గత కొన్ని రోజులుగా ఉద్రిక్తతల్లో కూరుకుపోయిన నేపాల్ (Nepal) ఇప్పుడు కొత్త దిశలో అడుగులు వేస్తోంది. ఆ దేశ చరిత్రలో తొలిసారిగా మాజీ జస్టిస్ సుశీల కర్కి తాత్కాలిక ప్రధానిగా బాధ్యతలు చేపట్టడం విశేషంగా మారింది.శుక్రవారం రాత్రి, అధ్యక్ష భవన్‌లో సుశీల కర్కి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి రామ్‌చంద్ర పౌడెల్ ఆమెకు పదవీ ప్రమాణం చేయించారు. రాత్రి 9 గంటలకు శీతల్ నివాసంలో జరిగిన ఈ వేడుకలో కేవలం కొద్దిమంది నేతలు మాత్రమే పాల్గొన్నారు. దీంతో నేపాల్ రాజకీయాల్లో ఒక కొత్త అధ్యాయం మొదలైంది.
పార్లమెంట్ రద్దు – తాత్కాలిక ప్రభుత్వానికి మార్గం సుగమం
సుశీల కర్కి ప్రమాణం చేసిన వెంటనే, అధ్యక్షుడు పార్లమెంట్‌ను రద్దు చేశారు. దీంతో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటుకు మార్గం సుగమమైంది. త్వరలోనే ఆమె చిన్న కేబినెట్‌ను ప్రకటించే అవకాశం ఉంది. వచ్చే సంవత్సరం మార్చిలో జరిగే సాధారణ ఎన్నికల వరకు సుశీల నేతృత్వంలోని ప్రభుత్వం కొనసాగనుంది.ఇటీవలి కాలంలో దేశవ్యాప్తంగా యువత అసంతృప్తి వ్యక్తం చేసింది. అవినీతి, బంధుప్రీతి పాలనతో పాటు సోషల్ మీడియా నిషేధం నిర్ణయం యువతలో ఆగ్రహం రేపింది. సెప్టెంబర్ 8న శాంతియుత నిరసనలకు దిగిన జెన్ జెడ్ నిరసనకారులపై పోలీసులు కాల్పులు జరపగా 19 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత నిరసనలు హింసాత్మకంగా మారాయి. పార్లమెంట్, సుప్రీంకోర్టు, అధ్యక్ష భవనం వరకు ముట్టడించి వాటికి నిప్పు పెట్టారు. ఈ అల్లర్లలో 51 మంది మరణించారు. ఈ పరిస్థితుల్లోనే సైన్యం ఒత్తిడి కారణంగా ప్రధాని కేపీ శర్మ ఓలీ రాజీనామా చేశారు.
కొత్త నాయకత్వం కోసం పోటీ
ఓలీ రాజీనామా (Oli’s resignation) చేసిన తర్వాత తాత్కాలిక ప్రధానిగా ముగ్గురి పేర్లు చర్చకు వచ్చాయి. మాజీ జస్టిస్ సుశీల కర్కి, ఇంజనీర్ కుల్మాన్ ఘిసింగ్, ఖాఠ్మాండ్ మేయర్ బలేంద్ర షా మధ్య పోటీ నెలకొంది. సైన్యం, అధ్యక్షుడు, ఆందోళనకారుల మధ్య చర్చల తర్వాత ఏకాభిప్రాయం కుదిరి సుశీలను ఎంపిక చేశారు.సుశీల కర్కి నాయకత్వం నేపాల్‌కు ఒక కొత్త దిశ చూపుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. గతంలో సుప్రీంకోర్టులో జస్టిస్‌గా పనిచేసిన ఆమె కఠిన నిర్ణయాలకు ప్రసిద్ధి. ఇప్పుడు దేశాన్ని అస్థిరత నుంచి బయటకు తీయడం ఆమె ముందు ఉన్న ప్రధాన సవాలు.అల్లర్లు, నిరసనలు, ప్రాణనష్టం తర్వాత నేపాల్ కొత్త దారిలో అడుగుపెట్టింది. తొలి మహిళా ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన సుశీల కర్కి ముందు కఠినమైన పరీక్షలు ఉన్నా, ప్రజలు ఆమెపై విశ్వాసం పెట్టుకున్నారు. రాబోయే ఎన్నికల వరకు ఆమె నాయకత్వం ఎలా ఉండబోతుందో ఆసక్తి పెరుగుతోంది.
Read Also :