News Telugu: పోలాండ్‌లో తీవ్ర విషాదం నెలకొంది. సెంట్రల్ పోలాండ్ (Poland) లోని రాడోమ్ నగరంలో జరుగుతున్న ఎయిర్‌షో రిహార్సల్స్‌లో భాగంగా పోలిష్ వైమానిక దళానికి చెందిన ఎఫ్-16 ఫైటర్ జెట్ కుప్పకూలింది. ఈ ఘటనలో విమానాన్ని నడుపుతున్న పైలట్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని దేశ ఉప ప్రధాన మంత్రి వ్లాడిస్లావ్ కొసినియాక్-కామిస్జ్ అధికారికంగా ధృవీకరించారు.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఘటన దృశ్యాలు
ప్రమాదానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గాల్లో బ్యారెల్-రోల్ విన్యాసం చేయడానికి ప్రయత్నించిన యుద్ధవిమానం ఒక్కసారిగా అదుపుతప్పి నేలవైపు దూసుకెళ్లింది. క్షణాల్లోనే రన్‌వేపై కూలిపోయి భారీ అగ్నిగోళంగా మారింది. మంటల్లో చిక్కుకున్న విమానం కొన్ని మీటర్ల దూరం దూసుకెళ్లిన దృశ్యాలు ఆ వీడియోలో స్పష్టంగా కనిపిస్తున్నాయి.
ఉప ప్రధాని సంతాపం
ఈ ఘటనపై పోలాండ్ ఉప ప్రధాని వ్లాడిస్లావ్ (Deputy Prime Minister Vladislav)ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందించారు. పైలట్ మరణంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ –
“ఎఫ్-16 విమాన ప్రమాదంలో పోలిష్ ఆర్మీ పైలట్ వీర మరణం చెందారు. ఆయన ధైర్యసాహసాలు, అంకితభావం మాతృభూమికి చేసిన గొప్ప సేవ. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. కుటుంబ సభ్యులకు, ఆప్తులకు నా ప్రగాఢ సానుభూతి” అని పేర్కొన్నారు. ఈ ప్రమాదం వెనుక కారణాలను వెలికితీసే ప్రయత్నంలో అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. పైలట్ ప్రాణాలు కోల్పోవడం పట్ల పోలాండ్ రక్షణ దళం తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది.
Read hindi news: hindi.vaartha.com
Read also: