కశ్మీర్లోని పహల్గాంలో జరిగిన తీవ్రవాద దాడి తర్వాత భారత్-పాకిస్తాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఇప్పటికే సరిహద్దుల్లో నియంత్రణ రేఖ వద్ద భారత్ వైపు నుంచి ఎలాంటి కవ్వింపులు లేకపోయినా పాకిస్తాన్ బలగాలు కాల్పులు జరుపుతూనే ఉన్నాయి. దీనిపై భారత్ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తంచేస్తూనే ఉంది. మరోవైపు యుద్ధం వస్తే ఎలా ఎదుర్కోవాలన్న దానిపై ఇరు దేశాల సైనికాధికారులు సన్నాహాలు చేసుకుంటున్నారు. అదే సమయంలో భారత్, పాకిస్తాన్ మధ్య మరో యుద్దం మొదలైపోయింది. ఆన్ లైన్ లో ఇరుదేశాల్లో ప్రభుత్వ వెబ్ సైట్లు, వ్యవస్థల్ని లక్ష్యంగా చేసుకుని సైబర్ దాడులు కొనసాగుతున్నాయి. ఇరుదేశాల్లోని వెబ్ సైట్లను లక్ష్యంగా చేసుకుని ఆయా దేశాలతో పాటు విదేశాల నుంచి కూడా హ్యాకర్లు రెచ్చిపోతున్నట్లు తెలుస్తోంది. అయితే వీటి వివరాలను బయటపెట్టేందుకు ఇరుదేశాలూ నిరాకరిస్తున్నట్లు తెలుస్తోంది.
ప్రభుత్వ, ప్రైవేట్ రంగ డేటాబేస్‌లు టార్గెట్
భారతదేశం, పాకిస్తాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న వేళ హ్యాకర్లు తమ డిజిటల్ కోడ్‌లు, కమాండ్‌ను వ్యాపారం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. గత వారం పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు సైబర్‌స్పేస్‌లోకి వ్యాపించినట్లు తెలుస్తోంది. దీంతో ఇరువైపులా గ్రూపులు హ్యాకింగ్, సైబర్ దాడులకు పాల్పడుతున్నట్లు సమాచారం. భారతదేశ అనుకూల హ్యాక్‌టివిస్ట్ గ్రూప్ ‘ఇండియా సైబర్ ఫోర్స్’ అనేక పాకిస్తాన్ ప్రభుత్వ, ప్రైవేట్ రంగ డేటాబేస్‌లను టార్గెట్ చేసుకుంది. దీనికి ముందే పాకిస్తాన్‌కు చెందిన గ్రూప్ ‘టీమ్ ఇన్సేన్ పాక్’ ఇండియన్ ఆర్మీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ వెబ్‌సైట్‌ను హ్యాక్ చేసి రెచ్చగొట్టే మెసేజ్ లు పెట్టింది. గత వారంలో పాకిస్తాన్ నుండి ఇలా ఎదురైన సైబర్ దాడుల్ని తాము అడ్డుకున్నామని భారత అధికారులు చెబుతున్నారు. దీంతో అసలు యుద్దం మొదలుకాకముందే సైబర్ దాడులు తీవ్రంగా సాగుతున్నట్లు అర్ధమవుతోంది.
Read Also: Fans: క్రికెట్ చూసేందుకు వచ్చిన పాక్ అభిమానులు మిస్సింగ్