బలూచిస్తాన్ లో రైలు హైజాక్ ఘటన, ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్ లో తాలిబన్ల దాడులతో పాకిస్థాన్ అట్టుడుకుతోంది. ట్రైన్ హైజాక్ ఘటన, ఆత్మాహుతి దాడులు జరిగిన కొన్ని గంటల్లో పాకిస్థాన్ లో మరో దాడి జరిగింది. రంజాన్ వేళ వాయవ్య పాకిస్థాన్‌లోని శుక్రవారం పేలుడు సంభవించింది. పాకిస్థాన్‌లోని గిరిజన ప్రాంతమైన వజీరిస్తాన్ లోని ఒక మసీదులో శుక్రవారం ప్రార్థనల సమయంలో జరిగిన పేలుడులో ఒక స్థానిక ఇస్లామిస్ట్ నాయకుడు, ఇద్దరు పిల్లలు గాయపడ్డారని పోలీసులు వెల్లడించారు.
రాజకీయ పార్టీ స్థానిక నాయకుడు అబ్దుల్లా నదీమ్‌ను లక్ష్యంగా
ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లోని జామియత్ ఉలేమా ఇస్లాం-ఫజల్ (JUI-F) రాజకీయ పార్టీ స్థానిక నాయకుడు అబ్దుల్లా నదీమ్‌ను లక్ష్యంగా చేసుకుని ఈ పేలుడు జరిగిందని అధికారులు భావిస్తున్నారు.ప్రస్తుతం గాయపడిన అబ్దుల్ నదీమ్ ను ఆస్పత్రిలో చేర్చారు. స్థానిక మీడియా ప్రకారం.. అతని పరిస్థితి విషమంగా ఉంది. మౌలానా అబ్దుల్ అజీజ్ మసీదులో జరిగిన పేలుడులో గాయపడిన వారిలో ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారని దక్షిణ వజీరిస్తాన్ జిల్లా పోలీసులు వెల్లడించారు. ఆఫ్ఘనిస్తాన్‌తో పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతంలో జరిగిన పేలుడుకు ఎవరు బాధ్యులో ఇంకా స్పష్టంగా తెలియలేదు.
ఐదుగురు మరణించగా.. 15 మంది గాయపడ్డారు
పాకిస్థాన్ లోని నౌషెరా జిల్లాలోని దారుల్ ఉలూమ్ హక్కానియా సెమినరీ లక్ష్యంగా చేసుకుని ఆత్మాహతి దాడి జరిగిన ఒక నెలలోనే ఈ దాడి జరగడం గమనార్హం. ఈ మదర్సా ఆఫ్ఘన్ తాలిబన్లకు చారిత్రక శిక్షణా స్థలంగా ప్రసిద్ధి చెందింది. ఈ ఆత్మాహుతి దాడిలో జేయూఐడఎస్ నాయకుడు మౌలానా హమీదుల్ హక్ హక్కానీ తో పాటు ఐదుగురు మరణించగా.. 15 మంది గాయపడ్డారు. మరోవైపు పెరుగుతున్న ఉగ్రవాదంపై తన అణిచివేతను తీవ్రతరం చేస్తామని పాకిస్థాన్ ప్రతిజ్ఞ చేసింది. ఆఫ్ఘనిస్తాన్ ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తోందని ఆరోపించింది. పాలక ఆఫ్ఘన్ తాలిబన్ సర్కారు ఈ వాదనను తిరస్కరించింది.