చైనా(China ) లోని తూర్పు ప్రావిన్సు షాన్‌డాంగ్‌లోని ఒక రసాయన కర్మాగారంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనతో ఆ ప్రాంతమంతా దట్టమైన నల్లటి పొగతో నిండిపోయిందని, ఆకాశంలో వందల అడుగుల ఎత్తు వరకు పొగ వ్యాపించిందని అధికారిక మీడియా వర్గాలు వెల్లడించాయి. పేలుడు ధాటికి సమీప ప్రాంతాలు దద్దరిల్లాయి. షాన్‌డాంగ్ ప్రావిన్సు పరిధిలోని వీఫాంగ్ నగర శివార్లలో ఉన్న ఒక ఇండస్ట్రియల్ పార్కులోని షాన్‌డాంగ్ యుడావో కెమికల్ పరిశ్రమలో ఈ భారీ విస్ఫోటనం జరిగినట్లు ప్రాథమిక సమాచారం. పేలుడు తీవ్రత ఎంతగా ఉందంటే, కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇళ్ల కిటికీ అద్దాలు కూడా పగిలిపోయాయని స్థానికులు చెబుతున్నారు. ప్రమాద విషయం తెలిసిన వెంటనే అత్యవసర సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి.ప్రమాద తీవ్రత దృష్ట్యా, చైనా ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ మంత్రిత్వ శాఖ వెంటనే స్పందించింది. సుమారు 232 మంది అగ్నిమాపక సిబ్బందిని, పలు ప్రత్యేక రెస్క్యూ బృందాలను, వైద్య నిపుణులను ఘటనా స్థలానికి తరలించి సహాయక చర్యలు ముమ్మరం చేసినట్లు ఒక ప్రకటనలో పేర్కొంది. మంటలను అదుపులోకి తెచ్చేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు.
పరిశ్రమ వివరాలు
ఈ షాన్‌డాంగ్ యుడావో రసాయన పరిశ్రమలో దాదాపు 500 మంది కార్మికులు పనిచేస్తున్నట్లు స్థానిక మీడియా కథనాలు తెలియజేస్తున్నాయి. అయితే, ఈ దుర్ఘటనలో ప్రాణనష్టం లేదా గాయపడిన వారి వివరాలపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. చైనాలో రసాయన పరిశ్రమలలో గతంలో కూడా భారీ పేలుడు ఘటనలు సంభవించాయి. మార్చి 2019లో యాంచెంగ్‌లోని ఓ కెమికల్ ఫ్యాక్టరీలో జరిగిన పేలుడులో 78 మంది మరణించారు. అలాగే, 2015లో టియాంజిన్‌లోని ఒక రసాయనాల గోదాములో జరిగిన పేలుడులో 165 మంది మరణించారు.ఈ ఘటన చైనాలోని రసాయన పరిశ్రమల భద్రతా ప్రమాణాలపై ప్రశ్నలు రేకెత్తిస్తోంది. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు నివారించేందుకు పరిశ్రమల భద్రతా ప్రమాణాలను కఠినంగా అమలు చేయడం అత్యవసరం.
Read Also: Modi: పాకిస్థాన్‌ను మరోసారి హెచ్చరించిన మోదీ