ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్యం నానాటికీ క్షీణిస్తోంది. ప్రముఖ అంతర్జాతీయ ప్రచురణ అయిన ది ఎకనమిస్ట్ కు చెందిన ఎకనమిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ (EIU) ఈ విషయాన్ని స్పష్టం చేసింది. ప్రతియేటా ఈ సంస్థ ప్రపంచంలోని 150కి పైగా దేశాల్లో ప్రజాస్వామ్య స్థాయిని అంచనా వేసి ర్యాంకులు కేటాయిస్తోంది. 2006 నుంచి కొనసాగుతున్న ఈ అధ్యయనం ఆధారంగా 2024 సంవత్సరానికి సంబంధించి “డెమోక్రసీ ఇండెక్స్ 2024” నివేదికను ప్రకటించింది. ఈ ర్యాంకుల ప్రక్రియలో దేశాలను ప్రజాస్వామ్య విలువల ఆధారంగా నాలుగు వర్గాలుగా విభజించారు సంపూర్ణ ప్రజాస్వామ్య దేశాలు, లోపభూయిష్ట ప్రజాస్వామ్య దేశాలు, హైబ్రిడ్ పాలన కలిగిన దేశాలు, నియంతృత్వ పాలన కలిగిన దేశాలు.
అత్యుత్తమ ప్రజాస్వామ్య దేశాలు
డెమోక్రసీ ఇండెక్స్ 2024 ప్రకారం, నార్వే 9.81 పాయింట్లు సాధించి వరుసగా 16వ సంవత్సరంగా ప్రపంచంలో అత్యుత్తమ ప్రజాస్వామ్య దేశంగా నిలిచింది. ఆ తర్వాత న్యూజీలాండ్, స్వీడన్, ఫిన్లాండ్, ఐస్లాండ్ దేశాలు టాప్ 5 స్థానాల్లో నిలిచాయి. వీటి ప్రజాస్వామ్య వ్యవస్థలు పౌరుల హక్కులను గౌరవిస్తూ, పూర్తి స్థాయిలో పారదర్శక పాలన అందిస్తున్నట్లు EIU నివేదిక పేర్కొంది. ఈ నివేదికలో ప్రపంచంలోని కొన్ని దేశాలు ప్రజాస్వామ్య పరంగా అత్యంత దయనీయ స్థితిలో ఉన్నట్లు స్పష్టమైంది. ఈ జాబితాలో భారత పొరుగున ఉన్న పాకిస్తాన్ (124), బంగ్లాదేశ్ (100), అఫ్ఘనిస్తాన్ (167), మయన్మార్ (166), ఉత్తర కొరియా (165) ఉన్నాయి. ఈ దేశాల్లో ఎన్నికల ప్రక్రియలో అవినీతి, మీడియా స్వేచ్ఛ లేకపోవడం, ప్రజల హక్కుల ఉల్లంఘన వంటి సమస్యలు తీవ్రంగా ఉన్నాయని ఈ నివేదిక తెలిపింది.
భారతదేశ ప్రజాస్వామ్య స్థితి
భారతదేశం 41వ ర్యాంక్‌ను పొందింది. ఆసియా ఖండంలో కొన్ని దేశాలతో పోల్చుకుంటే మెరుగైన ర్యాంక్‌లో ఉన్నప్పటికీ, భారతదేశ ప్రజాస్వామ్యం లోపభూయిష్టంగా మారుతోందని నివేదిక పేర్కొంది. 2023లో 39వ స్థానంలో ఉన్న భారత్ ఇప్పుడు రెండు స్థానాలు దిగజారి 41వ స్థానంలోకి చేరింది. రాజకీయ స్వేచ్ఛ తగ్గడం, మిడియా స్వేచ్ఛపై నియంత్రణ పెరగడం, అధికార పక్షానికి అనుకూలంగా వ్యవస్థలు పని చేయడం వంటి అంశాలు ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తున్నాయి.
ప్రజాస్వామ్యం పై ప్రభావం చూపిస్తున్న అంశాలు
ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్య స్థాయిని ప్రభావితం చేసే ప్రధాన అంశాలు కింది విధంగా ఉన్నాయి:
పౌర హక్కుల తగ్గింపు
అనేక దేశాల్లో పౌర హక్కులను పరిమితం చేసే చట్టాలు అమల్లోకి వస్తున్నాయి. దీనివల్ల వ్యక్తిగత స్వేచ్ఛ తగ్గిపోతోంది.
ఎన్నికల్లో అవినీతి, అక్రమాలు
అనేక దేశాల్లో ఎన్నికలు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా జరుగుతున్నాయి. అధికారం నిలుపుకోవడానికి అధికార పార్టీలు మోసపూరిత మార్గాలను అవలంభిస్తున్నాయి.
మీడియా స్వేచ్ఛపై నియంత్రణ
ప్రజాస్వామ్యం బలోపేతానికి మీడియా ముఖ్యమైన సాధనం. అయితే అనేక దేశాల్లో మీడియాపై కఠిన నియంత్రణలు అమలవుతున్నాయి.
రాజకీయ అస్థిరత
కొన్ని దేశాల్లో ప్రజాస్వామ్యం కొనసాగాలంటే స్థిరమైన ప్రభుత్వం అవసరం. కానీ అనేక చోట్ల రాజకీయ అస్థిరత ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తోంది. గత కొన్నేళ్లుగా యుద్ధం చేస్తున్న దేశాల్లో ప్రజాస్వామ్య సూచిక క్షీణించింది. రష్యా – ఉక్రెయిన్ మధ్య 2022 నుంచి యుద్ధం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం రష్యా డెమోక్రసీ ఇండెక్స్‌లో 150వ స్థానంలో నిలవగా, ఉక్రెయిన్ 92వ స్థానంలో నిలిచింది. రష్యాను నియంతృత్వ దేశంగా పేర్కొనగా ఉక్రెయిన్‌ను హైబ్రిడ్ పాలన అమలవుతున్న దేశంగా ఈ నివేదిక వర్గీకరించింది. ఇరాక్ సహా అనేక అరబ్ దేశాలను నిరంకుశ పాలన అమలవుతున్న దేశాలుగా నివేదిక పేర్కొంది. ఈ దేశాల్లో 2012 నుంచి స్కోర్ తగ్గుతోందని.. ఆయా దేశాల్లో సంపూర్ణ రాచరికాలు, నిరంకుశ పాలనతో పాటు కొన్ని దేశాల్లో అంతర్గత ఘర్షణల కారణంగా ఈ పరిస్థితి తలెత్తింది. మధ్యప్రాచ్యం, ఉత్తర ఆఫ్రికా దేశాల్లో ప్రజాస్వామ్యంలో ప్రజల ప్రాతినిధ్యం అత్యంత అరుదు అని నివేదిక స్పష్టం చేస్తోంది. ఇరాక్ 2018లో 4.1 స్కోరుతో ఉండగా అది 2024 నాటికి 2.8కు క్షీణించి 167 దేశాల్లో 126వ స్థానంలో నిలిచింది.
ప్రజాస్వామ్యాన్ని మెరుగుపరిచే మార్గాలు
ప్రజాస్వామ్యం బలోపేతం కావాలంటే కొన్ని కీలక మార్పులు అవసరం:
- స్వేచ్ఛాయుత ఎన్నికలు: ఎన్నికలు పారదర్శకంగా జరగాలి.
- మీడియా స్వేచ్ఛ: మీడియాపై నియంత్రణలు తొలగించాలి.
- పౌర హక్కుల పరిరక్షణ: ప్రతి పౌరుడికి సమాన హక్కులు ఉండాలి.
- పారదర్శక పాలన: ప్రభుత్వ కార్యకలాపాలు స్పష్టంగా ఉండాలి.
- న్యాయవ్యవస్థ స్వేచ్ఛ: న్యాయవ్యవస్థ రాజకీయ జోక్యం లేకుండా స్వేచ్ఛగా ఉండాలి. ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది. ప్రజాస్వామ్య విలువలు క్షీణిస్తున్న దేశాల్లో పౌర హక్కులు, మీడియా స్వేచ్ఛ, రాజకీయ సమాంతరత్వం వంటి అంశాలు లోపిస్తున్నాయి. ఈ సమస్యలు పరిష్కరించడానికి పాలకులు, పౌరులు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. లేకపోతే, ప్రజాస్వామ్యం మరింత నాశనమై, నియంతృత్వ పాలనకు దారితీయొచ్చు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రపంచ దేశాలు తగిన చర్యలు తీసుకోవాలి.