హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ (హైడ్రా ),చెప్పాలంటే అక్రమార్కుల గుండెల్లో రైళ్లను పరుగెత్తిస్తోంది వ్యవస్థ. చెరువులు, కుంటలను కబ్జా చేసి కట్టిన భారీ బిల్డింగులు, అపార్ట్‌మెంట్లను సైతం నేలమట్టం చేస్తోంది.హైదరాబాద్, సికింద్రాబాద్‌లల్లో ఆక్రమణకు గురైన చెరువులను పరిరక్షించడం, వాటిలో వెలసిన అక్రమ కట్టడాలను కూల్చివేయడానికి ప్రత్యేకంగా హైడ్రా వ్యవస్థను తెరమీదికి తీసుకొచ్చింది తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. దీనికి అదనంగా మూడువేల మంది సిబ్బందినీ దీనికి కేటాయించింది. ఆక్రమణలకు గురైన మీరాలం, బమ్ రుక్ ఉద్ దౌలా, మాదాపూర్ తమ్మిడికుంట వంటి ఎనిమిది చెరువులు, 12 పార్కుల భూములను కాపాడింది హైడ్రా. ఆయా చెరువుల ఫుల్ ట్యాంక్ లెవెల్, బఫర్ జోన్‌లల్లో నిర్మితమైన కట్టడాలను కూల్చివేసింది. ఆ స్థలాలకు విముక్తి కల్పించింది. ఎఫ్టీఎల్, బఫర్ జోన్‌లల్లో అక్రమ నిర్మాణాల వల్ల సంభవించే నష్టాలపై ప్రజల్లో అవగాహన సైతం కల్పించనుంది. 1,025 చెరువులకు హద్దులను నిర్ణయించబోతోంది. ఈ హద్దులు మీరి నిర్మించిన ఇళ్లు, భవనాలు, అపార్ట్‌మెంట్లపై కొరడా ఝుళిపించడం ఖాయంగా కనిపిస్తోంది.

హైడ్రా విధులు
హైదరాబాద్, సికింద్రాబాద్ పరిధిలో గతంలో అనేక చెరువులు ఆక్రమణలకు గురయ్యాయి. బఫర్ జోన్‌లను ఉల్లంఘించి అనేక మంది పెద్ద పెద్ద భవనాలు, అపార్ట్‌మెంట్లు కట్టేశారు. దీనివల్ల వర్షాకాలంలో వరద నీరు ప్రవహించే మార్గాలు మూసుకుపోయి, నగరం ముంపునకు గురికావడం పరిపాటిగా మారింది. ఈ దుస్థితిని గమనించిన ప్రభుత్వం హైడ్రా విభాగాన్ని ఏర్పాటు చేసి, అక్రమార్కులపై చెరువుల పరిరక్షణ పేరుతో పెద్ద ఎత్తున ఆపరేషన్ ప్రారంభించింది.
హైడ్రా స్పెషల్ ఫోర్స్
ఈ ప్రాజెక్ట్‌ను మరింత బలంగా అమలు చేసేందుకు ప్రభుత్వం మూడువేల మంది సిబ్బందిని ప్రత్యేకంగా నియమించింది. రెవెన్యూ, మునిసిపల్ అధికారులు, పోలీస్ విభాగం కలిసి హైడ్రా స్పెషల్ ఫోర్స్‌గా ఏర్పడి ఆక్రమణల స్థలాలను గుర్తించి, వాటి మీద పక్కా ప్రణాళికతో ఆపరేషన్లు నిర్వహిస్తున్నారు.
ప్రజల అభిప్రాయం
కొంత మంది హైడ్రా ప్రాజెక్టును ప్రశంసిస్తున్నారు. నగర అభివృద్ధి కోసం ప్రభుత్వ ప్రయత్నాన్ని స్వాగతిస్తున్నారు. మరికొంత మంది మాత్రం తమ సంపాదన మొత్తం పెట్టి కొనుగోలు చేసిన ఇళ్లు, ప్లాట్లు కూల్చివేస్తే తమ పరిస్థితి ఏమిటి? అని ఆందోళన చెందుతున్నారు.హైదరాబాద్ నగరాన్ని వరద సమస్యల నుంచి కాపాడేందుకు, అక్రమ నిర్మాణాలను అరికట్టేందుకు హైడ్రా ప్రాజెక్ట్ కీలక భూమిక పోషిస్తోంది. నగరవాసుల మద్దతుతోనే ఈ ప్రాజెక్ట్ విజయవంతమవుతోంది.