భారతదేశం చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్‘ నేపథ్యంలో పాకిస్థాన్‌కు ఆయుధాలు సరఫరా చేసినట్లు, చైనా తీవ్రంగా ఖండించింది. ఈ ఆరోపణలు పూర్తిగా నిరాధారమైన వదంతులని చైనా రక్షణ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. వీటిని వ్యాప్తి చేసే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించింది.గత వారం ‘ఆపరేషన్ సిందూర్’ సమయంలో పాకిస్థాన్‌కు చైనా తమ వై-20 సైనిక రవాణా విమానం ద్వారా ఆయుధాలు సరఫరా చేసినట్లు కొన్ని వార్తా వేదికలు ప్రచారం చేశాయి. ఈ ఊహాగానాలపై చైనా అధికారికంగా స్పందించింది. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ) వైమానిక దళం విడుదల చేసిన ప్రకటనలో, అలాంటి మిషన్ ఏదీ జరగలేదని స్పష్టం చేసింది. ఇంటర్నెట్‌లో సైన్యానికి సంబంధించిన వదంతులను సృష్టించి, వ్యాప్తి చేసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొంది.
ఇతర దేశాల మధ్య శాంతి, స్థిరత్వం కోసం ఇరుపక్షాలు సమయం పాటించాలని చైనా సూచించింది. భారత్, పాకిస్థాన్ మధ్య పరిస్థితులు మరింత క్లిష్టతరం చేయకుండా ఉండాలని సూచించింది.అయితే, ఈ ఖండనల నేపథ్యంలో ఒక ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. స్టాక్‌హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (SIPRI) ఇటీవల విడుదల చేసిన నివేదిక ప్రకారం, 2020-2024 మధ్య కాలంలో పాకిస్థాన్ దిగుమతి చేసుకున్న ఆయుధాలలో 81 శాతం చైనా నుంచే వచ్చాయని వెల్లడించింది. ఇది చైనా, పాకిస్థాన్ మధ్య ఆయుధ సరఫరా సంబంధాలను స్పష్టంగా చూపిస్తుంది.’ఆపరేషన్ సిందూర్’ సమయంలో చైనా పాకిస్థాన్‌కు మద్దతు ప్రకటించడం, ఈ వదంతులకు మరింత బలం చేకూర్చింది. ఇది రెండు దేశాల మధ్య సైనిక సంబంధాలు, ఆయుధ సరఫరా వ్యవహారాలపై మరింత చర్చలకు దారితీస్తోంది.