ఖలిస్థానీ ఉగ్రవాద సంస్థ (Khalistani terrorist organization)లకు తమ దేశం సురక్షిత స్థావరంగా మారిందన్న ఆరోపణలను కెనడా ప్రభుత్వం (Government of Canada) తొలిసారి అధికారికంగా అంగీకరించింది. ఇప్పటి వరకు ఈ విమర్శలను కెనడా తిప్పికొట్టినా, తాజాగా వచ్చిన నివేదికతో వాస్తవాలు బహిర్గతమయ్యాయి.కెనడా ఆర్థిక శాఖ విడుదల చేసిన నివేదికలో ఖలిస్థానీ వేర్పాటువాద సంస్థలు అక్కడి గడ్డపై పనిచేస్తున్నాయన్న అంశం స్పష్టంగా ప్రస్తావించారు. వీటికి భారీగా నిధులు సమకూరుతున్నాయన్న వాస్తవం కూడా వెలుగులోకి వచ్చింది. మనీలాండరింగ్, ఉగ్రవాద నిధుల సమీకరణ ముప్పు దేశానికి ప్రధాన సమస్యగా మారిందని ఆ నివేదిక పేర్కొంది.
బబ్బర్ ఖల్సా, సిఖ్స్ ఫర్ జస్టిస్ ప్రస్తావన
ఈ నివేదికలో బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్, ఇంటర్నేషనల్ సిఖ్ యూత్ ఫెడరేషన్, సిఖ్స్ ఫర్ జస్టిస్ వంటి ఖలిస్థానీ గ్రూపుల పేర్లు స్పష్టంగా వచ్చాయి. కెనడాలోనే కాకుండా ఇతర దేశాల్లోనూ వీరు నిధులు సేకరిస్తున్నారన్న అనుమానాలు ఉన్నాయని అధికారులు తెలిపారు. భారత్‌కు వ్యతిరేకంగా ఈ గ్రూపులు పనిచేస్తున్నాయన్న వాదనకు ఈ నివేదిక బలమైన ఆధారంగా నిలిచింది.ఈ ఉగ్రవాద సంస్థలు నిధులు సమకూర్చుకోవడానికి పలు మార్గాలను అనుసరిస్తున్నాయని నివేదిక స్పష్టం చేసింది. స్వచ్ఛంద సంస్థలు, లాభాపేక్ష లేని సంస్థల ముసుగులో విరాళాలు సేకరించడం ప్రధాన పద్ధతిగా మారిందని తెలిపింది. అదనంగా డ్రగ్స్ అక్రమ రవాణా, వాహనాల దొంగతనాలు వంటి నేరాల ద్వారా కూడా డబ్బులు సేకరిస్తున్నాయని వెల్లడించింది.
ఆధునిక పద్ధతుల వినియోగం
క్రౌడ్ ఫండింగ్, క్రిప్టోకరెన్సీలు వంటి ఆధునిక మార్గాలను కూడా ఈ గ్రూపులు వాడుతున్నాయని నివేదికలో వివరించారు. ఇవి అంతర్జాతీయ ఆర్థిక లావాదేవీలను గోప్యంగా నిర్వహించడానికి పెద్ద మద్దతు ఇస్తున్నాయని అధికారులు హెచ్చరించారు.ఖలిస్థానీ గ్రూపులతో పాటు హమాస్, హిజ్బుల్లా వంటి అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలకు కూడా కెనడా నుంచి ఆర్థిక మద్దతు అందుతోందని నివేదికలో ప్రస్తావించడం గమనార్హం. గతంలో ఈ సంస్థలకు కెనడాలో బలమైన నెట్‌వర్క్‌లు ఉండేవని, ప్రస్తుతం చిన్న బృందాలుగా విడిపోయి పనిచేస్తున్నారని పేర్కొన్నారు.
భారత్ వాదనకు బలం
భారత్ గతంలో అనేకసార్లు కెనడాపై ఖలిస్థానీ ఉగ్రవాదులకు సురక్షిత వేదిక కల్పిస్తోందని ఆరోపించింది. తాజాగా విడుదలైన ఈ నివేదిక ఆ వాదనకు బలమైన ఆధారంగా మారింది. అంతర్జాతీయ వేదికలపై భారత్ చేసిన ఫిర్యాదులకు ఇది మరింత బలం చేకూర్చనుంది.కెనడా అధికారిక అంగీకారం తర్వాత, భారత్-కెనడా సంబంధాల్లో ఉద్రిక్తతలు మరింత పెరగవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఉగ్రవాద నిధుల సమీకరణపై కెనడా తీసుకునే చర్యలు భవిష్యత్‌లో కీలకంగా మారనున్నాయి.