రష్యా, చైనాలు ఆక్రమించకుండా నిరోధించడానికి డెన్మార్క్ ఆధీనంలోని గ్రీన్‌లాండ్‌ను స్వాధీనం చేసుకోవాలనుకుంటున్నట్లు అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ చెబుతున్నారు. “మనం గ్రీన్‌లాండ్‌ను రక్షించాలి. అలా చేయకపోతే, చైనా లేదా రష్యా చేస్తాయి. గ్రీన్‌లాండ్(Greenland)లో వారు మన పొరుగువాళ్లుగా ఉండాలని నేను కోరుకోవడం లేదు, అది ఎప్పటికీ జరగదు” అని ట్రంప్ ఈ నెలలో అన్నారు. అయితే, ట్రంప్ గ్రీన్‌లాండ్ ఆశయాలను (వాటిని సాధించడానికి బలప్రయోగం, సుంకాల బెదిరింపులు) వ్లాదిమిర్ పుతిన్, షీ జిన్‌పింగ్‌లు స్వాగతించవచ్చని చాలామంది పరిశీలకులు భావిస్తున్నారు. “రష్యా, చైనాలు తమ అదృష్టాన్ని నమ్మలేకపోతుండొచ్చు” అని యూరోపియన్ పాలసీ సెంటర్‌లో విశ్లేషకురాలు మరియా మార్టిసియుట్ అన్నారు. “యూరోపియన్ దేశాలు, నాటో కూటమి తమ అత్యంత శక్తిమంతమైన మిత్రదేశం నుంచి బెదిరింపులు ఎదురవుతున్నట్లు కనిపించడం వారికి (చైనా, రష్యా) ప్రయోజనం కలిగించేదే. ఎందుకంటే ఇది యుక్రెయిన్‌లో రష్యా చర్యలకు, తైవాన్‌పై చైనా కోరికలకు దీనిద్వారా మద్దతు లభిస్తుంది” అని అన్నారు.
Read Also: US: కెనడా పై మండిపడ్డ ట్రంప్..ఎందుకంటే?
రష్యా స్పందన ఏమిటి?
గ్రీన్‌లాండ్‌ను స్వాధీనం చేసుకోవడానికి డోనల్డ్ ట్రంప్ ఇటీవల చూపిన ఆసక్తి అసాధారణంగా ఉంది. ఇది క్రైమియాను స్వాధీనం చేసుకోవడానికి వ్లాదిమిర్ పుతిన్ ప్రయత్నాన్ని గుర్తుచేస్తోంది. గ్రీన్‌లాండ్‌ను ఒకప్పుడు డెన్మార్క్‌కు అమెరికా ఇచ్చిన బహుమతిగా ట్రంప్ అభివర్ణిస్తున్నారు. ఇది సోవియట్ కాలం నాటి క్రైమియాను యుక్రెయిన్‌కు ‘బహుమతి’గా ఇచ్చిన కథను గుర్తుచేస్తుంది. అమెరికా ‘ఏదో ఒక విధంగా దాన్ని తిరిగి తీసుకుంటుంది’ అనే ఆయన పట్టుదల యుక్రెయిన్ విషయంలో పుతిన్ వాడే భాషను ప్రతిబింబిస్తుంది. ఈ అంశంపై మాస్కో ఇప్పటివరకు సంయమనంతో స్పందించింది. గ్రీన్‌లాండ్‌ను కొనుగోలు చేయడానికి ట్రంప్ వద్ద తగినంత డబ్బు ఉందని పుతిన్ చమత్కరించారు.
ట్రంప్ “విధ్వంసక ధోరణుల” పట్ల రష్యా ఆందోళన
ట్రంప్ అనూహ్య పోకడ మాస్కోకు సంతోషం కలిగించేదానికంటే ఇబ్బందిపెట్టేదిగా ఉంటుందని కార్నెగీ రష్యా యురేషియా సెంటర్‌లో విశ్లేషకుడైన అలెగ్జాండర్ బౌనోవ్ అంటున్నారు. అమెరికా అధ్యక్షుడి “విధ్వంసక ధోరణుల” పట్ల రష్యా ఆందోళన చెందవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. తన రష్యన్ ప్రతిరూపం మాదిరే, ట్రంప్ కూడా వరల్డ్ ఆర్డర్ పై దాడి చేస్తున్నారు. రష్యా కూడా ఈ వ్యవస్థను ఇష్టపడదు కానీ, ఆ ఆర్డర్ పూర్తిగా కూలిపోతే, ఇక రష్యా వ్యతిరేకించడానికి ఏం మిగిలి ఉంటుంది, తన ఆశయాలను ఏ ప్రాతిపదికన సమర్థించుకుంటుంది?
గ్రీన్‌లాండ్‌పై చైనాలో స్పందనేంటి?
గ్రీన్‌లాండ్ విషయంపై దేశాల ప్రాదేశిక సమగ్రత, రాజకీయ స్వాతంత్ర్యాన్ని గౌరవించడం వంటి ఐక్యరాజ్యసమితి చార్టర్ సూత్రాలకు కట్టుబడి ఉండాలని చైనా అధికారులు అమెరికాను కోరారు. యూరప్ ఎదుర్కొంటున్న వ్యూహాత్మక సందిగ్ధతపై చైనా మీడియా సంస్థలు తమ అభిప్రాయాలను స్పష్టంగా వ్యక్తం చేశాయి. గ్రీన్‌లాండ్‌ను విలీనం చేసుకోవాలన్న అమెరికా బెదిరింపులు “నాటో సభ్య దేశానికి అమెరికా చేసిన ఘోరమైన ద్రోహం, కూటమి విచ్ఛిన్నానికి దాదాపుగా దగ్గరగా ఉంది” అని చైనా ప్రభుత్వ ప్రసార సంస్థ సీజీటీఎన్ అభివర్ణించింది.
గ్రీన్‌లాండ్ ఖనిజాల సంపద
ప్రపంచ ఆసక్తి ప్రధానంగా రేర్ ఎర్త్స్ నిక్షేపాలున్న క్వానెఫ్‌జెల్డ్, టాన్‌బ్రీగ్ అనే రెండు ప్రదేశాలపై ఉంది. లౌడ్‌స్పీకర్లు, స్మార్ట్‌ఫోన్‌ల నుంచి ఎలక్ట్రిక్ వాహనాలు, విమానాల వరకు చాలావాటిలో ఈ రేర్ ఎర్త్స్‌ను ఉపయోగిస్తారు. అరుదైన ఈ ఖనిజాల తవ్వకం, ప్రాసెసింగ్‌లో చైనా కంపెనీలు ఇప్పటికే ముందున్నాయి. గ్రీన్‌లాండ్ నిల్వలలో వాటా ఆ స్థానాన్ని మరింత బలోపేతం చేస్తుంది. అందుకే, చైనా కంపెనీలు గ్రీన్‌లాండ్ ఖనిజ నిల్వల కొనుగోలుకు ప్రయత్నించాయి. కానీ, విమానాశ్రయ అభివృద్ధి ప్రాజెక్టుల మాదిరిగానే, ఇవి కూడా రాజకీయ అడ్డంకులను ఎదుర్కొన్నాయి. క్వానెఫ్‌జెల్డ్ ప్రాజెక్టులో చైనాకు చెందిన షెంఘే రిసోర్సెస్ రెండో అతిపెద్ద వాటాను కొనుగోలు చేసింది. అయితే, గ్రీన్‌లాండ్ యురేనియం తవ్వకాలను నిషేధిస్తూ ఒక చట్టాన్ని అమలు చేసింది. ఆ తర్వాత ఆ కంపెనీ ఉత్పత్తిని నిలిపివేసింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: