పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతూనే ఉన్నాయి. ఇరుదేశాలూ ఇప్పటికే పరస్పరం ఆంక్షలు కూడా విధించుకున్నాయి. ఇదే క్రమంలో పాకిస్తాన్ ను అష్టదిగ్బంధనం చేసే ఏ చిన్న అవకాశాన్నీ భారత్ వదులుకోవడం లేదు. ఇప్పటికే సిందు నది ఒప్పందం అమలును నిలిపేయాలని నిర్ణయించిన భారత్.. అందులో భాగంగా పాకిస్తాన్ కు వెళ్లే నీటికి బ్రేకులు వేయడం ప్రారంభించింది. జమ్మూలోని చీనాబ్ నదిపై ఉన్న బాగ్లిహార్ ఆనకట్ట ద్వారా భారతదేశం నీటి ప్రవాహాన్ని నిలిపివేసిందని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. అలాగే జీలం నదిపై ఉన్న కిషన్‌గంగా ఆనకట్ట వద్ద కూడా నీటి నిలిపివేతను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. జమ్మూలోని రాంబన్‌లోని బాగ్లిహార్, ఉత్తర కాశ్మీర్‌లోని కిషన్‌గంగా వద్ద ఈ జలవిద్యుత్ ఆనకట్టలు ఉన్నాయి.
బాగ్లిహార్ ఆనకట్ట భారత్-పాకిస్తాన్ మధ్య చాలా కాలంగా వివాదం
జమ్మూ, కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడిలో 26 మంది పర్యాటకులు చనిపోయిన నేపథ్యంలో భారత్ పొరుగుదేశం పాకిస్తాన్ పై చర్యలకు అందివచ్చిన ప్రతీ అవకాశాన్నీ వాడుకుంటోంది. ఇప్పటికే దిగుమతుల్ని సైతం నిలిపేసిన కేంద్రం.. ఇప్పుడు నీటి నిలిపివేత ద్వారా గట్టి సంకేతం ఇచ్చినట్లయింది. ఇప్పటికే సింధు నది నీటిని ఆపేస్తే తీవ్ర పరిణామాలు తప్పవంటూ పాకిస్తాన్ రాజకీయ నేతలు హెచ్చరికలు జారీ చేస్తున్నా భారత్ ఇలా బాగ్లీహార్ డ్యామ్ నీటిని నిలిపేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. వాస్తవానికి బాగ్లిహార్ ఆనకట్ట భారత్-పాకిస్తాన్ మధ్య చాలా కాలంగా వివాదంలో ఉంది. పాకిస్తాన్ గతంలో ఈ డ్యామ్ పై ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వాన్ని కూడా కోరింది. ఇప్పుడు భారత్ నీటి నిలిపివేతతో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయన్న దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అలాగే మరో ప్రాజెక్టు కిషన్‌గంగా ఆనకట్ట కూడా ప్పటికే చట్టపరమైన, దౌత్యపరమైన వివాదాల్లో ఉంది.
Read Also: Pakistan: కరాచీ తీరానికి తుర్కియే గస్తీ నౌక.. రష్యాను సాయం కోరిన పాక్