హైదరాబాద్ నగరంలో ఈ మధ్యాహ్నం వడగండ్ల వాన పడింది పలు ప్రాంతాల్లో ఈదురు గాలులు కూడా చోటు చేసుకోవడంతో జనజీవనం పూర్తిగా దెబ్బతింది.ఉపరితల ఆవర్తన ప్రభావంతో నగరంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి బేగంబజార్, కోఠి, బషీర్‌బాగ్, నాంపల్లి, లక్డీకాపూల్, ట్యాంక్‌బండ్, అమీర్‌పేట, ఖైరతాబాద్, ప్యాట్నీ, మారేడుపల్లి ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.ఒక్కసారిగా వాన ముంచెత్తడంతో వీధులన్నీ నీటితో నిండిపోయాయి. ముఖ్యంగా ట్రాఫిక్ జంక్షన్ల వద్ద నీరు నిలవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కారు, బైక్‌లు ముందుకు కదలాలేక ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడ్డాయి. ఆఫీసులకు వెళ్లేవారు, తిరిగి ఇంటికి చేరేవారు తీవ్ర అసౌకర్యానికి లోనయ్యారు. కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ గంటల తరబడి నిలిచిపోయింది. బస్సులు, ఆటోలు, ప్రైవేట్ వాహనాలు నిలిచిపోయి నడిచే చోట్లే నిలుచున్నట్టయ్యాయి.వర్షానికి రోడ్లు పైనే కాకుండా పాదచారుల కోసం ఉన్న ఫుట్‌పాత్‌లు కూడా నీటిలో మునిగిపోయాయి.
దీంతో పాదచారులు కూడా నడవలేని పరిస్థితి ఏర్పడింది. కొన్ని కాలనీల్లో మళ్లీ డ్రైనేజీ సమస్యలతో నీరు లోపలికి ప్రవేశించిన ఘటనలూ వెలుగుచూశాయి.ఇదిలా ఉండగా, వాతావరణ శాఖ తాజా ప్రకటన ప్రకారం వచ్చే మూడు రోజులు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది.గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని హెచ్చరించింది. దీనికి తోడు ఉష్ణోగ్రతలు రెండు నుంచి మూడు డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉందని తెలిపింది. ఇప్పటికే ఉష్ణోగ్రతలు మండిపోతున్న నేపథ్యంలో అకస్మాత్తుగా వచ్చే వానల వల్ల ఆస్తి, ప్రాణ నష్టం జరగకూడదన్నది అందరి ఆకాంక్ష.
మేఘగర్జనలు, మెరుపులు కూడా ఈ వర్షాల్లో భాగంగా ఉండే అవకాశముందని అధికారులు తెలిపారు.ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, బయటికి వెళ్లేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ వర్షాలు రైతులకు ఆశ కలిగిస్తున్నా, నగరాల్లో మాత్రం సమస్యల పుట్టగా మారుతున్నాయి. డ్రైనేజీ వ్యవస్థ బలహీనంగా ఉండడంతో ప్రతి వానకూ నగర ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తక్షణమే మౌలిక సదుపాయాలు మెరుగుపరచకపోతే పరిస్థితి మరింత దారుణంగా మారే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. హైదరాబాద్ నగరంలో ఇలా ఒక్క వర్షంతో జన జీవనం స్థంభించిపోవడమే కాదు, ఆరోగ్య సమస్యలకు కారణమవుతోంది. కాబట్టి అధికారులు ముందస్తుగా చర్యలు తీసుకోవాలని ప్రజల డిమాండ్. మరికొన్ని రోజులు వర్షాలు పడే సూచనలు ఉన్న ఈ సమయంలో, ప్రతి ఒక్కరూ ముందు జాగ్రత్తలు తీసుకోవడం మర్చిపోవద్దు.
Read Also : CM Revanth : సీఎం రేవంత్ రెడ్డికి తప్పిన ప్రమాదం