అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజా వ్యాఖ్యలతో అమెరికా-క్యూబా సంబంధాలు మరోసారి తీవ్ర ఉద్రిక్తతకు దారి తీస్తున్నాయి. వెనెజువెలా నుంచి చమురు లేదా ఆర్థిక సహాయం కొనసాగాలంటే అమెరికాతో వెంటనే ఒప్పందం చేసుకోవాలని ట్రంప్ క్యూబాకు బహిరంగ హెచ్చరికలు జారీ చేశారు. ఈ వ్యాఖ్యలు అంతర్జాతీయ రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చకు దారితీస్తున్నాయి. డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలకు క్యూబా ప్రభుత్వం కూడా ఘాటుగా స్పందించింది. నైతిక ప్రమాణాలను నిర్దేశించే అధికారం అమెరికాకు లేదని క్యూబా తేల్చి చెప్పింది. తమ దేశ సార్వభౌమత్వంపై ఎలాంటి రాజీ పడే ప్రశ్నే లేదని స్పష్టం చేసింది.
Read Also: Andhra Pradesh: పవన్ కళ్యాణ్‌కు అరుదైన గౌరవం
చివరి రక్తపు బొట్టు వరకు మాతృభూమిని రక్షించడానికి సిద్ధం: క్యూబా
ట్రంప్ వ్యాఖ్యలపై క్యూబా అధ్యక్షుడు మిగ్యుల్ డియాజ్-కానెల్(Miguel Diaz-Canel) సోషల్ మీడియా వేదికగా తీవ్రంగా స్పందించారు. Cuba ఒక స్వేచ్ఛాయుతమైన, స్వతంత్ర, సార్వభౌమ దేశమని పేర్కొన్నారు. తమ దేశం ఏం చేయాలో ఎవరో నిర్దేశించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. క్యూబా ఎప్పుడూ సంఘర్షణను కోరుకోదని.. అయితే అవసరమైతే చివరి రక్తపు బొట్టు వరకు మాతృభూమిని రక్షించడానికి సిద్ధంగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ఎలాంటి ఒత్తిడులు వచ్చినా ఎదుర్కొనే ధైర్యం క్యూబాకు ఉందని స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు క్యూబా ప్రజల్లో జాతీయ భావోద్వేగాలను మరింత బలపరిచినట్లయ్యాయి. ఇదే సమయంలో క్యూబా విదేశాంగ మంత్రి బ్రూనో రోడ్రిగ్జ్ కూడా ట్రంప్ హెచ్చరికలపై ఘాటుగా స్పందించారు. అమెరికా చర్యలు ప్రపంచ శాంతికి ముప్పుగా మారుతున్నాయని ఆరోపించారు. అమెరికా అధ్యక్షుడి ప్రవర్తన నేరపూరితమైనదిగా అభివర్ణించారు.
క్యూబాకు అమెరికా హెచ్చరికలు
ఇకపై అమెరికాతో ఒప్పందం చేసుకుంటే తప్ప క్యూబాకు చమురు అందుబాటులో ఉండదని హెచ్చరించారు. ఆదివారం సోషల్ మీడియాలో చేసిన పోస్టులో.. ఆలస్యం కాకముందే క్యూబా మేల్కొని ఒప్పందానికి సిద్ధం కావాలని ట్రంప్ సూచించారు. వెనెజువెలా నుంచి వచ్చే చమురు, ఆర్థిక సహాయం పైనే క్యూబా మనుగడ ఆధారపడి ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ఒప్పందం కుదరకపోతే అవన్నీ నిలిచిపోతాయని హెచ్చరించారు. ఈ సందర్భంగా ట్రంప్ అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో సామర్థ్యాన్ని ప్రశంసించారు. భవిష్యత్తులో రూబియో క్యూబా అధ్యక్షుడయ్యే అవకాశం ఉందంటూ వ్యాఖ్యానించడం కొత్త చర్చకు తెరతీసింది. రూబియో తల్లిదండ్రులు 1950లలో క్యూబాలోని బాటిస్టా నియంతృత్వ పాలన నుంచి తప్పించుకుని అమెరికాకు వలస వెళ్లిన విషయం ప్రస్తావనీయంగా మారింది.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: