చైనాలో ఒంటరిగా నివసించే వారి భద్రత కోసం రూపొందించిన ‘సిలేమే’ అనే మొబైల్ యాప్ ఇప్పుడు సరికొత్త మలుపు తిరిగింది. మాండరిన్ భాషలో ‘సిలేమే’ అంటే “Are You Dead?” (చనిపోయావా?) అని అర్థం. ఈ వింతైన పేరుతోనే చైనా యాపిల్ యాప్ స్టోర్‌లో పెయిడ్ యాప్స్ విభాగంలో ఇది అగ్రస్థానానికి చేరుకుంది. అయితే ప్రపంచవ్యాప్తంగా వస్తున్న క్రేజ్‌ను దృష్టిలో ఉంచుకుని.. ఈ ‘క్యాచీ’ పేరును మార్చాలని డెవలపర్లు నిర్ణయించారు. ఈ యాప్ పనితీరు చాలా విభిన్నంగా ఉంటుంది. ఒంటరిగా ఉండేవారు ఎప్పుడైనా ప్రమాదానికి గురైనా లేదా అపస్మారక స్థితిలోకి వెళ్లినా ఇతరులకు సమాచారం అందించేలా దీనిని డిజైన్ చేశారు. వినియోగదారులు ప్రతి 48 గంటలకు ఒకసారి యాప్‌లోకి వెళ్లి తాము సురక్షితంగా ఉన్నట్లు ‘చెక్-ఇన్’ చేయాలి.
Read Also: Big Warning : ఇరాన్ నాయకత్వానికి ట్రంప్ బిగ్ వార్నింగ్
అత్యవసర కాంటాక్ట్ నంబర్లకు అలర్ట్ మెసేజ్
ఒకవేళ నిర్ణీత సమయంలో యూజర్ స్పందించకపోతే.. యాప్ ఆటోమేటిక్‌గా ముందే సేవ్ చేసుకున్న అత్యవసర కాంటాక్ట్ నంబర్లకు అలర్ట్ మెసేజ్ లేదా ఈమెయిల్ పంపిస్తుంది. తద్వారా వారు వెంటనే స్పందించి బాధితుడిని కాపాడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా చైనా(China)లో మారుతున్న జీవనశైలి కారణంగా ఒంటరిగా నివసించే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. 2024 గణాంకాల ప్రకారం.. చైనాలోని ప్రతి ఐదు ఇళ్లలో ఒకటి ఒంటరిగా నివసించే పౌరులదే. పదేళ్ల క్రితం 15 శాతంగా ఉన్న ఈ సంఖ్య ఇప్పుడు 20 శాతానికి చేరింది. ఈ నేపథ్యంలోనే ‘సిలేమే’ యాప్ పెద్ద హిట్ అయ్యింది.
ఇకపై ‘డెముము’గా మార్చాలని నిర్ణయం
అయితే అంతర్జాతీయ మీడియా సంస్థలు ఈ యాప్ గురించి కథనాలు రాయడంతో ఓవర్సీస్ మార్కెట్‌లో దీనికి డిమాండ్ అమాంతంగా పెరిగిపోయింది. అయితే గ్లోబల్ బ్రాండింగ్‌లో ‘చనిపోయావా?’ అన్న పేరు కొంత నెగటివ్‌గా ఉండే అవకాశం ఉందని భావించిన సంస్థ.. చైనా వెర్షన్‌ను కూడా ఇకపై ‘డెముము’గా మార్చాలని నిర్ణయించింది. మంగళవారం సాయంత్రం విడుదల చేసిన ఒక ప్రకటనలో కంపెనీ ఈ విషయాన్ని ధృవీకరించింది. పేరు మార్పుపై చైనీస్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘వీబో’లో మిశ్రమ స్పందనలు వస్తున్నాయి.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: