ఆసియా కప్ 2025 (Asia Cup 2025) క్రికెట్ టోర్నమెంట్‌లో శ్రీలంక, అఫ్గానిస్థాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ క్రీడాభిమానులకే కాకుండా, క్రీడాకారుల హృదయాలను కూడా కదిలించిన ఒక ఘోర సంఘటనతో ముగిసింది. ఈ మ్యాచ్‌లో శ్రీలంక యువ స్పిన్నర్ దునిత్ వెల్లలాగే తన (Dunith Wellalage) అద్భుతమైన ప్రదర్శనతో జట్టు విజయానికి కీలక పాత్ర పోషించాడు. ఆత్మవిశ్వాసంతో తన బంతులను విసరుతూ ప్రత్యర్థి జట్టును గట్టిగా ఎదుర్కొన్న ఆయన, మ్యాచ్ సమయంలో మాత్రమే కాకుండా భవిష్యత్తులోనే ఒక ప్రతిభావంతుడిగా కనిపించాడు.
కానీ ఈ విజయానంతరం సంబరాలు వేడుకగా మారక ముందే ఒక అనూహ్య విషాదం చోటుచేసుకుంది. మ్యాచ్ జరుగుతున్న సమయానికే దునిత్ వెల్లలాగే తండ్రి సురంగ వెల్లలాగే (Suranga Wellalage) గుండెపోటుతో మృతి చెందారు. ఈ సమాచారం అతని వద్దకు చేరినప్పటి నిమిషాల్లోనే అతను తీవ్ర షాక్‌కు లోనయ్యాడు. దీంతో అక్కడ ఒక్కసారిగా నిశ్శబ్ద వాతావరణం నెలకొంది. ఈ కష్టకాలంలో అతడికి కోచ్ జయసూర్య, ఇతర సహచరులు అండగా నిలిచారు.
ఆఫ్ఘనిస్థాన్ ఆటగాడు మహమ్మద్ నబీని తీవ్రంగా కలచివేసింది
ఈ విషాద వార్త ఆఫ్ఘనిస్థాన్ ఆటగాడు మహమ్మద్ నబీ (Muhammad Nabi) ని తీవ్రంగా కలచివేసింది. మ్యాచ్ తర్వాత ఓ రిపోర్టర్ వెల్లలాగే తండ్రి మరణించిన విషయాన్ని చెప్పగా, నబీ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. “అవునా? ఎలా జరిగింది?” అంటూ ఆశ్చర్యపోయి, తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ప్రత్యర్థి ఆటగాడి కుటుంబంలో జరిగిన విషాదానికి నబీ స్పందించిన తీరు అందరి హృదయాలను గెలుచుకుంది.
ఇదే సమయంలో, కామెంట్రీ బాధ్యతల్లో ఉన్న శ్రీలంక మాజీ క్రికెటర్ రస్సెల్ ఆర్నాల్డ్ (Russell Arnold) కూడా భావోద్వేగానికి లోనయ్యారు. సురంగా వెల్లలాగే తనకు స్కూల్ రోజుల నుంచే తెలుసని చెబుతూ, ఇద్దరూ ప్రత్యర్థి జట్లకు కెప్టెన్లుగా ఆడిన విషయాన్ని గుర్తుచేసుకున్నారు. “సురంగా ప్రిన్స్ ఆఫ్ వేల్స్ కాలేజీకి కెప్టెన్‌గా ఉంటే, నేను సెయింట్ పీటర్స్‌కు నాయకత్వం వహించాను. ఈ వార్త నన్ను చాలా బాధించింది” అని ఆర్నాల్డ్ పేర్కొన్నారు. క్రీడల్లో పోటీ సహజమే అయినా, ఇలాంటి విషాదకర సమయాల్లో ఆటగాళ్లంతా ఒకే కుటుంబంలా నిలవడం క్రీడాస్ఫూర్తికి నిదర్శనంగా నిలిచింది.
Read hindi news: hindi.vaartha.com
Read Also: