జపాన్ (Japan) రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది.ఆ దేశ ప్రధాన మంత్రి షిగేరు ఇషిబా పదవి నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నారు. పార్టీలో అంతర్గత కుమ్ములాటలు తారాస్థాయికి చేరుకోవడంతో ఆయన రాజీనామా నిర్ణయం తీసుకొన్నారు. ఈ మేరకు జపాన్ అధికారిక టెలివిజన్ ఎన్‌హెచ్‌కే వెల్లడించింది. తన కారణంగా పార్టీ రెండుగా చీలిపోకూడదని, రాజీనామాపై వస్తున్న ఒత్తిడిని ఇక తట్టుకోవడం తన వల్ల కాదని ఇషిబా పేర్కొన్నారు. ఈ ఏడాది జులైలో జరిగిన జపాన్ పార్లమెంట్ ఎన్నికల్లో లిబరల్ డెమొక్రాటిక్ పార్టీ నేతృత్వంలోని అధికార కూటమి దారుణ పరాజయం చవిచూసింది.
ఆ పార్టీ ఎగువ సభలో మెజార్టీని కోల్పోయింది.ప్రజా వ్యతిరేకతతో పాటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారీఫ్‌లు అధికార కూటమిని ఎన్నికల్లో దెబ్బతీశాయి. ఆ ఎన్నికల్లో ఓటమికి బాధ్యతవహిస్తూ ప్రధాని పదవికి ఇషిబా (Shigeru Ishiba) రాజీనామా చేయాలని పార్టీ అనధికారిక సమావేశంలో పలువురు డిమాండ్ చేశారు. అయినాసరే ఇషిబా మాత్రం ససేమిరా అన్నారు.గతేడాది అక్టోబరులోనే జపాన్ ప్రధాన మంత్రిగా ఇషిబా బాధ్యతలు చేపట్టారు. కానీ, ఆయన అభ్యర్థిత్వాన్ని పార్టీలోని పలువురు తీవ్రంగా వ్యతిరేకించారు.
పార్టీలో చీలిక వచ్చే ప్రమాదం
ఎన్నికల్లో కూటమి ఓడిపోవడంతో షిగేరు వ్యతిరేకులు స్వరం పెంచారు. లిబరల్ డెమొక్రటిక్ పార్టీ ముందస్తు నాయకత్వ ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించడంతో కేవలం ఒక రోజు ముందు ఆయన రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. ఈ చర్య ఆమోదం పొందితే ఆయనపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అందుకే పార్టీలో చీలిక వచ్చే ప్రమాదం ఉందని భావించి, గౌరవంగా తప్పుకోవాలని నిర్ణయించారు.వ్యవసాయ మంత్రి షింజిరో కొయిజుమి, తన రాజకీయ గురువు మాజీ ప్రధాన మంత్రి యోషిహిదే సుగాతో శనివారం జరిగిన సమావేశం తర్వాత ఆయన రాజీనామా నిర్ణయం తీసుకున్నారు, సోమవారం ఓటింగ్‌కు ముందు ఇషిబా రాజీనామా చేయాలని ఆయన సూచించారు. అయితే, గతవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జపాన్‌లో పర్యటించి, షిగేరుతో భేటీ అయిన సంగతి తెలిసిందే.
ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక ఒప్పందాలు కుదిరిాయి. కానీ, ఇంతలోనే జపాన్ ప్రధాని రాజీనామా చేయడం గమనార్హం. ఇషిబా రాజీనామాతో భారత్, జపాన్ మధ్య కుదిరిన ఒప్పందాలపై ప్రభావం చూపుతుందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.ఇక, కేరీర్ ఆరంభంలో బ్యాంకింగ్ రంగంలో పనిచేసిన షిగేరు ఇషిబా.. చిన్న వయసులోనే రాజకీయాల్లోకి వచ్చారు. 29 ఏళ్లకు 1986లో తొలిసారిగా ఎంపీగా గెలిచి పార్లమెంట్‌లో అడుగుపెట్టారు. యువకుడైన ఆయన తరుచూ ప్రభుత్వ విధానాలను బహిరంగంగా వ్యతిరేకిస్తూ వార్తల్లో నిలిచేవారు. దీంతో కిషిద ప్రభుత్వంలో ఇషిబాను పక్కనబెట్టారు. కానీ, గత ఎల్‌డీపీ ప్రభుత్వంలో ఆయనకు మంత్రివర్గంలో చోటుదక్కి.. రక్షణశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. అంతేకాదు, పార్టీ అధ్యక్ష పదవికి ఐదుసార్లు పోటీపడ్డారు.
Read hindi news: hindi.vaartha.com
Read also: