జమ్మూకశ్మీర్‌లో పహల్గామ్ వద్ద ఇటీవల జరిగిన ఉగ్రదాడి అనంతరం భారత భద్రతా బలగాలు ఉగ్రవాదులపై కఠిన చర్యలకు శ్రీకారం చుట్టాయి. పర్యాటకులతో నిండి ఉన్న బైసరన్ మీడోస్ వద్ద జరిగిన దారుణ దాడి హిందువులను లక్ష్యంగా తీసుకుని, అమానుషంగా జరిపిన కాల్పుల్లో పలు ప్రాణాలు కోల్పోయిన ఘటన దేశాన్ని వణికించింది. ఈ దాడికి ప్రతికారంగా భద్రతా బలగాలు కశ్మీర్ లోయ మొత్తాన్ని కదిలించాయి.
ఉగ్రవాది ఇంటిని పేల్చేసిన భద్రతా బలగాలు
ఈ చర్యల భాగంగా, జమ్మూకశ్మీర్‌లోని బందిపొరా జిల్లా లష్కరే తోయిబా చెందిన ఉగ్రవాది జమీల్ అహ్మద్ ఇంటిని భద్రతా దళాలు పేల్చివేశాయి. జమీల్ అహ్మద్ 2016 నుంచే లష్కరే తోయిబా సంస్థలో చురుకైన కార్యకర్తగా ఉన్నాడు. అతని ఇంటి ధ్వంసం, ఉగ్రవాదుల ఇల్లు పేల్చివేతలో ఇది తొమ్మిదో ఘటన కావడం గమనార్హం. ఈ ఘటనకు ఒక రోజు ముందు, పుల్వామా జిల్లా త్రాల్ ప్రాంతంలో జేషే మొహ్మద్ సంస్థకు చెందిన ఆమిర్ నజీర్ ఇంటిని కూడా భద్రతా బలగాలు పేల్చివేయడం జరిగింది. పాక్ మద్దతుతో కొనసాగుతున్న ఈ సంస్థలు గతకొంత కాలంగా కశ్మీర్ లోయలో గందరగోళం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నాయి. అయితే ఇప్పుడు భద్రతా దళాలు మరింత దూకుడుగా చర్యలు తీసుకుంటున్నాయి.
అంతేకాక, రెండు రోజుల క్రితం కూడా భద్రతా బలగాలు షోపియాన్ జిల్లాకు చెందిన అద్నాన్ షఫీ, పాకిస్థాన్‌కు పారిపోయిన ఫారూఖ్ అహ్మద్‌ల ఇళ్లను పేల్చి వేసాయి. అద్నాన్ 2024లో లష్కరే తోయిబాలో చేరగా, ఫారూఖ్ ప్రస్తుతం పాకిస్థాన్‌లో ఉగ్ర శిబిరాల్లో రహస్య కార్యకలాపాల్లో పాల్గొంటున్నట్లు సమాచారం. ఇక పహల్గామ్ దాడికి ప్రధాన సూత్రధారి గా గుర్తించబడిన లష్కరే తోయిబా ఉగ్రవాది అదిల్ హుస్సేన్ తొకర్ నివాసాన్ని, బిజ్‌బెహరా ప్రాంతంలో భద్రతా బలగాలు శుక్రవారం బాంబులతో పేల్చివేశాయి. అదిల్ తొకర్ 2018లో పాకిస్థాన్‌లోకి ప్రవేశించి అక్కడ తీవ్ర ఉగ్రశిక్షణ పొందిన తర్వాత గత ఏడాది జమ్మూకశ్మీర్‌లోకి చొరబడ్డాడు. పహల్గామ్ దాడిలో అతడు కీలకంగా పాలుపంచుకున్నట్టు విశ్వసనీయ సమాచారం. భద్రతా బలగాలు, జిల్లా యంత్రాంగం కలిసి మూడు రోజులుగా కశ్మీర్ లోయలో ఉగ్రవాద సంబంధితుల ఇళ్లను లక్ష్యంగా చేసుకుని వరుసగా పేల్చివేతలు నిర్వహిస్తున్నారు.
ఉగ్రవాదులపై రివార్డులు ప్రకటించిన పోలీసులు
అదిల్ తొకర్‌తో పాటు పాకిస్థాన్‌కు చెందిన అలీభాయ్ అలియాస్ తల్హా, ఆసిఫ్ ఫౌజీపై అనంతనాగ్ పోలీసులు రూ. 20 లక్షల రివార్డు ప్రకటించారు. భద్రతా బలగాల సమాచారం ప్రకారం పహల్గామ్ ఉగ్రదాడిలో ఐదారుగురు ఉగ్రవాదులు పాల్గొన్నారు. ఈ దాడిలో ప్రధానంగా హిందువులను లక్ష్యంగా అమానుషంగా కాల్చిచంపారు.
Read aalso: Iran : ఇరాన్లో భారీ పేలుడుకు 14 మంది మృతి