అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రూపొందించిన 20 సూత్రాల గాజా శాంతి ఒప్పందం తొలిదశకు ఇజ్రాయెల్, హమాస్(Israel-Hamas) అంగీకారం తెలిపాయి.ఇది రెండేళ్లుగా కొనసాగుతున్న యుద్ధానికి శాశ్వత ముగింపు దిశగా పడిన ముందడగని చెబుతున్నారు. సెప్టెంబర్ 29న శ్వేతసౌధంలో జరిగిన ఓ సమావేశంలో ట్రంప్ ఈ ప్రణాళికను ఆవిష్కరించారు. ఆ సమయంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు (Benjamin Netanyahu) కూడా ఉన్నారు. ఈ ప్లాన్‌లోని నిబంధనలను ఇజ్రాయెల్ అంగీకరిస్తోందని ఆయన చెప్పారు. తమ వద్ద ఉన్న మిగిలిన 48మంది బందీలను విడిచిపెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్టు అక్టోబరు 3న హమాస్ తెలిపింది. ఇందుకు బదులుగా ఇజ్రాయెల్ జైళ్లలో ఉన్న పాలస్తీనా, గాజా(Palestina-Gaza) ఖైదీలను విడుదల చేస్తారు. అలాగే గాజా పాలనను పాలస్తీనా టెక్నోక్రాట్స్‌కు అప్పగించేందుకూ అంగీకరించింది. అయితే హమాస్ మిగిలిన విషయాలపై ముఖ్యంగా ఆయుధాలను వదిలిపెట్టే విషయంపై ఎటువంటి ప్రకటనా చేయలేదు. ట్రంప్ అభివర్ణించిన విధంగా, “బలమైన, స్థిరమైన, శాశ్వత శాంతికి” బీజం పడేందుకు ప్రయత్నిస్తారు.
Nobel Prize: ట్రంప్ కు నోబెల్ బహుమతి లాభించేనా?

20 పాయింట్లు ఇవే
- గాజా పూర్తిగా టెర్రర్-ఫ్రీ జోన్‌గా (ఉగ్రవాద రహిత ప్రాంతంగా) మారుతుంది. ఇది పొరుగు దేశాలకు ఎలాంటి ప్రమాదకరంగా ఉండదు.
- భరించలేని బాధలు పడిన గాజా ప్రజల ప్రయోజనం కోసం గాజాను పునర్నిర్మించనున్నారు.
- ఇరు పక్షాల వారు ఈ ప్రతిపాదనను కనుక అంగీకరిస్తే, యుద్ధం తక్షణమే ముగియనుంది. బందీల విడుదల కోసం అంగీకరించిన హద్దుల వరకు ఇజ్రాయెల్ తన దళాలను వెనక్కి తీసుకుంటుంది. ఈ సమయంలో వైమానిక, ఫిరంగి బాంబు దాడులతో పాటు అన్ని సైనిక ఆపరేషన్లను నిలిపివేస్తుంది.
- ఇజ్రాయెల్ బహిరంగంగా ఈ ఒప్పందాన్ని అంగీకరించిన 72 గంటల్లోగా.. బందీలందర్నీ (బతికున్న, చనిపోయిన వారిని) తిరిగి అప్పగించాలి.
- బందీలు విడుదలైన తర్వాత, 250 మంది జీవిత ఖైదీలను, 2023 అక్టోబర్ 7 తర్వాత అదుపులోకి తీసుకున్న 1,700 మంది గాజా ప్రజలను ఇజ్రాయెల్ విడుదల చేయాలి. బందీలైన ఇజ్రాయెలీ ప్రతి మృతదేహానికి బదులుగా, 15 మంది చనిపోయిన గాజా ప్రజల అవశేషాలను ఇజ్రాయెల్ అప్పగించాలి.
- బందీలందర్నీ అప్పగించిన తర్వాత, శాంతియుత జీవనానికి, ఆయుధాలను విడిచిపెట్టడానికి కట్టుబడి ఉన్న హమాస్ సభ్యులకు క్షమాభిక్ష పెడతారు. గాజాను వదిలి వెళ్లాలనుకునే హమాస్ సభ్యులకు, వారిని ఆహ్వానించే దేశాలకు సురక్షితంగా వెళ్లేలా సాయపడతారు.
- ఈ ఒప్పంద అంగీకారంతో, గాజా స్ట్రిప్‌లోకి తక్షణమే పూర్తి సహాయాలను పంపిస్తారు. మానవతా సాయాల విషయంలో 2025 జనవరి 19 నాడు ఒప్పందంలో చేర్చిన వాటికి అనుగుణంగా కనీస సహాయ సహకారాలు ఉంటాయి.
- ఇరు పక్షాలకు ఎలాంటి సంబంధం లేకుండా ఐక్యరాజ్యసమితి, దాని ఏజెన్సీలు, రెడ్ క్రెసెంట్, రెండు పార్టీలతో ఏ విధంగానూ సంబంధం లేని ఇతర అంతర్జాతీయ సంస్థల ద్వారా గాజా స్ట్రిప్‌లోకి మానవతా సాయాల పంపిణీ చేస్తారు.
- పాలస్తీనా అథారిటీకి అధికారం అప్పగించడానికి ముందు గాజాను తాత్కాలికంగా రాజకీయ లక్ష్యాలు లేని టెక్నోక్రాట్స్‌తో కూడిన పాలస్తీనా కమిటీ పాలిస్తుంది. గాజాలోని ప్రజలకు రోజువారీ ప్రజా సేవలతో పాటు, మున్సిపాలిటీల సేవలను అందించే బాధ్యత ఈ కమిటీదే. ఈ కమిటీని అర్హత కలిగిన పాలస్తీనియన్లు, అంతర్జాతీయ నిపుణులతో ఏర్పాటు చేస్తారు. ఈ కమిటీని ”బోర్డు ఆఫ్ పీస్” అనే సరికొత్త ఇంటర్నేషనల్ ట్రాన్సిషనల్ బాడీ (అంతర్జాతీయ పరివర్తన సంస్థ) పర్యవేక్షిస్తుంది. ఈ సంస్థకు అధ్యక్షుడు డోనల్డ్ జే. ట్రంప్ నేతృత్వం వహిస్తారు. మాజీ ప్రధానమంత్రి టోనీ బ్లెయిర్‌తో సహా పలువురు ప్రముఖ సభ్యులను ప్రకటించాల్సి ఉంది.
- మధ్యప్రాచ్యంలో కొన్ని అభివృద్ధి చెందుతోన్న ఆధునిక అద్భుత నగరాల రూపకల్పనలో సాయపడిన నిపుణుల బృందంతో చర్చించడం ద్వారా గాజాను పునర్నిర్మించేందుకు, శక్తివంతం చేసేందుకు ట్రంప్ ఆర్థికాభివృద్ధి ప్రణాళికను రూపొందించనున్నారు. ఎ
- ప్రత్యేక ఆర్థిక మండలిని ఏర్పాటుచేసి, దానికి సంబంధించిన ఎగుమతి దిగుమతుల సుంకాలను ఈ ప్రణాళికలో భాగస్వాములైన దేశాలు చర్చల ద్వారా నిర్ణయిస్తాయి.
- గాజా నుంచి ఎవరినీ బలవంతంగా తరలించరు. గాజా నుంచి వెళ్లాలనుకునేవారికి, తిరిగి రావాలనుకునేవారికీ స్వేచ్ఛ ఉంటుంది. ప్రజలు గాజాలోనే ఉండి ‘కొత్త గాజా’ నిర్మాణానికి సహకరించేందుకు ప్రజలను ప్రోత్సహించనున్నాం.
- హమాస్, ఇతర ఫ్యాక్షన్ గ్రూపులకు గాజా పాలనలో ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగాగానీ, ఏరూపంలోనూ ఎటువంటి పాత్రా ఉండదు. గాజాలో యుద్ధపరమైన అన్ని సదుపాయాలను అంటే సొరంగాలు, ఆయుధ తయారీ స్థావరాలను నాశనం చేస్తారు. వాటిని పునర్ నిర్మించరు. గాజాను పూర్తిగా ఆయుధరహితం చేయడానికి ఒక ప్రక్రియ అమల్లోకి వస్తుంది. ఆ ప్రక్రియలో ఆయుధాలను శాశ్వతంగా నిర్వీర్యం చేస్తారు .
- హమాస్, ఇతర గ్రూపులు తమ బాధ్యతలను నిర్వర్తించేలా కొత్త గాజాతో తన ప్రజలకు గానీ, పొరుగువారికి కానీ ఎటువంటి ముప్పులేదని నిర్థరించేందుకు ప్రాంతీయ భాగస్వాములు పూచీ పడాలి.
- గాజాలో తక్షణం మోహరించడానికి తాత్కాలిక అంతర్జాతీయ స్థిరీకరణ దళాన్ని (ఐఎస్ఎఫ్) అభివృద్ధి చేయడానికి, అరబ్, అంతర్జాతీయ భాగస్వాములతో కలిసి అమెరికా పనిచేస్తుంది. ఐఎస్ఎఫ్ గాజాలోని పాలస్తీనా పోలీసు దళాలకు శిక్షణను, సహాయాన్ని అందిస్తుంది. ఈ రంగంలో విస్తృతమైన అనుభవం ఉన్న జోర్డాన్ ఈజిప్టుతో సంప్రదింపులు జరుపుతుంది.
- ఇజ్రాయిల్ గాజాను ఆక్రమించదు లేదా స్వాధీనం చేసుకోదు. ఐఎస్ఎఫ్ నియంత్రణను, స్థిరత్వాన్ని స్థాపించగానే, సురక్షితమైన గాజా తన ప్రజలకు గానీ, ఇజ్రాయెల్‌కు గానీ,ఈజిప్ట్‌కు గానీ ఎటువంటి ముప్పు కలిగించకుండా చేయాలనే లక్ష్యంతో ఐడీఎఫ్, ఐఎస్ఎఫ్, హామీదారులు, అమెరికా కలిసి కుదిర్చిన ఒప్పందం ప్రకారం ఐడీఎఫ్ తన సేనలను దశలవారీగా ఉపసంహరించుకుంటుంది. ఐడీఎఫ్ ప్రస్తుతం ఆక్రమించిన గాజా ప్రాంతాలను అవి ట్రాన్సిషనల్ అథారిటీతో జరిగిన ఒప్పందానికి అనుగుణంగా ఐఎస్ఎఫ్‌కు అప్పగిస్తాయి .
- హమాస్ ఈ ప్రతిపాదనను ఆలస్యం చేసినా లేదా తిరస్కరించినట్లయితే, ఐడిఎఫ్ నుండి ఐఎస్ఎఫ్‌కు అప్పగించిన ఉగ్రవాద రహిత ప్రాంతాలలో సహాయ కార్యక్రమాలతో సహా పైన పేర్కొన్నవి ముందుకు సాగుతాయి.
- శాంతి, సహజీవన విలువల ఆధారంగా మతాల మధ్య చర్చలను ఏర్పాటు చేయనున్నట్టు ప్రతిపాదనలో పేర్కొన్నారు. ఈ ప్రక్రియ ద్వారా, ఇజ్రాయెలీలు, పాలస్తీనీయుల మానసికధోరణలు, పరస్పర దృక్పథాలు మారాలన్నదే లక్ష్యం.
- గాజా పునర్ నిర్మాణం ముందుకు వెళుతున్న సమయంలో పాలస్తీనా అథారిటీ సంస్కరణ కార్యక్రమం నిష్ఠతో అమలయ్యే సమయంలో పాలస్తీనా ప్రజల ఆకాంక్ష అయిన స్వయం పాలన హక్కు, స్వతంత్ర పాలస్తీనా రాజ్య హోదా సాధన కోసం ఒక నమ్మదిగిన మార్గం ఏర్పడే అవకాశాలు ఉంటాయి.
- శాంతియుత సహజీవనం కోసం ఇజ్రాయెల్ పాలస్తీనియన్ల మధ్య అమెరికా చర్చలు ఏర్పాటు చేస్తుంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: