ప్రపంచవ్యాప్తంగా తీవ్ర వాతావరణ పరిస్థితులు ప్రభావం చూపిస్తున్నాయి. ఉత్తర అమెరికాలో తుఫాన్లు, హిమపాతం, భారీ వర్షాలు ఆహార సరఫరా, ప్రజా రవాణా, విద్యుత్తు వ్యవస్థలను తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. మరోవైపు, ఆస్ట్రేలియాలో అల్ఫ్రెడ్ తుపాను తీవ్ర ప్రభావాన్ని చూపిస్తూ ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది.
వాతావరణ పరిస్థితులు
పసిఫిక్ ప్రాంతం నుంచి మరో తుఫాను ముప్పు పొంచి ఉండటంతో అమెరికాలో పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, హిమపాతం సంభవించే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. తీవ్ర మంచు కురుస్తుండటంతో కొన్ని ప్రధాన రహదారులను మూసివేశారు.టెక్సాస్, వర్జీనియా, టెన్నెసీ రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితులు దారుణంగా మారాయి.వేలాది ఇళ్లు, కార్యాలయాలకు విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది.దాదాపు 800కి పైగా విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.20కిపైగా ఇళ్లు దగ్ధమయ్యాయి, చాలా ప్రాంతాల్లో ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లేలా చర్యలు చేపట్టారు.ఈ పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వ అధికారులు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. అత్యవసర సేవలను వేగవంతం చేసేందుకు సహాయ బృందాలు రంగంలోకి దిగాయి.
అల్ఫ్రెడ్ తుపాను
ఆస్ట్రేలియాలోని తూర్పు ప్రాంతాన్ని అల్ఫ్రెడ్ తుపాను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఈ తుపాను ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తుండటంతో ప్రజా రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది.వందల సంఖ్యలో పాఠశాలలు మూసివేయబడ్డాయి.క్వీన్స్‌లాండ్, బ్రిస్బేన్ నగరంపై తుపాను ప్రభావం తీవ్రంగా ఉంది.న్యూ సౌత్ వేల్స్‌లో దాదాపు 5,000 ఇళ్లకు విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది.రహదారులపై వృక్షాలు కూలిపోవడంతో ట్రాఫిక్ భారీగా ప్రభావితమైంది.ఆస్ట్రేలియా అధికారులు ప్రజలకు తుపాను ప్రభావిత ప్రాంతాల్లో అత్యవసర సమయాల్లో తప్ప బయటకి రాకూడదని సూచించారు. సహాయక చర్యల కోసం నావికాదళ, హెలికాప్టర్ సేవలను వినియోగిస్తున్నారు.
సహాయక చర్యలు
ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టేందుకు ప్రభుత్వాలు విస్తృతంగా చర్యలు తీసుకుంటున్నాయి. అమెరికా, ఆస్ట్రేలియా ప్రభుత్వాలు ప్రజలను అప్రమత్తం చేస్తూ రెస్క్యూ టీమ్‌లు, విద్యుత్ మరమ్మతు బృందాలు, వాతావరణ శాఖ అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారు.ఈ తీవ్రమైన వాతావరణ మార్పులు మరింత పెరిగే అవకాశముందని, ప్రభుత్వాలు దీన్ని ఎదుర్కొనే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని వాతావరణ నిపుణులు సూచిస్తున్నారు.
మంచు తుఫాన్
రెండు నెలల క్రితం, అమెరికాలోని మధ్య, దక్షిణాది రాష్ట్రాల నుంచి తూర్పు తీరం వరకు తీవ్రమైన మంచు తుఫానులు, రక్తం గడ్డ కట్టే చలి జన జీవనాన్ని అతలాకుతలం చేశాయి. రోడ్లపై మంచు నిలిచిపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.