Yasin Malik: ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులు సమకూర్చాడనే కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న వేర్పాటువాది యాసిన్ మాలిక్ శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సుప్రీం కోర్టు విచారణకు హాజరయ్యాడు. ఈ సందర్భంగా ఉగ్రవాది అంటూ సీబీఐ చేసిన ఆరోపణలను మాలిక్ తోసిపుచ్చాడు. తాను రాజకీయ నాయకుడినని.. ఉగ్రవాదిని కాదని యాసిన్ మాలిక్ పేర్కొన్నాడు. గతంలో తనతో ఏడుగురు ప్రధానులు చర్చలు జరిపారని వెల్లడించాడు. జమ్మూకశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్-యాసిన్ ను కేంద్ర ప్రభుత్వం నిషేధించిందే తప్ప ఉగ్రవాద సంస్థల జాబితాలో చేర్చలేదని అన్నాడు.

35 ఏళ్ల నాటి ఉగ్రవాద కేసుల విచారణను తిరిగి ప్రారంభించారు
1994లో తనకు 32 కేసులలో బెయిల్ ఇచ్చారని.. కేసులను కూడా కొనసాగించలేదని గుర్తు చేసుకున్నాడు. గతంలో ప్రధానులుగా పనిచేసిన పీవీ నరసింహారావు, హెచ్‌డీ దేవెగౌడ, ఐకే గుజ్రాల్, వాజ్‌పేయి, మన్మోహన్ సింగ్ హయాంలోనూ తన సంస్థపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని పేర్కొన్నాడు. ప్రధాని నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన మొదటి ఐదేళ్లలోనూ మునుపటి విధానాన్నే అనుసరించారని.. కానీ, రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత అకస్మాత్తుగా 35 ఏళ్ల నాటి ఉగ్రవాద కేసుల విచారణను తిరిగి ప్రారంభించారని ఆవేదన వ్యక్తం చేశాడు.
మాలిక్‌కు ఉగ్రవాదులతో సంబంధాలు
1989లో జమ్మూలో అతడిపై నమోదైన రెండు కేసుల్లో విచారించడానికి మాలిక్‌ను అక్కడి కోర్టులో హాజరుపరచాలని అధికారులు చేసిన ప్రతిపాదనకు అనుమతి ఇవ్వొద్దని సీబీఐ సుప్రీంకు విజ్ఞప్తి చేసింది. ఆ కేసులకు సంబంధించిన విచారణను జమ్ము కోర్టు నుంచి ఢిల్లీ కోర్టుకు బదిలీ చేయాలని కోరింది. మాలిక్‌కు ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నందున అక్కడికి వెళ్తే.. ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని సీబీఐ తరఫున వాదిస్తున్న సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీంకు విన్నవించారు. ఈ క్రమంలో మాలిక్ మాట్లాడుతూ..తానేమీ ఉగ్రవాదిని కాదంటూ వ్యాఖ్యానించాడు.