరగా యుద్ధం ముగించాలన్న ఒత్తిళ్లు డోజ్ సారథి మస్క్ వైపు నుంచి కూడా పెరిగాయి. తాజాగా తాను స్టార్ లింక్ ఇంటర్నెట్ సేవలను నిలిపేస్తే కీవ్ సేనలు కుప్పకూలుతాయని ఆయన హెచ్చరించారు. అదే సమయంలో ఉక్రెయిన్ ఓటమి అనివార్యమని వ్యాఖ్యానించారు. వాస్తవికతతో ఆలోచించేవారు, అర్థం చేసుకునేవారు ఎవరైనా ఈ యుద్ధాన్ని ఆపాలని కోరుకుంటారని వ్యాఖ్యానించారు. ఆ తర్వాత ట్రంప్ తాజా కామెంట్లు రావడం గమనార్హం.
రష్యా గ్యాస్ పైప్‌లైన్‌పై ఆంక్షలు
ఇటీవల ఖనిజాల ఒప్పందం కోసం అమెరికాలోని శ్వేతసౌధానికి వచ్చిన జెలెన్‌స్కీ అక్కడ వాగ్వాదం జరగడంతో సంతకాలు చేయకుండానే వెళ్లిపోయారు. ఆ తర్వాత అమెరికా నుంచి కీవ్‌కు సైనిక, ఇంటెలిజెన్స్ సాయాలు నిలిచిపోయాయి. మరోవైపు ఇదే అదునుగా రష్యా దాడులను తీవ్రతరం చేసింది. ఇక, ట్రంప్ తొలిసారి అధికారంలో ఉన్న సమయంలో రష్యా గ్యాస్ పైప్‌లైన్‌పై ఆంక్షలు విధించారు. వాస్తవానికి దీనినుంచి ఐరోపాలోని జర్మనీకి గ్యాస్ సరఫరా అవుతుంది.