అమెరికా (America) లో మరోసారి కాల్పుల కలకలం చెలరేగింది. యూనియన్ కౌంటీ, పిక్నీ స్ట్రీట్‌లో మంగళవారం జరిగిన ఈ దారుణ ఘటనలో భారత సంతతికి చెందిన మహిళ దారుణ హత్యకి గురైంది.. మృతురాలిని గుజరాత్ రాష్ట్రానికి చెందిన కిరణ్ పటేల్ (Kiran Patel), 49 ఏళ్ల వయసు గల వ్యాపారవేత్తగా గుర్తించారు.
కిరణ్ పటేల్ స్థానికంగా ‘డీడీస్ ఫుడ్ మార్ట్’ అనే కన్వీనియన్స్ స్టోర్ (Convenience store) ను నిర్వహించేవారు. మంగళవారం ముసుగు ధరించిన ఒక వ్యక్తి తుపాకీతో స్టోర్‌లోకి ప్రవేశించి దోపిడీ ప్రయత్నం చేశాడు. అయితే, కిరణ్ పటేల్ భయపడకుండా అతడి దాడిని అడ్డుకోవాలని ప్రయత్నించారు. తనకు దగ్గరలో ఉన్న ఒక వస్తువును దుండగుడి వైపుకు విసిరి, మిగిలిన కస్టమర్లు, స్థానికులను పిలవడానికి ప్రయత్నించారు.
ఆమెను వదలకుండా వెంబడించి, మరిన్ని రౌండ్లు కాల్పులు జరిపాడు
దీంతో ఆగ్రహానికి గురైన దుండగుడు ఆమెపై కాల్పులకు తెగ బడ్డాడు. క్యాష్ కౌంటర్ (Cash counter) పైకి దూకి మరీ ఆమెపై బుల్లెట్ల వర్షం కురిపించాడు. ప్రాణభయంతో కిరణ్ పటేల్ స్టోర్ బయట ఉన్న పార్కింగ్ వైపు పరుగులు తీశారు. అయినా ఆ దుండగుడు ఆమెను వదలకుండా వెంబడించి, మరిన్ని రౌండ్లు కాల్పులు జరిపాడు. తీవ్ర గాయాలతో ఆమె స్టోర్ ప్రవేశ ద్వారానికి కొద్ది దూరంలోనే రక్తపు మడుగులో కుప్పకూలిపోయారు.
సమాచారం అందుకున్న వెంటనే యూనియన్ ప్రజా భద్రతా విభాగం అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కాల్పుల తర్వాత నిందితుడు అక్కడి నుంచి పరారైనట్లు గుర్తించారు. ఈ ఘటన మొత్తం స్టోర్‌లోని సెక్యూరిటీ కెమెరాల్లో రికార్డయింది. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడి కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ఉపాధి కోసం వెళ్లిన భారత సంతతి మహిళ దారుణ హత్యకు గురికావడంతో స్థానిక ప్రవాస భారతీయులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: