స్వేచ్ఛగా ప్రపంచాన్ని చుట్టి అనుభవాలను పంచుకోవాలనుకున్న ఓ భారతీయ ట్రావెల్ వ్లాగర్‌కు చైనా గడ్డపై ఊహించని పరిస్థితులు ఎదురయ్యాయి. అరుణాచల్ ప్రదేశ్ భారతదేశంలో భాగమని సోషల్ మీడియాలో స్పష్టంగా చెప్పిన కారణంగా, చైనా అధికారులు అతడిని లక్ష్యంగా చేసుకున్నారనే ఆరోపణలు ఇప్పుడు సంచలనంగా మారాయి.
Read also: Thailand Conflict: కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్
గ్వాంగ్‌జౌ విమానాశ్రయంలోనే అదుపులోకి
భారతదేశానికి చెందిన ప్రముఖ ట్రావెల్ వ్లాగర్ అనంత్ మిత్తల్(AnanthMittal) ఈ నెల 16న తన స్నేహితుడిని కలిసేందుకు చైనా వెళ్లారు. గ్వాంగ్‌జౌ విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్ పూర్తవుతుండగా, అక్కడి సీనియర్ అధికారి అకస్మాత్తుగా అతడిని పక్కకు తీసుకెళ్లాడు. అనంతరం ఒక రహస్య గదికి తరలించి, సుమారు 15 గంటల పాటు విచారణ చేపట్టారు.
నిర్బంధ సమయంలో తనకు కనీస అవసరాలు కూడా కల్పించలేదని అనంత్(AnanthMittal) ఆవేదన వ్యక్తం చేశారు. ఆహారం, నీళ్లు ఇవ్వకపోవడమే కాకుండా, భారత రాయబార కార్యాలయంతో మాట్లాడే అవకాశం కూడా నిరాకరించారని తెలిపారు. ఈ వ్యవధిలో తన ఫోన్లు, కెమెరాలు సహా అన్ని ఎలక్ట్రానిక్ పరికరాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారని చెప్పారు.
సోషల్ మీడియా వీడియోలే కారణమా?
గతంలో షాంఘై విమానాశ్రయంలో అరుణాచల్‌కు చెందిన మహిళ ఎదుర్కొన్న ఇబ్బందులపై అనంత్ ఓ వీడియో చేశాడు. ఆ వీడియోలో అరుణాచల్ ప్రదేశ్ భారతదేశంలో అంతర్భాగమని గట్టిగా చెప్పాడు. తాను మూడేళ్ల పాటు అక్కడే చదువుకున్నానని కూడా వెల్లడించాడు. ఆ వీడియో చైనా అధికారుల దృష్టికి వెళ్లడంతోనే ఇప్పుడు తనను టార్గెట్ చేశారని అనంత్ ఆరోపిస్తున్నారు.
విడుదలైనా… మానసికంగా కుంగిపోయిన వ్లాగర్
విచారణ ముగిసిన తర్వాత అతడిని విడుదల చేసినప్పటికీ, ఈ ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని అనంత్ చెప్పారు. చైనాలో భారతీయ పౌరుల భద్రతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయని, ఇలాంటి ఘటనలపై భారత ప్రభుత్వం కఠినంగా స్పందించాలని కోరారు. అయితే ఈ వ్యవహారంపై ఇప్పటివరకు భారత విదేశాంగ శాఖ నుంచి అధికారిక స్పందన రాలేదు. ఈ ఘటన సోషల్ మీడియాలో విస్తృత చర్చకు దారితీస్తూ, చైనా–భారత్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలకు మరో ఉదాహరణగా మారింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read also: